చితక్కొట్టి... 'శత' క్కొట్టి... | Sakshi
Sakshi News home page

చితక్కొట్టి... 'శత' క్కొట్టి...

Published Sun, Dec 3 2017 12:58 AM

Virat Kohli, Murali Vijay pulverize Sri Lanka on Day 1 - Sakshi

ఆట మారలేదు... జోరు తగ్గలేదు... అలసట అస్సలే లేదు... మారిందొక్కటే... వేదిక! భారత్‌దే పరుగుల వేడుక! ఒక రోజు ముందు ప్రత్యర్థి కెప్టెన్‌ చండిమాల్‌ వ్యంగ్యాస్త్రాలు వేశాడు. వెళ్లేదేమో సఫారీకి, ఆడేదేమో స్పిన్‌ ట్రాక్‌లపైనా అని చమక్కులు విసిరాడు. పరుగుల వరద ఖాయమన్నాడు. మన బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతని చమక్కులకు బ్యాట్‌తో చుక్కలు చూపారు. ఫిరోజ్‌ షా కోట్లా మైదానాన్ని ‘రన్‌’రంగంగా మార్చేసి అతని వరద అంచనాన్ని ఒక్కరోజులోనే నిజం చేశారు. అలవోకగా ఆడేస్తూ సెంచరీల్ని సాధించారు. తొలి రోజే మ్యాచ్‌ను శాసించే పరిస్థితిని సృష్టించుకున్నారు. 

న్యూఢిల్లీ: భారత బ్యాట్స్‌మెన్‌ ఆడుతూ... పాడుతూ... అదరగొట్టేస్తున్నారు. ఢిల్లీ గడ్డపై లంక బౌలర్లను చితక్కొడుతున్నారు. తీరని దాహంతో ‘శత’క్కొట్టేస్తున్నారు. చివరి టెస్టులో భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌ (267 బంతుల్లో 155; 13 ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (186 బంతుల్లో 156 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో తొలి రోజే భారత్‌ భారీ స్కోరు చేసింది. ఆట నిలిచే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో కోహ్లికిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. కోల్‌కతా టెస్టులో సెంచరీ (104 నాటౌట్‌) చేసిన కోహ్లి... నాగ్‌పూర్‌ టెస్టులో డబుల్‌ సెంచరీ (213) సాధించాడు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్‌ లక్షణ్‌ సందకన్‌ 2 వికెట్లు తీయగా, పేసర్‌ గమగే, స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత్‌ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఓపెనర్‌ రాహుల్, పేసర్‌ ఉమేశ్‌ స్థానాల్లో ధావన్, షమీ బరిలోకి దిగారు.

ఆరంభం లంకది...
ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్‌ కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రాహుల్‌ స్థానంలో వచ్చిన ధావన్‌... విజయ్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయాడు. అప్పటికే నాలుగు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లే కనిపించినప్పటికీ పదో ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ (23) అవుటయ్యాడు. పెరీరా బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత పుజారా (23; 4 ఫోర్లు) క్రీజులోకి వచ్చినప్పటికీ ఎక్కువసేపు నిలువలేక గమగే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దీంతో భారత్‌ 78 పరుగులకే రెండు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విజయ్‌కి కోహ్లి జతయ్యాడు. ఇద్దరు కలిసి ముందుగా జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఆ తర్వాత బౌండరీలతో జోరు చూపెట్టిన విజయ్‌ (67 బంతుల్లో; 7 ఫోర్లు) లంచ్‌ బ్రేక్‌కు కాసేపు ముందే ఫిఫ్టీని పూర్తిచేసుకున్నాడు. 116/2 స్కోరు వద్ద తొలి సెషన్‌ ముగిసింది.

ఆధిపత్యం మొదలైంది...
విజయ్, కోహ్లి జోడీ నిలదొక్కుకోవడంతో భారత్‌కు పరుగులు... లంకకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. ముఖ్యంగా కోహ్లి... సొంతగడ్డపై వన్డేను తలపించేలా ధాటిగా ఆడాడు. చూడచక్కని బౌండరీలతో (52 బంతుల్లో, 10 ఫోర్లు) అర్ధసెంచరీని అధిగమించాడు. దీంతో మరో వికెట్‌ పడకుండా భారత్‌ 200 పరుగులు చేరుకుంది. చైనామన్‌ స్పిన్నర్‌ సందకన్, పేసర్లు లక్మల్, గమగే చేసేదేమీ లేక చేష్టలుడిగిపోయారు. కోహ్లి జోరుకు అండగా నిలబడిన విజయ్‌ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికిది టెస్టుల్లో 11వ సెంచరీ. మరోవైపు కోహ్లి శతకానికి చేరువకాగా... టీ విరామ సమయానికి భారత్‌ 57 ఓవర్లలో 245/2 స్కోరు చేసింది.

కొడితే షాట్లు... నిలిస్తే సెంచరీలా!
టీ విరామం తర్వాత కాసేపటికే కోహ్లి శతకం పూర్తయింది. చిత్రంగా  కోహ్లి తన టెస్టు కెరీర్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ (52 బంతుల్లో)ని, సెంచరీ (110 బంతుల్లో)ని ఈ మ్యాచ్‌లోనే చేయడం విశేషం. ఓపెనర్, కెప్టెన్‌ ఇద్దరూ సెంచరీ పూర్తయ్యాక కూడా తాజాగా ఆడుతున్నట్లే ఆడారు. స్కోరును 72వ ఓవర్లోనే 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో వీరిద్దరు 150 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు జట్టు స్కోరు 361 పరుగుల వద్ద విజయ్‌ని స్టంపౌట్‌ చేయడం ద్వారా సందకన్‌ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు 283 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన రహానే (1) కూడా సందకన్‌ బౌలింగ్‌లోనే స్టంపౌట్‌ కాగా... రోహిత్‌ శర్మ (6 బ్యాటింగ్‌)తో కలిసి కోహ్లి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

►20 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తక్కువ (105) ఇన్నింగ్స్‌లో 20 సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. బ్రాడ్‌మన్‌ (55 ఇన్నింగ్స్‌), సునీల్‌ గావస్కర్‌ (93), హేడెన్‌ (95), స్టీవ్‌ స్మిత్‌ (99) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా కోహ్లి కెరీర్‌లో ఇది 52వ శతకం.

11 భారత్‌ తరఫున టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న 11వ బ్యాట్స్‌మన్‌ కోహ్లి. గావస్కర్‌ (95), సెహ్వాగ్‌ (99), సచిన్‌ టెండూల్కర్‌ (103) తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

50 కెప్టెన్‌ హోదాలో టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడానికి కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్‌ సంఖ్య. ఈ జాబితాలో బ్రాడ్‌మన్‌ (37 ఇన్నింగ్స్‌), జయవర్ధనే (48), గ్రాహమ్‌ గూచ్‌ (49) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌పై అడిలైడ్‌ యాషెస్‌ టెస్టులో ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ కూడా 50 ఇన్నింగ్స్‌లోనే 3 వేల పరుగులు పూర్తి చేశాడు.

6 టెస్టుల్లో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆరో భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లి. గతంలో విజయ్‌ హజారే, పాలీ ఉమ్రిగర్, సునీల్‌ గావస్కర్, వినోద్‌ కాంబ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌ ఈ ఘనత సాధించారు.

283 కోహ్లి, విజయ్‌ మూడో వికెట్‌కు 283 పరుగులు జోడించి శ్రీలంకపై ఏ వికెట్‌కైనా భారత్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అజహరుద్దీన్‌–కపిల్‌ దేవ్‌ (ఆరో వికెట్‌కు 272 పరుగులు; 1986లో) పేరిట ఉంది.

1 శ్రీలంక తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా దిల్‌రువాన్‌ పెరీరా (25 టెస్టుల్లో) గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్‌ (27 టెస్టుల్లో) రికార్డును అతను అధిగమించాడు.

436 మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌ (435; 1999–2000 న్యూజిలాండ్‌పై) పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌ ద్వారా కోహ్లి (436 పరుగులు) బద్దలు కొట్టాడు.  

1 కెప్టెన్‌గా వరుసగా మూడు సెంచరీలను రెండు పర్యాయాలు చేసిన ఏకైక సారథిగా కోహ్లి నిలిచాడు. 2014–2015 సీజన్‌లో ఆస్ట్రేలియాపై తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నపుడు కోహ్లి వరుసగా 115, 141, 147 పరుగులు చేశాడు.

గ్రీజ్‌మన్‌ శైలి వేడుక, డాబ్‌ డాన్స్‌ పోజు 
న్యూఢిల్లీ: భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌ తన 11వ సెంచరీ పూర్తికాగానే రొటీన్‌కు భిన్నంగా వేడుక చేసుకున్నాడు. అట్లెటికో మాడ్రిడ్‌ స్టార్, ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌ ఆంటోని గ్రీజ్‌మన్‌ తరహాలో రెండు చేతుల్ని పైకి కిందికి జిగ్‌ జాగ్‌గా ఊపి సంబరం చేసుకున్నాడు. తనను అభినందించడానికి పిచ్‌ మధ్యలోకి వచ్చిన కోహ్లితో కలిసి డాబ్‌ డాన్స్‌ పోజు ఇచ్చాడు. ఇద్దరు ఒకేసారిగా ఎడమ చేతుల్ని ఏటవాలుగా వంచి తలలు జోడించి పోజిచ్చారు. దీనిపై స్పందించిన ఐసీసీ ట్విట్టర్‌లో అభినందించింది.  

Advertisement
Advertisement