థక్‌ థక్‌ గ్యాంగ్‌: కాలు తొక్కారు.. అద్దం దించండి

8 Dec, 2023 00:29 IST|Sakshi

ఢిల్లీలో ఒంటరిగా కారు నడుపుతున్న స్త్రీల వస్తువుల చోరీకి ఒక గ్యాంగ్‌ ప్రయత్నిస్తోంది. ఆ గ్యాంగ్‌ను థక్‌థక్‌ గ్యాంగ్‌ అంటారు. వీరు ఎలా చోరీ చేస్తారు? ఒంటరి స్త్రీలు కారు ప్రయాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విస్తృతంగా వాహనాలు నడుపుతున్న స్త్రీలూ... బహుపరాక్‌. థక్‌థక్‌ గ్యాంగ్‌ ఎక్కడైనా ఉండొచ్చు.

సంఘటన 1: నిర్మానుష్య ప్రాంతం అక్కర్లేదు. బాగా రద్దీ ఉన్న రోడ్డు మీదే. ట్రాఫిక్‌ సమయంలోనే. మీరు కారు మెల్లగా పోనిస్తుంటారు. ఒక మనిషి మీ కారు ముందు నుంచి దాటుతాడు. ఆ తర్వాత వేగంగా వెనక్కు వచ్చి మీ పక్క అద్దం మీద ‘టక్‌ టక్‌’మని వేలితో కొట్టి అద్దం దించమని కోపంగా అంటాడు. ‘నా కాలు తొక్కావు. అద్దం దించు’ అని హడావిడి చేస్తాడు. మీరు కంగారులో అద్దం దించుతారు. అంతే! మీ పక్క సీటులో మీరు ఉంచుకున్న హ్యాండ్‌బ్యాగ్, పర్స్, ల్యాప్‌టాప్‌ తీసుకుని తుర్రుమంటాడు. మీరు కారు దిగి వెంటాడ లేరు. ట్రాఫిక్‌లో ఉంటారు. ఇదీ ‘టక్‌ టక్‌’ లేదా ‘థక్‌థక్‌ గ్యాంగ్‌’ నేరం చేసే తీరు.

సంఘటన 2: ఇలాగే ట్రాఫిక్‌లో మీరు వెళుతుంటారు. మెల్లగా వెళుతున్న మీ కారు వెనుక టైరు ఏదో ఎక్కి దిగినట్టుగా అవుతుంది. వెంటనే ఒక మనిషి డ్రైవింగ్‌ సీట్‌ దగ్గరకు వచ్చి అద్దం మీద బాది ‘నా కాలు తొక్కావ్‌’ అంటాడు. మీరు ఇంజన్‌ ఆఫ్‌ చేసినా, కారు పక్కకు తీసి ఆ మనిషితో వాదనకు దిగినా, మరో మనిషి మీ కారు వెనుక సీటులో ఉన్న వస్తువు తీసుకుని ఉడాయిస్తాడు. మీరు స్లోగా వెళుతున్నప్పుడు వెనుక టైరు కింద రాయి పెట్టి కాలు తొక్కిన భావన కలిగిస్తారు.

ఇంకా ఏం చేస్తారు?: మీ కారు బైక్‌ మీద వెంబడించి ఇంజన్‌ లీక్‌ అవుతుంది అంటారు. అలా అనిపించడానికి వారే వెనుక కొంత ఆయిల్‌ వేస్తారు. మిమ్మల్ని అలెర్ట్‌ చేసిన వారు మిమ్మల్ని దాటి వెళ్లిపోతారు. కాని మీరు కారు ఆపి ఇంజన్‌ ఆయిల్‌ను చెక్‌ చేస్తుంటే ఇంకో బ్యాచ్‌ వచ్చి డోర్లు తీసి దోచుకుని పోతుంది. కారు ఎక్కేటప్పుడు కొన్ని నోట్లు కింద పడేసి మీ డబ్బు పడింది అంటారు. మీరు నోట్లు ఏరుకుంటుంటే కారులో ఉన్న వస్తువులు పట్టుకెళతారు. బ్యాక్‌ టైర్‌ పంక్చర్‌ అయ్యిందని చెప్తారు. కారు ఆపితే అంతే సంగతులు. కొన్నిసార్లు క్యాటపల్ట్‌ (క్యాట్‌బాల్‌)తో రాయి విసిరి అద్దం మీద కొడతారు. టప్పున అద్దం తాకితే మీరు కంగారులో కారు ఆపి దిగుతారు. వారు చేతివాటం చూపుతారు. ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ థక్‌ థక్‌ గ్యాంగ్‌ చాలా సులువుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త.
 

ఏం చేయాలి?
అద్దాలు ఎప్పుడూ ఎత్తి పెట్టాలి
► ఎవరు వచ్చి వాదనకు దిగినా అద్దం దించకుండా పోలీసులకు ఫోన్‌ చేయాలి. ఇంజన్‌ ఆఫ్‌ చేయకూడదు. చేస్తే డోర్లు తెరుచుకుంటాయి.
మీ పక్క సీటులో, వెనుక సీటులో విలువైన ఏ వస్తువులూ కనిపించేలా పెట్టకూడదు.
ఏదైనా రాయి వచ్చి అద్దాన్ని కొట్టినా వెంటనే ఆపకుండా బాగా దూరం వెళ్లి ఎవరూ వెంబడించడం లేదని గమనించుకుని ఆపాలి.
ముఖ్యంగా ఫ్లై ఓవర్లు దిగేప్పుడు, ట్రాఫిక్‌ ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. ఫ్లై ఓవర్‌ మీద కారు పక్కకు తీసి మీరు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఫ్లై ఓవర్ల మీద జాగ్రత్తగా ఉండాలి.

>
మరిన్ని వార్తలు