విద్య - విలువలు తెగించడం అంటే... గీతదాటడం

20 Dec, 2015 01:24 IST|Sakshi
విద్య - విలువలు తెగించడం అంటే... గీతదాటడం

సచిన్ తెండూల్కర్ పేరు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా తెలియనివారు లేరు. క్రికెట్‌ను ఆయన చిన్నప్పుడు ఒక మాస్టారు దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఒకసారి సచిన్ సరిగా ఆడలేదని ఈడ్చి లెంపకాయ కొట్టాడు. తర్వాత కాలంలో ఆ మాస్టారుకు సన్మానం జరిగితే తెండూల్కర్ ఆ సభకు వచ్చి ప్రసంగిస్తూ... ‘‘నేనివాళ అంతర్జాతీయ క్రికెటర్‌నని పేరు తెచ్చుకోవడం వెనుక ఒక సంఘటన ఉంది. ఈ మాస్టారే నాకు కోచ్‌గా ఉండి క్రికెట్ నేర్పారు.
 
  ఒకసారి ఒకేలా వస్తున్న బంతిని ఆడడంలో పదేపదే విఫలమయ్యాను. ‘ఒకేలా వస్తున్న బంతిని ఎందుకు కొట్టలేకపోతున్నావ్, దృష్టి ఎందుకు పెట్టడం లేదు, ఎక్కడుంది లోపం?’ అని నన్ను వెంటనే పిల్చి ఈడ్చి లెంపకాయ కొట్టాడు. ఆనాడే నేను గ్రహించిందేమిటంటే ప్రతి బంతినీ జాగ్రత్తగా ఎదుర్కోవాలని. ఇంత కీర్తిని చూసుకుని ఏ ఒక్క బంతిని జారవిడిచినా, ఈ కీర్తి శిఖరాలనుంచి జారిపోతానని. ఆయన వేసిన పునాలమీద నిర్మించిన కీర్తి భవనంలో ఈనాడు నేను నిలబడి ఉన్నాను. ఆయన కొట్టిన దెబ్బ ఇప్పటికీ నాకు గుర్తుంది’’ అని చెప్పి వెళ్లి గురువుగారి కాళ్లకు నమస్కరించి పూలదండ వేశాడు.
 
 అందుకే ఇప్పటికీ ఏసీలోంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా, బయట ఎండలు మండుతున్నా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మైదానంలో నిలబడి ఉండగల సామర్ధ్యం పొందాడంటే, అతని వెనుక ఎంత పరిశ్రమ ఉందో ఆలోచించండి. ఒక్కమాట ఎప్పుడూ కూడా ధూర్తతనంతో తొందరపడి మాట్లాడడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, సెంచరీ కొట్టి ‘నన్ను నోటితో విమర్శించారు. నేను బ్యాట్‌తో జవాబు చెప్పాను’’ అంటాడు. అంతే. జీవితంలో అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. అతనిని కేవలం ఒక క్రికెటర్‌గా తీసుకోకండి. ఆదర్శంగా తీసుకోండి. ఆయన జీవితచరిత్ర చదవండి.
 
 ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన శాస్త్రవేత్త, దేశంలోని అత్యున్నత పదవిని అలంకరించిన అబ్దుల్ కలాం తన స్వీయరచన ‘ఇన్‌డామిటబుల్ స్పిరిట్’ అనే గ్రంథంలో ‘‘ఈ శరీరంలో ఉన్న రక్తం, ఈ శరీరంలో ఉన్న మాంసం ఒక సంఘటనకు, ఒక వ్యక్తికి రుణపడిపోయాయి. ఆ రుణపడిపోయిన విషయాలను గుర్తుపెట్టుకుని కలాం ప్రవర్తిస్తాడు’’ అని రాసుకున్నారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో గోధుమలు దొరకని రోజులవి. వాళ్ల అమ్మగారు అదేపనిగా రొట్టెలు చేసిపెడుతున్నారు.
 
  చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయని కలాంగారు తింటున్నారు. తినేసి పక్కగదిలోకి వెళ్లాడు. ‘‘నీకు బుద్ధుందా?’’ అని వాళ్లన్నయ్యగారు మందలిస్తూ... ‘‘అమ్మ తినడానికి రొట్టెలు లేవు, అమ్మచేసి పెడుతున్నది, నీవు తింటున్నావు. పైగా రుచిగా కూడా ఉందని తిన్నావు సరే. నువ్వు తినడంతోపాటుగా అమ్మ తిన్నదో లేదో, తినడానికి ఉన్నాయో లేవో చూసుకున్నావా? అవతలివారి కష్టం గురించి కూడా ఆలోచించడం నేర్చుకో’’ అని చెప్పారు. అన్నయ్య మందలింపు నా జీవితానికి శిలాశాసనమయింది’’ అని రాసుకున్నారు. తను నాడు తినడం మానేసి ఎవరికి పెట్టిందో వాడు దేశానికి ఇంత సేవ చేశాడన్న ఖ్యాతి ఆమెకు రావడానికి కలాం పెళ్లి చేసుకోవడం మానేశాడు.
 
 ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు. ఒక వ్యక్తికి, ఒక సంఘటనకి ఒక జవాబుదారీతనం వహించాలి, బాధ్యత వహించాలి. ఇలాంటి వారిని ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోండి, ఆరోగ్యవంతమైన భయాన్ని జీవితంలో నిలబెట్టుకోండి.
 
 ఒక తప్పు పని మా జీవితాల మీద అంత ప్రభావం చూపదు. కారణం మాది పొంగి చల్లారిన పాలలాంటి వయసు. మేం అంత తొందరగా ప్రేరణ పొందం. మేం అంత త్వరగా ప్రతిస్పందించం. మేం యుక్తాయుక్త విచక్షణతో కొంత ఆలోచించగలం. అందుకే మేం ఒక తప్పుపనికి ఆకర్షితులం కాలేదంటే, మాకేం సన్మానాలు చేయక్కర్లేదు.
 
  కానీ ఈ వేళ మీ జీవితాలు ప్రమాదపు పోకడలు పోతున్నాయి. ఈవేళ మీకు ఆరోగ్యవంతమైన భయం ఉండాలనే ధ్యాస లేదు. ఎందుకని?
 పొద్దున్నే ఒక న్యూస్‌పేపర్ విప్పారనుకోండి. అవి చదువుతుంటే... వాటిలో మాటలు చూస్తుంటే... ‘‘అయ్యో! ఈ మాట మాట్లాడితే ఎన్ని లక్షల జీవితాలు పాడైపోతాయి? ఒక వ్యక్తి నోటి వెంట ఇంత కాలుష్యంతో కూడిన మాట రావచ్చా? అలా మాట్లాడడం కుదురుతుందా? తప్పు కదా? అని నిగ్రహంతో మాట్లాడినవాడు కనిపించడు. ఒకవేళ అలా మాట్లాడగలిగినవాడున్నా వాడి మాటకు విలువ లేదు.
 
 ఎవడో పనికిమాలినవాడు మాట్లాడిన పనికిమాలిన మాటలన్నీ అది కూడా మీ రక్తం ఉడికిపోయేటట్లు, మీ రక్తనాళాలు చిట్లిపోయేటట్లు, రాకూడని పోలీసులు కాలేజి క్యాంపస్‌లకు వచ్చేటట్లు ప్రముఖంగా పదేపదే వేస్తారు. దానివల్ల పాడైపోయేదెవరు ?
 
 ఒక సినిమాకు ఈవేళ ఆ విధమైన లక్షణం లేదు.‘‘నేను ఫలానా పిల్లను ప్రేమించాను. నా ఇష్టం. ఒక వయసొచ్చాక మా అమ్మకు, మా నాన్నకు చెప్పేదేమిటి?’’ అని నేర్పిస్తున్నాయే తప్ప నీ తండ్రిని, నీ తల్లిని నీవు జీవితాంతం ప్రేమించాలని, గౌరవించాలని చెప్పే సినిమా ఒక్కటీ కనపడదు, అటువంటి ఒక్క టీవీ సీరియల్ కనపడదు. అంత భయంకరమైన ధోరణి సమాజమంతా నిండిపోయింది. మీరు దీనిని చెయ్యకండి, దీని జోలికెళ్లకండి, చాలా భయంకరమైనది, పాడైపోతారు, మీకు భయం ఉండాలి’’ అని చెప్పేవాడు, చూపించేవాడు లేడు. చదవతగినది కూడా లేదు!!
 
 అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన బాలమురళీకృష్ణగారు మన రాష్ట్రం దాటి వేరే ప్రాంతాల్లో కచేరీ చేస్తే అక్కడి పత్రికలు దానిని మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురిస్తాయి. కానీ తన స్వరాష్ట్రంలో ఆయనకాముచ్చట తీరడం లేదు. ఎవైరనా చచ్చిపోయిన తర్వాతే మొదటిపేజీల్లో ప్రముఖంగా వేస్తారు. అప్పటిదాకా వారెంత కృషి చేసినా, ఖ్యాతి వహించినా పట్టించుకోని మన పత్రికలు మీకు పనికివచ్చే ప్రసంగాలను పూర్తి పాఠం ప్రచురించవు.
 

>
మరిన్ని వార్తలు