ప్రతి తండ్రీ దశరథ మహారాజే!

9 Apr, 2017 18:51 IST|Sakshi

పితృ దేవోభవ
కొడుకుపట్ల తండ్రి ఆర్తి ఎలా ఉంటుందో రామాయణం చాలా చక్కగా ఆవిష్కరించింది. చైతమ్రాసం. అరణ్యాలన్నీ పుష్పించి ఉంటాయి. శుభప్రదమైన నెల. నా కుమారుడు రామచంద్ర మూర్తికి పట్టాభిషేకం చేస్తానన్నారు దశరథ మహారాజుగారు. తెల్లవారితే పట్టాభిషేకం. కైకమ్మకు చెప్పాడు. ఆమె రెండు వరాలడుగుతూ...‘నారబట్టలు ధరించి 14 ఏళ్ళు వనవాసానికి జటాజూటంతో వెళ్ళాలి. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి’ అంది. మీరు అయోధ్యకాండ చదివితే తెలుస్తుంది. ఎన్నిసార్లు దశరథ మహారాజు స్పృహతప్పి కిందపడిపోయాడో... ఎన్ని మాట్లు  ధారగా ఏడ్చాడో!

అరణ్యవాసంలో ఉండగా గంగాతీరంలో పళ్ళు తీసుకొచ్చిన గుహుడు ‘రామా! తిను’ అని అడిగినప్పుడు...’’ఎలా తినమంటావు, మా నాన్నగారు గుర్తుకొస్తున్నారు. అంతటి మహారాజు నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానని, 14 ఏళ్ళు కనబడనని, పై ఉత్తరీయం జారిపడిపోతున్నా, నన్ను చూడకుండా ఉండలేక నా రథం వెళ్ళిపోతుంటే, తాను పరిగెత్తలేనని వృద్ధుడని తెలిసి కూడా ఇంకొక్కసారి కనబడతానేమోనని ‘రామా! రామా!’ అంటూ పరుగెత్తుతూ కాళ్ళు తడబడి స్పృహతప్పి నేలమీద అడ్డంగా పడిపోయాడు. నేనది చూసాను. ఈ రాత్రి మా తండ్రి ఆహారం ముట్టడు. ఎంత ఏడిచి ఉంటాడో. ఎంత బాధపడుతున్నాడో, అసలు ఈ రాత్రి గడుస్తుందా? మా నాన్నగారు బతుకుతారా! ఆయన గుర్తొస్తుంటే ఈ పళ్ళు తిననా, నా కొద్దు’’ అని పరమ ధర్మాత్ముడు కనుక ఆచమనం చేసి పడుకున్నాడు. అదీ తండ్రి అంటే.

ఏ తండ్రి అయినా దశరథమహారాజే. ఏ తండ్రయినా కొడుకుకోసం అంత వెంపర్లాడి పోతాడు. చివరకు ఆయన ఏస్థితికి వెళ్ళాడంటే... వెళ్ళబోతున్న రాముడిని పిలిచి ‘‘రామా, నేను నిన్ను పంపడం లేదు. నిన్ను విడిచిపెట్టి నేనుండలేను. ఒక ప్రార్థన చేస్తాను, మన్నించు’ అని అడిగాడు’’« దర్మం ప్రకారం ఈ అయోధ్య సామ్రాజ్యం నీకే చెందుతుంది. నీకు చెందిన రాజ్యాన్నివ్వడానికి నేనెవరిని? అందుకే నువ్వే ఇలా అడుగు– నాన్నగారూ, తాత సొమ్మా అలా ఇవ్వడానికి. ఇక్ష్వాకు వంశంలో పెద్దకొడుకుదే రాజ్యాధికారం. యవ్వనంలో ఉన్న భార్యకోసం నా రాజ్యాధికారాన్ని  తీసేసే అధికారం మీకు లేదు. రాజ్యం క్షాత్ర భోజ్యం–అంటూ నా మీద యుద్ధం ప్రకటించు. బాణాలు వెయ్యి. నేనెలాగూ వృద్ధుణ్ణి. యుద్ధంలో ఓడిపోతాను. నా కాళ్ళూ చేతులూ కట్టేసి కారాగారంలో పడేయి. నా ప్రతిజ్ఞ చెల్లిపోయినట్లూ, నీ రాజ్యం నీకు దక్కినట్టూ ఉంటుంది. వెళ్ళిపోకు అరణ్యానికి. కారాగారంలో ఉండి నీవు పెట్టిన అన్నం తింటూ, నువ్వలా వెడుతుంటే చూసుకొని బతికేస్తాను. రామా! నీవెళ్ళిపోతే బతకలేను’–అంటూ ప్రాధేయపడతాడు.

అంటే... తాను కారాగారానికి వెళ్ళిపోయినా ఫరవాలేదు, రాముడు మాత్రం సింహాసనం మీద  కూర్చోవాలి. రాముడు కష్టపడకూడదు. కొడుకు కోసం కళ్ళుకాసారాలయ్యేలా ఏడిచి ఆఖరికి దృష్టికూడా కోల్పోయిన దశరథుడు శ్రావణకుమారుడి వృత్తాంతం తాలూకు శాపం అమల్లోకి వస్తున్నదని గుర్తుకు తెచ్చుకుంటాడు.’హా! కుమారా! అంటూ నీవుకూడా నాలాగే ప్రాణం విడిచిపెడతావు. కొడుకును వదలడం ఎంత కష్టమో నీకు తెలిసొస్తుంది’ అని శాప సందర్భంగా చెప్పిన మాటలు ఇప్పుడు నా క్షోభకు కారణం. ఇప్పుడు తెలుస్తున్నది కొడుకును వదలడం ఎంత ప్రాణాంతకమైన బాధో. ఇక నేనుండను. వెళ్ళిపోతున్నా’ అని చెప్పి మరణించాడు.
ఎంతోమంది శత్రువులను గెలిచిన అంతటి తేజోవంతమైన దశరథ మహారాజు, ఏ అనారోగ్యం లేని తండ్రి, –కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడనీ, 14 ఏళ్ళు కనబడడన్న భావనతో, తనవల్లనే కొడుకుకు ఇంత కష్టం వచ్చిందన్న వ్యధతో... కేవలం ఒక రాత్రి ఒకే ఒక్క రాత్రి బతకలేక శరీరం విడిచిపెట్టేసాడు. మహారాజయినా, నిరుపేదయినా కొడుకును చూడలేకపోతున్నానన్న భావనతో ఒక తండ్రి పడిన క్షోభకు పరాకాష్ట ఇది.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు