తినేది మొత్తం పది గంటల్లోనే...

19 Sep, 2018 00:11 IST|Sakshi

ఉదయాన్నే ఓ కాఫీ.. ఆ తరువాత ఉపాహారం.. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్లీ భోజనం! ఇదీ మనలో చాలామంది ఆహారపు అలవాట్లు. ఇంకోలా చెప్పాలంటే 14 నుంచి 15 గంటల పాటు అప్పుడప్పుడూ తింటూనే ఉంటాం అన్నమాట. ఇలాకాకుండా ఒక రోజులో తినేది ఏదో మొత్తం పది గంటల్లోపు తినేస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని అంటున్నారు సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు. మానవుల్లో జీర్ణక్రియకు సంబంధించిన జన్యువులు ఉదయం వేళల్లో ఎక్కువ చురుకుగా ఉంటాయని, కణ మరమ్మతులకు సంబంధించినవి రాత్రిపూట చైతన్యంగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచ్చిదానంద పాండ తెలిపారు.

ఎలుకలపై తాము కొన్ని పరిశోధనలు చేశామని, కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని రోజంతా తీసుకున్న ఎలుకలు కొంతకాలానికే ఊబకాయం, ఇతర జీర్ణసంబంధిత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టగా ఎనిమిది నుంచి పదిగంటల గడువులో మాత్రమే ఆ రకమైన ఆహారమే తీసుకున్న ఎలుకలు నాజూకుగా, ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన వివరించారు. శరీర గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్లనే ఈ ఆరోగ్య లాభాలు చేకూరాయని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. 

మరిన్ని వార్తలు