కలికి గాంధారివేళ

18 Nov, 2019 00:20 IST|Sakshi

పరమార్థం

కలికి అంటే అందమైన స్త్రీ. గాంధారి చాలా అందగత్తెట. గుడ్డివాడు ధృతరాష్ట్రుడికిచ్చి చేశారు. మనసులో ఆమెకిష్టం లేదు చేసుకోవటం. కాని చేసుకొంది. చేసుకున్న క్షణం నుంచి తనను తాను హింసించుకోవటం మొదలుపెట్టింది. పతివ్రతా లక్షణం అని పైకి అందరూ అనుకోవటమేగాని లోలోపల అందరికీ తెలుసు, ఈమె వల్ల ధృతరాష్ట్రుడికి ఏ సాయం లేకపోగా, ఇంకో బరువు వచ్చి మీద పడిందని. మొగుడు గుడ్డివాడైనా, భార్యకు కళ్లుంటే వాడికీమె కళ్లతో సమానం. ఆ అదృష్టానికి నోచుకోలేదు ధృతరాష్ట్రుడు. ఈమె కళ్లకు గంతలు కట్టుకొని గుడ్డిదానిలా తయారైంది. మహారాజు, మహారాణి కాబట్టి రోజులు గడిచాయి. పదిమంది సేవకులు ఎప్పుడూ అందుబాటులో వుండేవారు.

ఇది శబ్దమయ ప్రపంచం. ఎప్పుడూ శబ్దిస్తూనే వుంటుంది. పగలు చేసే రణగొణ ధ్వనులు ఎప్పుడూ మనకు వినపడుతోనే వుంటాయి. చీకటి పడుతున్నకొద్దీ మోతలు తగ్గుతవి. తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాని భూమ్మీద సమస్త జంతుజాలమూ ఏదో శబ్దం చీకటి వేళ కూడా చేస్తూనే వుంటుంది. కుప్ప నూర్పిళ్ల కాలంలో రాత్రిళ్లు పొలంలో కాపలా పడుకునేవాళ్లకి తెలుసు ఈ సంగతి. గంట గంటకూ చెట్టుమీద గూడుకట్టుకొన్న పక్షులు పక్కకు ఒత్తిగిల్లుతుంటవి. రాత్రిపూట అల్లా ఒత్తిగిలుతున్నప్పుడు కువకువ శబ్దం వినవస్తుంది. తెల్లవారు జామున వినవచ్చేది కలకలారావం. రాత్రివేళ వాటి గొంతుల్లోంచి గురగురమని శబ్దం వినిపిస్తుంది.

కాని ఒక సమయం వుంది. రాత్రి ఒంటిగంట రెండు మధ్య. అప్పుడు ఆకు కదలదు. గాలి వీచదు. ఒక్క పక్షి ఒత్తిగిలదు. గొంతు గురగుర అనదు. సమస్త ప్రాణికోటి సుషుప్తి అనుభవిస్తూ వుంటుంది.

అప్పుడు గాంధారికి జాగ్రదవస్థ. లేచి కళ్లకు కట్టుకొన్న గంతలు విప్పదీసేది. స్నానానికి వెళ్లేది. అక్కడ సేవకురాండ్రు ఈమెకు స్నానం చేయించేవారు. స్నానం అయ్యాక కొత్త బట్టలు కట్టుకునేది. మళ్లీ కళ్లకు గంతలు కట్టుకునేది. యథాప్రకారం రోజువారీ కార్యక్రమాల్లో మొగుడితోపాటు పాల్గొనేది. ఇది రాణివాసంలో ప్రతి రాత్రివేళ నిత్యం జరిగేటిది. రహస్యంగా జరిగేటిది. బయటకు పొక్కే వీలులేదు. ఈ రహస్యం ధృతరాష్ట్రుడికిగాని, దుర్యోధనుడికిగాని, తెలియదు. భీష్ముడికి తెలియదు. విదురుడికి తెలియదు. ఒక్క మగవాళ్లకేంటి, ఆడవాళ్లకెవరికీ తెలియదు. కోడళ్లకెవరికీ తెలియదు. కుంతికి తెలియదు. వ్యాసుడికీ తెలియదట. తిక్కనకు అంతకంటే తెలియదట.

మరెవరికి తెలుసు? స్నానం చేయించే ఆ సేవకురాండ్రకు తెలుసు. వాళ్లలో వాళ్లు ఉండబట్టలేక ఇంట్లో చెప్పుకునేవారు. అట్లా ఈ రహస్యం ఆ కుటుంబాల్లో ఒక తరం తరువాత ఇంకో తరానికి తెలివిడి పడుతూ వచ్చింది.

రాజుల రాజ్యాలు మట్టిగొట్టుకు పోయాయి. వాళ్లు నామరూపాలు లేకుండా పోయారు. కాని అప్పటి పరిచారికలు చావకుండా ఈ గడ్డమీద బతికేవున్నారు. వాళ్ల సంతానం కొందరు బైండ్లవారయినారు. కొందరు బుడబుక్కల వారయినారు. చిందుభాగవతులయినారు. నానారకాలుగా జీవించటం మొదలుపెట్టారు. ‘‘ఈ కథ ఇట్లా మా బైండ్లవారి యింట్లో వుంది. దీన్ని మా ముత్తవ్వ నాకు జెప్పింది. నేను నీకు నేడు చెప్తున్నా. కలికి గాంధారివేళ అంటే ఏమిటో ఎరుక అయ్యెనా? మొత్తం ప్రపంచం అంతా ఏమాత్రం అలికిడి లేకుండా రాత్రి గాఢనిద్రలో మునిగిన వేళ కలికి గాంధారి లేచి స్నానం చేసేటిది. ఆ వేళని కలికి గాంధారి వేళ అంటారు.’’ (గుడిపూడి సుబ్బారావుకు ఒక బైండ్ల అతను చెప్పిన వివరం.)

(సౌజన్యం: కృపావర్షం)
-దీవి సుబ్బారావు

మరిన్ని వార్తలు