వంట పండింది!

8 Dec, 2023 00:41 IST|Sakshi

జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్‌పట్టి గ్రామానికి  చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు.

మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్‌ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి.

విరామంలో...
పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది.

పంటను పసుమయిగా ...
ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్‌. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు.

>
మరిన్ని వార్తలు