ప్రమాదము.. ప్రేమ

9 Mar, 2019 00:19 IST|Sakshi

మనుషులు ప్రేమలో పడ్తారు. పడడం ప్రమాదమేగా?జరిగింది అదికాదు.. ఒక ఉన్మాదం ప్రమాదమైంది ప్రేమలో పడినవాళ్లు మాత్రం..పడిలేచారు.. లేచి నడిచారు!!

‘‘మీరు మహిళల తరపున నిలబడ్తారని... వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తారని మీ దగ్గరకు వచ్చాను’’‘‘చెప్పండి.. మీకేం హెల్ప్‌ కావాలి?’’‘‘నాకు విడాకులు కావాలి’’‘‘అయితే అన్ని విషయాలు నిజాయితీగా చెప్పాలి’’‘‘తప్పకుండా’’ఈ  సంభాషణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘‘ఫైర్‌బ్రాండ్‌’’ అనే మరాఠీ సినిమాలోనిది.  ముంబైలో సక్సెస్‌ఫుల్‌ లాయర్‌.. మహిళా పక్షపాతి. న్యాయం తరపున నిలబడుతుంది.  .గృహ హింసకు బలవుతున్న  వివాహితులకు తగిన భరణంతో విడాకులు ఇప్పిస్తుంటుంది

పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మారు మాట్లాడకుండా.. తమ భార్యలకు ఆస్తిలో వాటా ఇచ్చేలా వాదిస్తుంది. ఆమె తమ కేస్‌ తీసుకుందంటే చాలు జీవితకాలపు భరోసాతో ఉంటారు స్త్రీలు. అందుకే ఒక బాధితురాలు ఆమెను అలా రిక్వెస్ట్‌ చేస్తుంది. ఎక్స్‌పార్టీగా పురుషులు తమ ఆటలు ఇక చెల్లవనే నిర్థారణకు వచ్చేస్తారు. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసైనా సరే గెలుస్తామనే ఆశను తుడిచేసుకుంటారు ప్రతివాది లాయర్లు. అందుకే ఆమె ఫైర్‌బ్రాండ్‌. అలాంటి ధీశాలి వ్యక్తిగతమైన సమస్యతో సతమతమవుతూ ఉంటుంది.  భర్తతో శారీరక చనువును పెంచుకోలేకపోతుంది. 

ఎందుకలా? 
ఆ లాయర్‌ పేరు సుందర్‌ రా. ప్రొఫెషనల్‌ లైఫ్‌ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంతా మ్యారీడ్‌ లైఫ్‌తోనే. అలాగని భర్త.. మాధవ్‌ పాట్కర్‌  చెడ్డవాడు ఏమీ కాదు. భార్యను అర్థం చేసుకుంటాడు. గౌరవిస్తాడు. ఆర్కిటెక్ట్‌గా తన వృత్తికెంత విలువిస్తాడో అడ్వకేట్‌గా ఆమె వృత్తికీ అంతే విలువిస్తాడు. అయినా ఆమె అతనికి దగ్గరకాలేపోతుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణతో బాధపడ్తుంటుంది. దానిపేరు..  పీటీఎస్‌డి (పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌).

స్కూల్లో చదువుకునే రోజుల్లో లైంగిక దాడికి గురవుతుంది సునంద. అది కలిగించిన భయమే పీటీఎస్‌డి రూపంలో ఇప్పటికీ వెంటాడుతూంటుంది.  ‘‘అది ఒక యాక్సిడెంట్‌ మాత్రమే. ప్రేమ వేరు.. లవ్‌ వేరు’’ అంటూ ఈ విషయంలో ఆమెను మామూలు మనిషిని చేయడానికి  ప్రయత్నిస్తూంటాడు భర్త ఓ స్నేహితుడిలా. అయినా సాధ్యం కాదు సునందకు. సైకియాట్రి ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటూంటుంది. రాత్రి నిద్ర పోవాలంటే భయం ఆమెకు. రోజూ ఆ  పీడకలే. భార్య వ్యథను చూస్తూ నిస్సహాయంగా ఉంటాడు మాధవ్‌.  ఇదిలా ఉండగా..

ఓ రోజు..
దివ్య వస్తుంది సునంద ఆఫీస్‌కు. ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్న క్లయింట్‌. యవ్వనంలో ఆమె ఫేమస్‌ మోడల్‌. ఆనంద్‌ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఓ పాప. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆనంద్‌ది. ఆడవాళ్లతో కూడా స్నేహంగా ఉంటాడు. ఆ తీరును అనుమానిస్తూంటుంది దివ్య. ‘‘నీకు వేరే అఫైర్లున్నాయ’ంటూ రోజూ తగవు పెట్టుకుంటుంది. వాళ్ల పోట్లాటతో కూతురు వణికిపోతూంటుంది.

దాంతో పాప అబ్‌నార్మల్‌ చైల్డ్‌ అయిపోతుంది. ఆ బిడ్డ పట్లా అసహనమే దివ్యకు. చివరకు ఆస్తిలో సగం వాటాతో విడాకులు కావాలని భీష్మించుకుంటుంది. పాప కస్టడీనీ డిమాండ్‌ చేస్తుంది. ఒప్పుకోడు ఆనంద్‌. ‘‘చీటికిమాటికి మనం ఇలా పోట్లాడుకుంటూంటే పాప హెల్త్‌ మరింత పాడవుతుంది. నాకే అఫైరూ లేదు.. నన్ను నమ్ము ప్లీజ్‌’ అంటూ మొరపెట్టుకుంటాడు ఆనంద్‌. కన్విన్స్‌ కాదు దివ్య. పాపకేమో తండ్రంటేనే ఇష్టం. తల్లి పట్ల మొండిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సునంద గురించి తెలుసుకుని ఆమెను కలుస్తుంది దివ్య. ఈ కథ మొదట్లో చెప్పుకున్నట్లు విడాకులు ఇప్పించమని అడుగుతుంది. 

అబద్ధం
తనవైపు బలమైన సాక్ష్యాన్ని సృష్టించుకోడానికి తనే గాజుముక్కతో గాయం చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ భర్త మీద నేరారోపణ చేస్తుంది దివ్య. ఆనంద్‌ను అరెస్ట్‌ చేస్తారు పోలీసులు. తన ఇన్‌ఫ్లుయెన్స్, స్నేహితుడి సహాయంతో ఎలాగోలా బయటకొస్తాడు. ఓ లాయర్‌ని మాట్లాడుకుంటాడు. ఆ వ్యవహారమంతా ఎక్కడ పాప మీద దుష్ప్రభావం చూపుతుందోనని  పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందామని ప్రతిపాదిస్తాడు భార్యతో.

సరే అంటుంది దివ్య. ఆనంద్‌ తన లాయర్‌తో కలిసి సునంద ఆఫీస్‌కు వస్తాడు. దివ్యా ఉంటుంది. చెప్తారు.. తామిద్దరూ మ్యూచువల్‌ కన్‌సెంట్‌కి వెళ్దామనుకుంటున్నామని. ఓకే అంటుంది సునంద. మళ్లీ అక్కడ ఆస్తి విషయంలో పోట్లాటకు దిగుతుంది దివ్య. అప్పుడే తెలుస్తుంది సునందకు.. ఆనంద్‌ తనను గాయపరిచాడంటూ దివ్య అబద్ధమాడిందని. ఆమె మీద నమ్మకం పోతుంది సునందకు. ఈ కేస్‌ నుంచి  తప్పుకుంటానని.. ఇంకో లాయర్‌ను మాట్లాడుకోమనీ దివ్యతో చెప్తుంది. ఇంకోసారి అలా జరగదని బతిమాలుకొని సునందను ఒప్పిస్తుంది దివ్య.  

కోర్టులో..
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఆ ప్రాభవాన్నంతా కోల్పోయి ఆనంద్‌ నీడలో మామూలు భార్యగా బతుకుతున్నాననే భావన దివ్య సంయమనం కోల్పోయేలా చేస్తుంది. ఆ విషయాన్నే ఆనంద్‌ తరపు లాయర్‌ కోర్టులో చెప్పి.. బిడ్డ కస్టడీని ఆనంద్‌కు ఇప్పించాల్సిందిగా కోరుతాడు. ఆ మాటతో ఆవేశపడిపోయి.. ఒక్కసారిగా భర్తమీద అరిచేస్తుంది దివ్య.. క్రమశిక్షణనుల్లంఘించి. దాంతో ఆమె మానసిక ప్రవర్తనను బేరీజు వేసుకున్న జడ్జి బిడ్డ కస్టడీని ఆనంద్‌కే అప్పగిస్తాడు. ఆ కోపాన్నంతా సునందమీద వెళ్లగక్కుతుంది దివ్య. ఆమెలోని తల్లి మనసును అర్థం చేసుకున్నా  దివ్య ప్రవర్తనను సహించదు సునంద. 

అంతకుముందు.. 
తన సాహచర్యం, సైకియాట్రి ట్రీట్‌మెంట్‌.. ఏదీ ఫలితం చూపించకపోయేసరికి హర్ట్‌ అవుతాడు మా«ధవ్‌. కొన్నాళ్లు సొంతూరికి వెళ్దామనుకుంటాడు. తన ఎడబాటు వల్లయినా సునందలో మార్పు వస్తుందేమోనని. అనుకున్నట్టుగానే సునందకు చెప్పకుండా ఊరుకెళ్లిపోతాడు. భార్య ఫోన్‌ చేసి అడిగితే.. పని మీద ఊరొచ్చినట్టు చెప్తాడు. 

ఆ రాత్రి.. 
దివ్య వాళ్లకు విడాకులు మంజూరైన రోజు రాత్రి దివ్య భర్త ఆనంద్‌.. సునంద వాళ్లింటికి వస్తాడు.  కూర్చోని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటారు. కోర్టులో తన భార్య  బిహేవియర్‌ పట్ల సారీ చెప్తాడు ఆనంద్‌. అనీజీగా కదులుతుంది సునంద. ఏమైంది అంటాడు ఆనంద్‌. మెడ, వెన్ను నొప్పి అని చెప్తుంది. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే మస్సాజ్‌ చేయనా? నేను ట్రైన్డ్‌’’ అంటాడు. ‘‘పర్లేదు.. అదే సర్దుకుంటుంది’’ అంటుంది. కాని ఇబ్బంది పడ్తూంటుంది. ‘‘నేను మస్సాజ్‌ చేస్తాను ఆగండి’’ అంటూ చనువు తీసుకొని మస్సాజ్‌ చేస్తుంటాడు. ఆ స్పర్శ ఆమెలో స్త్రీత్వాన్ని తట్టి లేపుతుంది. మానసికంగా ఉపశమనాన్నిస్తుంటుంది. శారీరకంగా సాన్నిహిత్యాన్ని కోరుతుంటూంది. 

తెల్లవారి.. 
ఎప్పటిలా కాకుండా చాలా హుషారుగా ఉంటుంది సునంద. భర్తకు ఫోన్‌ చేస్తుంది త్వరగా రమ్మని. ఆ మాటలోని ఉత్సాహాన్ని, ఆత్రాన్ని గ్రహిస్తాడు భర్త. మాధవ్‌ ఆశించిన మార్పు సునందలో.  బయలుదేరి వస్తాడు. భార్య చొరవను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రాత్రి చెప్తుంది భర్తతో.. ‘‘నా చిన్నప్పటి భయంకరమైన కల.. నిన్న సమాధి అయిపోయింది’’ అంటూ. ‘‘వెరీగుడ్‌..’’ అంటాడు భర్త ఆనందంగా. ‘‘దీనికి కారణం ఓ వ్యక్తి. నిన్న కలిశాను శారీరకంగా. అప్పుడు తెలిసింది నాకు.. పీడకు, సంతోషానికి మధ్య తేడా’’అని ఆగుతుంది. భర్త మొహంలో రంగులు మారుతుంటాయి.‘‘మాధవ్‌.. ఏంటలా ఉన్నావ్‌?’’ అంటుంది కంగారుగా.

‘‘ఏంటో.. నాకు  కన్‌ఫ్యూజన్‌గా ఉంది’’ అంటాడు భర్త. ‘‘అదేంటీ.. నువ్వే చెప్పావ్‌గా చాలాసార్లు.. యాక్సిడెంట్‌ వేరు.. లవ్‌ వేరు అని. నీ మీదున్న నా ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్‌ చేయాలో తెలిసింది..’’ అంటుంది భర్తను హత్తుకుంటూ. ఆమె స్థితిని అర్థం చేసుకునేక్రమంలో భాగంగా భార్య తలను ముద్దు పెట్టుకుంటాడు. సమకాలీన పరిస్థితుల జీవనశైలి.. ప్రమాదాలు.. ప్రేమలు.. ఘర్షణలు.. దుఃఖాలు.. ఆనందాలు అన్నీ రీలై రియల్‌లైఫ్‌లా చూపిస్తుంది ఫైర్‌బ్రాండ్‌. దర్శకురాలు అరుణ రాజె. నిర్మాత.. ప్రియాంక చోప్రా. సునంద రాగా ఉషా జాధవ్‌ నటించారు. 
– సరస్వతి రమ

మరిన్ని వార్తలు