సమ్సోను చేసిన మూడు తప్పిదాలు

13 May, 2018 01:33 IST|Sakshi

సమ్సోను బలవంతుడే కాదు, తెలివైనవాడు కూడా. కాని తల్లిదండ్రుల కన్నా తానే  తెలివైనవాడిననుకొని  వారు వారిస్తున్నా వినకుండా అన్యురాలైన ఫిలిష్తీయుల  అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళికాస్తా పెటాకులై సమస్యలు రాగా, 300 నక్కల్ని పట్టుకొని, వాటి తోకలకు దివిటీలు కట్టి రాత్రిపూట వాటిని ఫిలిష్తీయుల పొలాల్లోకి పంపి, వారి చేలన్నీ తగులబెట్టి తన పగా, ఆగ్రహం చల్లార్చుకున్నాడు. జిత్తులమారి జంతువైన ఒక్క నక్కను పట్టుకోవడమే గగనమంటారు వేటగాళ్లు. కాని 300 నక్కలని పట్టుకున్నాడంటే సమ్సోను ఎంత తెలివైనవాడై ఉండాలి?  కాని అతని తెలివితేటలు, నేర్పరితనం అతని పెళ్లిని కాపాడలేకపోయాయి.

తన తల్లిదండ్రులకన్నా తానే తెలివైనవాడిననుకొని వైవాహిక జీవితాన్ని పాడుచేసుకోవడం అతను చేసిన మొదటి తప్పు. తాను దేవునికన్నా తెలివైనవాడిననుకొని అతను రెండవ తప్పు చేశాడు. మొదటి పెళ్లి పాడైనా, స్వజనుల్లోనే ఒకమ్మాయిని అతను పెళ్లి చేసుకొని స్థిరపడి ఉంటే సమస్య అంతటితో సమసిపోయి ఉండేది. తనతో పెళ్లి కాని స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వ్యభిచారమని దేవుడు స్పష్టంగా చెబితే, ఆ ఆజ్ఞను అతను పెడచెవిని పెట్టి స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకుపోయి అనేకమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అలా అతని పతనానికి కారణమైన దెలీలా ఉచ్చులో చిక్కాడు.

విశ్వాసి వివాహం చేసుకొని తన భార్యతో చక్కగా కాపురం చేసుకొంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి. లేదా స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలనుకుంటే మంచి బ్రహ్మచారిగా జీవించవచ్చు. కాని  సమ్సోను పెళ్లి చేసుకోకుండా, బ్రహ్మచారిగానూ బతక్కుండా, పరస్త్రీలతో ’సహజీవనం’ ఆరంభించాడు.  ఇది పచ్చి వ్యభిచారమే!! అంటున్నాడు దేవుడు. నేటి నవనాగరికతలో ఇది ప్రధానభాగమైంది. ఈనాడు యువతీయువకులు పెళ్లి కాకుండానే సహజీవనం చెయ్యడం సాధారణమైంది. క్రైస్తవం దీనిని ఒప్పుకోదని తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి వారికి చర్చిల్లో కూడా ఆమోదముద్ర వెయ్యకూడదు. ఇలా వివాహేతర సహజీవనం చేసేవాళ్ళు క్రైస్తవానికి, మన సమాజానికి కూడా చీడపురుగుల్లాంటివాళ్ళని గమనించాలి.

పోతే తాను సాతాను కన్నా తెలివైవాడిననుకొని సమ్సోను మూడవ పొరపాటు చేశాడు. సాతాను చేస్తున్న కుట్రలో భాగంగానే తాను దెలీలాకు దగ్గరయ్యానని అతను గ్రహించలేదు సరికదా, దెలీలా ఎంత, సాతాను ఎంత? అన్న అతినమ్మకంతో కూడిన దూకుడు ధోరణిలో వెయ్యిమంది దెలీలాలు కూడా తననేమీ చేయలేరని అతను భావించాడు. మన శత్రువైన సాతాను మనకన్నా బలవంతుడు, తెలివైనవాడేమీ కాదు నిజమే, కాని అతడు చాలా యుక్తిపరుడని మర్చిపోవద్దు (ఆది 3:1). ఒక పరస్త్రీ వ్యామోహంలో పడి తన రహస్యాలన్నీ బట్టబయలు చేసుకొని సైతానుకు లోకువయ్యాడు, శత్రువులకు బందీగా చిక్కి తన జీవితాన్ని మధ్యలోనే విషాదాంతం చేసుకున్నాడు.

ఈ మూడు పొరపాట్లు చేసే వాళ్లకు సమ్సోను ఉదంతం గుణపాఠం కావాలి. మన తల్లిదండ్రుల కన్నా మనకు ఎక్కువ పట్టాలు, డిగ్రీలుండొచ్చు. కాని జీవితం వాళ్లకు నేర్పిన జ్ఞానం ముందు మనది మిడిమిడి జ్ఞానమే. దేవుని ప్రతి ఆజ్ఞా మన జీవితాలను శాంతి మార్గంలో నడిపేదేనని తెలుసుకొని, వాటిని పాటించాలి, అలా దేవుణ్ణి ఘనపర్చాలి. సాతానుకు భయపడొద్దు, కాని నిష్కపటంగా జీవిస్తూనే  సాతానుకు దూరంగా  జాగ్రత్తగా, వివేకంతో మెలగాలి (మత్తయి 10;16), సులువుగా చిక్కుల్లో పడే ప్రతి పరిస్థితికీ  అలా దూరంగా ఉండాలి. తన బలంతో ఎంతోమందిని మట్టికరిపించిన సమ్సోను తనను తాను నిగ్రహించుకోలేని బలహీనుడయ్యాడు.. దేవునికి, ఆయన సంకల్పాలకు దూరమై, విశ్వాసి ఎలా బతకకూడదో అందుకు ఉదాహరణ అయ్యాడు..

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు