తొలి ఆకుపచ్చని చిత్రం

30 Mar, 2015 23:04 IST|Sakshi
తొలి ఆకుపచ్చని చిత్రం

బిస్వజీత్ బోరా అస్సాం దర్శకుడు. మాయా ఖోలీ అరుణాచల్ ప్రదేశ్ నిర్మాత. ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న ‘ఐసా యే జహాన్’ అనే చిత్రం ఈ ఏడాది మే నెలలో విడుదల కాబోతోంది. ఇంతవరకు వీళ్లు బాలీవుడ్ చిత్రం తీసింది లేదు. కానీ ఈ చిత్రంతో చరిత్రను సృష్టించబోతున్నారు. ఎలాగంటే, ‘ఐసా యే జహాన్’... భారతదేశపు తొలి కార్బన్-న్యూట్రల్ చిత్రం కాబోతోంది! కార్బన్-న్యూట్రల్ అంటే? దీనికి అర్థం తెలుసుకోవాలంటే ముందు ‘కార్బన్ ఫుట్‌ప్రింట్’ అంటే ఏమిటో  తెలుసుకోవాలి. ఒక మనిషి తన అలవాట్లు, చర్యలు, కదలికలు, వస్తు వినిమయాల ద్వారా పర్యావరణంలోకి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ మోతాదును ఆ మనిషి ‘కార్బన్ ఫుట్‌ప్రింట్’ అంటారు. అయితే అంతే మోతాదులో ఆ మనిషి పర్యావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను తొలగించగలిగితే అది ‘కార్బన్-న్యూట్రల్’ అవుతుంది.

అంటే చెల్లుకు చెల్లు.  ‘ఐసా యే జహాన్’ టీమ్ చేస్తోంది కూడా ఇదే. సినిమా నిర్మాణ సమయంలో నటీనటులు, సెట్టింగుల ద్వారా వెలువడిన కార్బన్ ఫుట్‌ప్రింట్ కు సమాన స్థాయిలో పర్యావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను తొలగించడానికి మొక్కలు నాటడం వంటి పర్యావరణ హిత కార్యక్రమాలను వీరు చేపట్టారు. నాటిన వెంటనే కార్బన్ న్యూట్రల్ జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు వీరు విడుదల చేసిన కార్బన్‌కు సమాన స్థాయిలో భవిష్యత్తులో ఆ మొక్కల ద్వారా కార్బన్ నివారణ జరుగుతుంది. ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ముంబై, ఆ చుట్టుపక్కల ఇప్పటి వరకు 400 మొక్కల వరకు నాటింది.  పల్లెల పచ్చదనానికి దూరమైన కాంక్రీటు జనారణ్యంలో చిక్కుకు పోయిన పట్టణ కుటుంబాల చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు బోరా అంటున్నారు. ‘ఐసా యే జహాన్’ మన దగ్గర తొలి కార్బన్ న్యూట్రల్ చిత్రమే అయినప్పటికీ, హాలీవుడ్‌లో ఇప్పటికే అలాంటి చిత్రాలు కొన్ని వచ్చాయి. సిరియానా, ది డే ది ఎర్త్ స్టుడ్ స్టిల్, ది డే ఆఫ్టర్ టుమారో... కార్బన్ న్యూట్రల్ చిత్రాలే!
 

మరిన్ని వార్తలు