అలాంటి దానివల్ల ప్రయోజనం ఏమిటి?

27 May, 2018 00:52 IST|Sakshi

తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నన్ను వెంబడించేందుకు అనర్హుడు అన్నాడు ఒకసారి యేసుప్రభువు (మత్తయి 10:38).అవమానానికి, క్రూరత్వానికి, ఓటమికి, శాపానికి, పాప శిక్షకు మరో రూపమైన సిలువను, దైవత్వానికి మానవరూపిగా అందరి ఆరాధనలకు పాత్రుడైన యేసుప్రభువు మోసి అదంతా భరించడమే ఎంతో అనూహ్యమైన విషయమైతే, నా అనుచరులు కూడా సిలువను మోయాలని ప్రభువు పేర్కొనడం, యేసు అనుచరులుగా విశ్వాసుల పాత్ర ఎంత క్లిష్టమైనదో తెలుపుతోంది. యేసుప్రభువు కప గురించి మనమంతా తరచుగా మాట్లాడుతాం, అతిశయపడతాం కూడా!! కానీ యేసుకోసం జీవించడమంటే, సిలువను మోయడమన్న యేసు నిర్వచనాన్నిమాత్రం కావాలనే విస్మరిస్తాం.

ఇదే నేటి మన ప్రధాన సమస్య. చాలామంది సత్‌ క్రైస్తవులకు, క్రైస్తవ పండితులకే ఇది మింగుడుపడని విషయం. ప్రతిపనినీ సులభంగా, శ్రమ లేకుండా కంప్యూటర్ల సహాయంతో చేసుకునే నేటి సరళ జీవనశైలి లో, మనం సిలువను మోయడమేమిటి? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సిలువను మోయడమంటే ఏమిటి? అన్నది తెలుసుకునే ముందు మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. యేసుప్రభువు ఏవేవో ఆకర్షణలు, ఆశలు, లాభాలు ముఖ్యంగా గొప్ప జీవితాన్ని ఎరగా వేసి  మనల్ని తన అనుచరుల్ని చేసుకోలేదు. ఆయనది లోక విధానాలకు పూర్తిగా విరుద్ధమైన శైలి. లోకం అనేక ప్రలోభాలు చూపి ప్రజల్ని ఆకర్షించుకొంటుంది.

నేటి క్రైస్తవంలో కూడా అదే జరుగుతోంది. క్రైస్తవులు తమకు ‘అనుకూలమైన’ పరిచారకులు, చర్చిలకోసం తెగ వెదుక్కొంటున్నారు. యేసును నమ్ముకుంటే మీరడిగిందల్లా ఇస్తాడని బోధించేవారు ఈరోజు సెలెబ్రిటీలు. అలా బోధించే చర్చీలు నిండిపోయి కాసుల వర్షం కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలకు కావలిసింది ఇదే. కానీ నన్ను వెంబడిస్తే మీ జీవితం వడ్డించిన విస్తరి అవుతుందని యేసు ఎన్నడూ బోధించలేదు. మిమ్మల్ని లోకపరంగా గొప్పవారిని చేస్తానని ఆయన అనలేదు. కానీ లోకాన్ని సుసంపన్నం చేసేంతగా ఆశీర్వాదకారకులవుతారని మాత్రం చెప్పాడు(అపో.కా 3:25).

కానీ స్వచ్ఛందంగా సిలువను మోస్తూ తనను వెంబడించడమే నిజక్రైస్తవమని యేసుప్రభువు స్పష్టం చేశాడు. యేసు మోయడంతో  చరిత్రలో సిలువ అర్ధమే మారిపోయింది. లోకానికి పాపక్షమాపణను ప్రసాదించడమే కాక, తనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారినందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసుప్రభువు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పాడు. ఆ క్షమాపణే ప్రధాన ఇతివృత్తంగా క్రైస్తవ విశ్వాసి జీవితం సాగాలన్నదే యేసుప్రభువు అభిమతం.

‘సిలువను మోస్తూ నన్ను వెంబడించండి’ అంటే మీ జీవితంలో క్షమాపణా పరిమళం నిండనివ్వండి అని అర్థం. ఎవరిని క్షమించాలి? అనడిగితే ‘అందరినీ’ అంటాడు ప్రభువు. పైగా ప్రభువు సిలువను మోసింది మానవాళికి పాపక్షమాపణను ప్రసాదించడం కోసం, లోక కళ్యాణం కోసం. విశ్వాసి బతకవలసింది కూడా పొరుగువారి క్షేమం కోసం, పదిమందికీ తద్వారా సమాజానికి మేలు చేయడానికే అన్నది ‘సిలువను మోయండి’ అని చెప్పడంలో యేసు ఉద్దేశ్యం. ‘సిలువ వేయడం’ మాత్రమే తెలిసిన లోకానికి యేసు ఇలా ‘సిలువ మోయడం’ నేర్పాడు. ఆ ఉద్యమాన్ని తన అనుచరులు ముందుకు తీసుకెళ్లాలని ఆశించాడు.

ఈనాడు ‘నేను, నాకుటుంబం’ అనే పరిధిని దాటి ఆలోచించలేని స్వార్థంలో మనమంతా కూరుకుపోయాము. మరి  ’నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా  నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్నమూలస్తంభం లాంటి క్రీస్తు ప్రబోధాన్ని ఈరోజుల్లో పట్టించుకునేదెవరు? సిలువను మోయడమంటే క్షమిస్తూ బతకడం, పదిమందికోసం బతకడం అని యేసు సిలువను మోసి నిరూపించాడు, అదే ఆయన మనకు బోధించాడు. క్షమాపణాస్వభావం లేని, పొరుగువాని క్షేమాన్ని గురించి ఆలోచించలేని, లోకాన్ని ప్రభావితం చెయ్యలేని ’బలహీన క్రైస్తవాన్ని’ యేసు ప్రబోధించలేదు. ఒకవేళ మనమంతా అనుసరిస్తున్నది అదే క్రైస్తవమైతే జాగ్రత్తపడవలసిన సమయమిది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు