టైప్-3 డయాబెటిస్..!

13 Nov, 2015 23:56 IST|Sakshi
టైప్-3 డయాబెటిస్..!

ఇప్పటికి మనకు కొన్ని రకాల డయాబెటిస్‌లు బాగా తెలుసు. అందులో ప్రధానమైనవి టైప్-1. టైప్-2. జెస్టేషనల్ డయాబెటిస్. కొన్ని అరుదైన రకాలూ తెలుసు.  ఇప్పుడు మరో రకం డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. ఈ రకం డయాబెటిస్ పేరే... ‘టైప్-3 డయాబెటిస్’. ఇది వృద్ధాప్యంలోని వారికి వచ్చే అల్జైమర్స్ డిసీజ్‌తో ముడిపడి ఉంది. నేడు ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా కొన్ని వివరాలు...

 టైప్-3 డయాబెటిస్ అంటే...
 రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించే ‘ఇన్సులిన్’ హార్మోను సరిగా పని చేయకపోవడాన్నే టైప్-2 డయాబెటిస్ అంటారు. ఇటీవలే యూఎస్‌కు చెందిన రోడ్స్ ఐలాండ్‌లోని బ్రౌన్ మెడికల్ స్కూల్ వాళ్లు ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకున్నారు. ఇన్సులిన్ హార్మోను కేవలం పాంక్రియాస్ నుంచి మాత్రమే గాక... మెదడు నుంచీ స్రవిస్తుందట. ఈ అంశమే అల్జైమర్స్‌కూ, డయాబెటిస్‌కూ మధ్యన వారధిగా నిలిచింది. ఇప్పుడు అల్జైమర్స్‌తో పాటు దాని వల్ల కలిగే మతిమరపు కలిపి ‘డయాబెటిస్-3’గా రూపొందిందనేది కొందరి కొత్త పరిశోధనలు చెబుతున్న అంశం. మరికొందరు పరిశోధకులు ‘అల్జైమర్స్’నే టైప్-3 డయాబెటిస్ అంటున్నారు. అయితే అల్జైమర్స్‌నే టైప్-3 డయాబెటిస్ అని పిలిచే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టైప్-3 డయాబెటిస్ అనేది చక్కెరవ్యాధిలోని ఒక ‘హైబ్రీడ్’ రకమని మరికొందరు పరిశోధకుల అభిప్రాయం. ఇది మెదడుకు వచ్చే ఒక రకం డయాబెటిస్ అని మరికొందరు పరిశోధకుల మాట.
 అల్జైమర్స్ అంటే... టైప్-3 డయాబెటిస్ అల్జైమర్స్‌కు పర్యాయపదంగా అనుకునే ముందు... అసలు అల్జైమర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మతిమరపు చాలా సాధారణం. అయితే అల్జైమర్స్‌లో వచ్చే మతిమరపు ఎలాంటిదంటే అసలు డ్రైవింగ్‌నే మరచిపోతాం. అయితే బాల్యజ్ఞాపకాలు అంత తేలికగా పోవు. కానీ కొత్తగా ఏర్పడ్డవి, బాల్యం, యౌవనం ఆ తర్వాత మెమరీలోకి వచ్చినవీ చెరిగిపోతుంటాయి. అల్జైమర్స్ జన్యువులతో ముడిపడి ఉంటుంది.

అల్జైమర్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో బీటా అమైలాయిడ్ ప్లాక్ అనే ఒక రకం ప్రోటీన్ మెదడు కణాల స్థానంలో చేరుతుంటుంది. దీనివల్ల అల్జైమర్స్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దాంతోపాటు మన జీవనశైలి, ఆహారం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం వంటివీ దీన్ని ప్రేరేపిస్తాయి.

టైప్-2 డయాబెటిస్ లాగే జీవనశైలితో... అల్జైమర్స్-వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులోని కణాలు నాశమైపోవడం వల్ల వచ్చే వ్యాధి. డయాబెటిస్‌లాగే జీవనశైలి... అంటే ఫాస్ట్‌ఫుడ్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, ఎక్కువ సేపు కూర్చొని ఉండే ఉద్యోగాల వల్ల ఇది వస్తుంది.

ప్రధాన కారణం... ఎలక్ట్రో పొల్యూషన్: టైప్-3 డయాబెటిస్‌కు ఎలక్ట్రోపొల్యూషన్) వంటివి ప్రధాన కారణం అని పరిశోధకుల అభిప్రాయం. అంటే మన ఆధునిక జీవితంలో ఎక్కువగా వాడుతున్న హైఎండ్ సెల్‌ఫోన్లు, ఐపాడ్, అత్యాధునిక ఫ్లోరెసెంట్ బల్బులతో పాటు అత్యాధునిక ఎలాక్ట్రానిక్ సాధనాలు టైప్-3 డయాబెటిస్‌ను పెంచుతున్నాయని పరిశోధకులు మాట.

 లక్షణాలు, నిర్ధారణ: టైప్-2 డయాబెటిస్‌లాగా దీనికి పెద్ద జాబితా ఏదీ లేదు. తీవ్రమైన మతిమరపు, జ్ఞాపకశక్తిని క్రమంగా కోల్పోవడం, అయోమయం వంటి లక్షణాల ద్వారా ఇది అల్జైమర్స్‌తో సరిపోలుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి లక్షణాలు చాలా సాధారణం కాబట్టి టైప్-3 డయాబెటిస్ నిర్ధారణ కష్టమవుతుంది. కానీ ఎమ్మారై స్కానింగ్ (బ్రెయిన్) ద్వారా దీన్ని అంటే టైప్-3 డయాబెటిస్‌ను నిర్ధారణ చేస్తారు.

నివారణ: టైప్-2 లాగే ఆహారంలో నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోకపోవడంతో పాటు ఆకుకూరలు, కాయగూరలూ ఎక్కువగా తీసుకోవడం, మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం వంటి మంచి జీవనశైలితో దీన్ని నివారించవచ్చు.
 
 

>
మరిన్ని వార్తలు