మహిళా బాక్సర్లకు ఇదేం నిబంధన?!

11 Nov, 2014 22:59 IST|Sakshi
మహిళా బాక్సర్లకు ఇదేం నిబంధన?!

ఆటలు అబ్బాయిలకు, పాటలు అమ్మాయిలకు అనే సంప్రదాయ ఆలోచనా ధోరణి నుంచి మన సమాజం పూర్తిగా బయటపడలేదు. అందుకే శారీరకంగా కష్టమైన వృత్తులు, ఉద్యోగాలు, క్రీడలలో మహిళలకు ఈనాటికీ సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ‘కష్టమైన’ రంగాలలోకి ఇష్టపడి వెళ్లాలనుకున్నా... వారి గౌరవాన్ని, పరువును దెబ్బతీసి, వారిని వెనక్కి లాగే అవరోధాలు ఏదో ఒక దశలో మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇందుకు తాజా నిదర్శనం... దక్షిణ కొరియాలోని జెజు నగరంలో రేపటి నుండి నవంబర్ 25 వరకు జరుగనున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు భారతదేశం నుండి ప్రయాణమైన ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (శాయ్) గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహించడం! ‘అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం’ నిబంధనల మేరకే, కొరియా వెళుతున్న భారత జట్టులో గర్భిణులు ఎవరూ లేరని నిర్థారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు ‘శాయ్’ చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై సహజంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భనిర్థారణ పరీక్షలు ఎవరిపైనైతే జరిపారో ఆ ఎనిమిది మందీ అవివాహితులు, జూనియర్లు కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం.

‘‘ఇలా పరీక్షలు నిర్వహించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే’’ అని డాక్టర్ పి.ఎస్.ఎం. చంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన ఎవరో కాదు, క్రీడాకారుల ఫిట్‌నెస్‌కోసం ‘శాయ్’ తరచు సంప్రదించే వైద్యుడే. ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ అధ్యక్షుడు కూడా అయిన చంద్రన్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘పెళ్లికాని పిల్లలకు, పెళ్లీడు లేని జూనియర్లకు గర్భనిర్థారణ పరీక్షలు చేయడం అంటే, వారి శీల ప్రతిష్టను భంగపరచడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిబంధనల మాటేమిటి? ఆ మాటలో నిజం లేదంటారు చంద్రన్.

అంటే, అసలు అలాంటి నిబంధనే లేదన్నది ఆయన వాదన. 2014 ఆగస్టు 31 నుంచి అమలులోకి వచ్చిన బాక్సింగ్ సంఘం నియమాలలో ప్రపంచ పోటీలకు వెళుతున్న బాక్సర్లకు గర్భనిర్థారణ పరీక్షలు జరిపి తీరాలన్న నిబంధన ఏదీ లేదని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ‘‘మహిళా బాక్సర్లు  మెడికల్ సర్టిఫికెట్‌తో పాటు, అదనంగా నాన్-ప్రెగ్నెన్సీ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని మాత్రమే అసోసియేషన్ టెక్నికల్ రూల్స్ 2.1.4.2. లో ఉందనీ, దీనర్థం వారికి గర్భనిర్థారణ పరీక్షలు జరుపమని కాదనీ’’ చంద్రన్ అంటున్నారు.

ఆ స్టేట్‌మెంట్ మీద కూడా తల్లిదండ్రులలో ఒకరు సంతకం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ‘‘పాపం, ఆ అమ్మాయిలు బాక్సింగ్‌లో విజయం సాధించి మాతృదేశానికి పేరుతేవాలన్న తపనలో ఇలాంటి వాటికి తలవొగ్గవలసి వస్తోంది’’ అని చంద్రన్ ఆవేదన చెందారు. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే చంద్రన్‌తో గొంతు కలపడం మొదలు పెట్టాయి కనుక ఇటువంటి అర్థరహితమైన, మహిళలను కించపరిచే నిబంధనలపై క్రీడా సంఘాలు గానీ, ఇతర రంగాల సంస్థలు కానీ పునరాలోచిస్తాయనే అనుకోవాలి.

>
మరిన్ని వార్తలు