ఎయిడ్స్‌ విధ్వంసాన్ని నివారిద్దాం!

1 Dec, 2023 05:30 IST|Sakshi

సందర్భం

మానవ చరిత్రలో ఎయిడ్స్‌ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్‌లో బయటపడిన ఎయిడ్స్‌ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్‌ జబ్బుకు దారి తీసే హెచ్‌ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్‌ జబ్బుతో మరణించారు.

చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్‌ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్‌ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది.

ఎయిడ్స్‌ జబ్బుకి కారణమైన హెచ్‌ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్‌ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్‌ఐవీ ప్రబలంగా వ్యాపించింది.

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్‌తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్‌ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్‌ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్‌తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులున్నారని అంచనా.

సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్‌వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్‌ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్‌ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. 

వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్‌ఐవీ / ఎయిడ్స్‌ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్‌ డ్రగ్‌)ను మొదట హెచ్‌ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్‌గా పిలుస్తున్న అజిడోథైమిడిన్‌ మందును క్యాన్సర్‌ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్‌ ఔషధం హెచ్‌ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది.

అందువల్ల అజిడోథైమిడిన్‌ని హెచ్‌ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్‌ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్‌ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్‌పోజర్‌ ప్రొఫై లాక్సిస్‌’ అంటారు. ఇది హెచ్‌ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం.

ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్‌ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్‌ జబ్బుకి దారి తీసే హెచ్‌ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్‌ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది.  ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్‌ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్‌ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్‌ ఎయిడ్స్‌’ పిలుపునిచ్చింది.
డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ 
వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్‌: 94406 77734
(నేడు ప్రపంచ ఎయిడ్స్‌ డే)

మరిన్ని వార్తలు