Athletes Visa Denial: చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

28 Sep, 2023 10:17 IST|Sakshi

ఇటానగర్‌: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్‌వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.

తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్‌వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.   

ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు

మరిన్ని వార్తలు