పుష్పద్వేషి

11 Oct, 2015 00:38 IST|Sakshi
పుష్పద్వేషి

పూలను ఇష్టపడనిదెవరు..? అందరూ ఇష్టపడతారు కదా.. అనుకుంటున్నారా..? గడచిన శతాబ్దంలో పూలంటేనే గిట్టని ఒక మహానుభావుడు ఇంగ్లాండ్‌లో ఉండేవాడు. అతగాడి పేరు సర్ టాటన్ సెకైస్. యార్క్‌షైర్‌లో నగరానికి రాచ ప్రతినిధిగా ఉన్న టాటన్ దొరగారికి పూలపై ఎంతటి ద్వేషమంటే, పురవీధుల్లో ఆయన సంచరించేటప్పుడు ఏ మొక్కకు పూలు కనిపించినా, వాటిని అక్కడికక్కడే తుంచి, నలిపి నాశనం చేసి గానీ శాంతించేవాడు కాదు.

అంతేకాదు, నగర వాసులెవరూ పూలమొక్కలు పెంచనే పెంచరాదని కూడా హుకుం జారీ చేసి పారేశాడు. నగర పౌరులెవరైనా ఫ్లవర్స్‌ను పెంచాలనుకుంటే, కాలిఫ్లవర్స్ తప్ప మరే రకానికి చెందిన ఫ్లవర్స్ పెంచరాదని కరాఖండిగా శాసించాడు. పూలను విపరీతంగా ద్వేషించే టాటన్ దొరగారికి పిచ్చి బాగా ముదిరి, ఆరోగ్యంపై అతిజాగ్రత్త మొదలైంది. కేవలం కోల్డ్ రైస్ పుడ్డింగ్ మాత్రమే తినేవాడు. కొంపలంటుకుంటున్నా రాజీ పడకుండా తిండిలో కచ్చితమైన వేళలు పాటించేవాడు. చివరకు తన రాచప్రాసాదం మంటల్లో చిక్కుకున్నా, పుడ్డింగ్ తింటే తప్ప అందులోంచి కదిలేది లేదని భీష్మించుకున్న ఘనుడు ఇతగాడు.
 - పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు