ఇందుస్థాన్‌ 1975

29 Jun, 2017 23:32 IST|Sakshi
ఇందుస్థాన్‌ 1975

ఇందిరా గాంధీ ముద్దుపేరు ‘ఇందు’. 1975 నాటి ఎమర్జన్సీ రోజుల్లో హిందూస్థాన్‌ ఎలా ఉండేదో ‘ఇందు సర్కార్‌’ ద్వారా చూపించే ప్రయత్నం దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ చేయడం వివాదాస్పదం అవుతున్నది.

‘భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించారు. దీని గురించి ప్రజలు భీతిల్లవలసిన పని లేదు.’ 1975 జూన్‌ 26న ఆల్‌ ఇండియా రేడియోలో ప్రధాని ఇందిరాగాంధీ ప్రజలను ఉద్దేశించి అన్న మాటలివి. నిజంగా, బహుశా ఆమె కూడా తాను అన్న మాటలు నమ్మి ఉంటారు. తన ప్రత్యర్థులను నిలువరించడానికి ‘ఎమర్జెన్సీ’ ఒక అడ్డుకట్ట అని భావించి ఉంటారు. కాని జరిగింది వేరు.

ఆమె అనుకున్నదానికి భిన్నంగా ఆమె చిన్న కుమారుడు సంజయ్‌ గాంధీ చేసింది వేరు. ఈ వార్త ప్రకటించిన కొద్ది గంటల్లోనే న్యూఢిల్లీలోని పత్రికాఫీసులకు వెళ్లే విద్యుత్‌ సరఫరా నిలువరించ బడింది. పేపర్లు ఈ వార్తను ప్రచురించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అయ్యింది. ప్రజానాయకులైన జయప్రకాష్‌ నారాయణ్, మురార్జీ దేశాయ్, చరణ్‌సింగ్‌... వీరందరినీ అరెస్ట్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఈ అరెస్టులు మరిన్ని పెరిగాయి.

ఒక అంచనా ప్రకారం ఎమర్జెన్సీ రోజులలో మొత్తం పదమూడు వేల మందిని జైళ్లల్లో మగ్గేలా చేశారు. మొత్తం లక్షా పది వేల మందిని అకారణంగా అరెస్టు చేసి వదిలిపెట్టారు. వార్తల మీద సెన్సార్‌ విధించబడింది. ఆందోళనల మీద ఉక్కుపాదం మోపబడింది. ఢిల్లీలో ఒక సిటీ బస్సులో ఆడవాళ్లకు కేటాయించిన సీటును డిమాండ్‌ చేసిన ఒక మహిళను చూసి ఒక పురుషుడు ‘నువ్వేమైనా ఇందిరాగాంధీవని అనుకుంటున్నావా’ అని అన్నందుకు అతణ్ణి పట్టుకుని లోపలేశారు. ఇలాంటివి వందలు వేలు. బుద్ధిజీవులు ఆ రోజులను ‘భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’గా వర్ణించారు. ప్రజాస్వామిక వాదులు హాహాకారాలు చేశారు. 1975 జూన్‌ 26న మొదలైన ఈ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. ప్రజలకు తన మీద నమ్మకం పెరిగిందనీ ఎలక్షన్లకు వెళితే బ్రహ్మరథం పట్టడం ఖాయమనీ ఇందిరాగాంధీ నమ్మి ఎలక్షన్లకు వెళ్లడంతో ఎమర్జన్సీ దురవస్థ తప్పింది.

కాని ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీశారు. జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు.
ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారు.
దానిని ఎవరూ చర్చించడానికి ఇష్టపడరు. కాని దర్శకుడు మధుర్‌ భాండార్కర్‌ ఇప్పుడు ఈ పనికి పూనుకుని వివాదానికి కారణమయ్యాడు.

నాటి నేపథ్యం... నేటి కథ...
భారతదేశంలో బయోపిక్‌ల నిర్మాణం జోరందుకున్నా ఇప్పటివరకూ ఇందిరా గాంధీ మీద కానీ రాజీవ్‌ గాంధీ మీద కాని ఒక్క బయోపిక్‌ను తీసే ధైర్యం ఎవరూ చేయలేదు. రాజీవ్‌గాంధీ మరణంపై దర్శకుడు సెల్వమణి ఎంతో భారీగా తీసిన ‘కుట్రపత్రికై’ సినిమా అమానుషంగా సెన్సార్‌ కోరల్లో చిక్కుకుని ఇప్పటిదాకా వెలుగుకు నోచుకోలేకపోయింది. కేవలం ఇందిరాగాంధీ పోలికలు ఉన్న పాత్రతో గుల్జార్‌ ‘ఆంధీ’ సినిమా తీస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సినిమాను బేన్‌ చేసేదాకా ఊరుకోలేదు. ఎమర్జెన్సీ రోజులనే ఆధారంగా చేసుకుని 1977లో షబానా ఆజ్మీ ముఖ్యపాత్రధారిగా ‘కిస్సా కుర్సీకా’ అనే సినిమా తీసి విడుదల చేస్తే సంజయ్‌గాంధీ భక్తులు కొందరు ఆ సినిమా ప్రింట్‌లన్నీ వెతికి మరీ తగులబెట్టిన ఉదంతం ఉంది. సోనియా గాంధీ జీవితం ఆధారంగా బయోపిక్‌లు తీయడానికి ఒకరిద్దరు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ఈ నేప«థ్యంలో ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ పాత్రలు నేరుగా కనిపించే ఎమర్జన్సీ కాలపు కథను తీసుకుని దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ‘ఇందు సర్కార్‌’ పేరుతో సినిమాను తీసి జూలైలో విడుదల చేయబోతున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా వార్తలకు ఎక్కి వేడి వాతావరణం సృష్టిస్తున్నది.

ఎమర్జన్సీ ఎందుకు?
1971 లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ‘రాయ్‌బరేలీ’ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. అయితే ఓడిపోయిన ఆమె ప్రత్యర్థి, సోషలిస్ట్‌ పార్టీ నాయకుడు రాజ్‌ నారాయణ్‌ ఆమె ఎన్నిక చెల్లదని ప్రభుత్వ యంత్రాగాన్ని ఎన్నికలలో విజయం కోసం ఉపయోగించుకున్నారని అలహాబాద్‌ హైకోర్టులో కేసు వేశాడు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధానిని కోర్టుకు పిలవడం ఆ సందర్భంగా జరిగింది. 1973లో ఇందిరాగాంధీని అలహాబాద్‌ హైకోర్టుకు పిలిచి ఈ కేసు సందర్భంగా క్రాస్‌ ఎగ్జామిన్‌ కూడా చేశారు. అయితే ఎంత పెద్దకేసైనా దేశప్రధానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఎవరూ భావించలేదు. కాని నాటి హైకోర్టు జడ్జి జగ్‌మోహన్‌లాల్‌ సిన్హా 1975 జూన్‌ 12న ఇచ్చిన తన తుది తీర్పులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పడమే కాకుండా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీకి ఆమె అనర్హురాలు అని ప్రకటించారు. ఇది శరాఘాతంగా ఇందిరాగాంధీని తాకింది.

దీనిపై సుప్రీం కోర్టులో వెంటనే అప్పీల్‌ చేస్తే జూన్‌ 24న జస్టిస్‌ కృష్ణయ్యర్‌ హైకోర్టు తీర్పును బలపరుస్తూ ఇందిరాగాంధీ పార్లమెంట్‌ సభ్యురాలుగా ఉండటానికి వీల్లేదని కాని ప్రధానమంత్రిగా కొనసాగవచ్చని తీర్పు చెప్పారు. ఇక ఇందిరా గాంధీ ముందు మార్గం లేకపోయింది. మరోవైపు ఆ పక్కరోజే ఢిల్లీలో జయప్రకాష్‌ నారాయణ్‌ పెద్ద ర్యాలీ నిర్వహించి పోలీసులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పట్టించుకోవద్దని ఆత్మప్రభోదానుసారం నడుచుకోమని పిలుపుఇచ్చారు. ఈ మాట ఒకరకంగా తీవ్రమైనది. దీనిని ఇందిరా గాంధీ అందిపుచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు దేశంలో అశాంతికి కారణమవుతున్నాయని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌కు చెప్పి ‘అత్యవసరస్థితి’ ప్రకటింపచేశారు. ఈ మొత్తానికి ఎదురుగా ఇందిరాగాంధీ కనిపిస్తున్నా వెనుక మాత్రం సంజయ్‌గాంధీ ఉన్నారనేది ఎక్కువమంది నమ్మే సత్యం.

మాటను అణిచినా పెగలుతుంది...
ఇప్పుడు మధుర్‌ భండార్కర్‌ తీసిన ‘ఇందు సర్కార్‌’ గతంలో తెలుగులో వచ్చిన ‘అంకురం’ను పోలి ఉంది. ‘అంకురం’లో ఒక నక్సలైట్‌ తన బిడ్డను హీరోయిన్‌ రేవతి చేతిలో పెట్టి ఒక స్టేషన్‌లో మాయమవుతాడు. వాస్తవానికి అతణ్ణి పోలీసులు మాయం చేస్తారు. రేవతి ఆ బిడ్డను కాపాడటానికి అలాగే ఆ నక్సలైట్‌ ఆచూకీ కనిపెట్టడానికి పోరాడుతుంది. ‘ఇందు సర్కార్‌’లో కూడా ఒక కవయిత్రి ఎమర్జన్సీ రోజులలో జరుగుతున్న అల్లర్లలో తనకు దొరికిన ఇద్దరు పిల్లలను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఆ పిల్లలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక ఆందోళనకారుడి పిల్లలు. ఆ కవయిత్రి భర్తకు ఇది ఇష్టం ఉండదు. అతడు వ్యవస్థకు ఎదురు వెళ్లడానికి ఇష్టపడడు. కాని కవయిత్రి పోరాడుతుంది. పోలీసులు ఆమెను హింసిస్తారు. రాజకీయ నాయకులు వేధిస్తారు. చివరకు ఆమె ఎలా విజయం సాధించిందనేది కథ. ప్రజల నోరును ఎంత అణిచి పెట్టినా అది పెగిలి తీరుతుందనడానికి సింబాలిక్‌గా ఈ సినిమాలో హీరోయిన్‌కు ‘నత్తి’ పెట్టారు. అయితే ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. సంజయ్‌ గాంధీగా నీల్‌ నితిష్‌ నటించాడు. ఇందిరా గాంధీగా కొత్త నటి చేసింది.

ఇది స్పాన్సర్డ్‌ సినిమానా?
‘ఇందు సర్కార్‌’ మీద కాంగ్రెస్‌ నాయకులు దాడి మొదలుపెట్టారు. ఇది భారతీయ జనతాపార్టీవారి స్పాన్సర్డ్‌ సినిమాగా ప్రచారం చేస్తున్నారు. ‘దీని వెనుక ఎవరు ఉన్నారో మనకు తెలుసు’ అని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీల మీద బురద చల్లేందుకు ఈ సినిమాను ఉపయోగించుకోనున్నారని వీరి అభియోగం. బిజెపి ప్రభుత్వం దర్శకుడు మధుర్‌ భండార్కర్‌కు, నటుడు అనుపమ్‌ఖేర్‌కు ‘పద్మ’ అవార్డులు ఇచ్చిందని దానికి వీరు ఈ సినిమాతో బదులు చెల్లిస్తున్నారని వారు అంటున్నారు. అయితే మధుర్‌ భండార్కర్‌ ఈ వాదనలను కొట్టి పడేస్తున్నాడు. ‘నా సినీ జీవితం చూసినవారెవరైనా ఒకరి ఆదేశాల ప్రకారం సినిమాలు తీస్తానని నమ్మరు’ అంటున్నాడు. ‘నీకు ఎమర్జన్సీ మీద మాత్రమే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది... గుజరాత్‌ మారణకాండ మీద తీయాలని ఎందుకు అనిపించలేదు’ అని కొందరు బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు. ఇందు సర్కార్‌కు సులభంగా సెన్సార్‌ అనుమతులు లభించడం చూస్తుంటే దీనికి కేంద్రం ఆశీçస్సులున్నట్టుగా అనుమానించాల్సి వస్తోందని మరి కొందరి వాదన. గుజరాత్‌ మారణకాండ మీద తీసిన చిత్రం ‘పర్జానియా’ను గుజరాత్‌లో బేన్‌ చేసిన బిజెపి ప్రభుత్వం ‘ఇందు సర్కార్‌’ను దేశమంతా చూడటానికి అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్‌వారు గుర్రుగా ఉన్నారు. అయితే సంజయ్‌గాంధీ భార్య మనేకా గాంధీ, కుమారుడు వరుణ్‌గాంధీ ఇప్పుడు బిజెపిలోనే ఉన్నారు. వారు ఈ సినిమాలో సంజయ్‌గాంధీ పాత్రను చూసి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

చరిత్రను ప్రజల ముందుకు తేవడం కళాత్మక విధానాల ద్వారా చరిత్రను రికార్డు చేయడం ఎవరూ కాదనరు. రచయితలకు, కళాకారులకు సృజనాత్మక స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది. దానిని కాపాడాల్సిన అవసరం అందరి మీదా ఉంది. కాని ఏ సమయంలో ఎటువంటి కళకు, ఎటువంటి సృజనకు అనుమతి లభిస్తున్నది ఎటువంటి సృజనకు అడ్డుకట్ట పడుతున్నది కూడా గమనించుకోవాల్సి ఉంది. వీటన్నింటి ఫలితంగా ‘ఇందు సర్కార్‌’ విడుదల ఒక ఆచి తూచి గమనించాల్సిన విషయమన్నది నిర్వివాదాంశం.
– కె.

ఎమర్జ్జన్సీ మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. డాక్యుమెంటరీలు వచ్చాయి. నేను సినిమా ఎందుకు తీయకూడదు? కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడమే నా ఉద్దేశం అయితే ఈ సినిమాను మొన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే విడుదల చేసి ఉండేవాణ్ణి.
– మధుర్‌ భండార్కర్‌

మరిన్ని వార్తలు