మహాప్తుడు

30 Sep, 2018 00:58 IST|Sakshi

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి

‘‘అహింస గురించి, సత్యవాక్పాలన గురించి నేను ప్రపంచానికి కొత్తగా బోధించ వలసినదంటూ ఏమీ లేదు. ఎందుకంటే, సత్యం, అహింస అనాదినుంచి వస్తున్నవే’’ అనేవారు మహాత్మాగాంధీ. అహింసే ఆయుదంగా, సత్యాన్వేషణే మార్గంగా శాంతియుత సమరం సాగించి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహాత్ముడు కలలుగన్న భారతావని ఒక కర్మభూమి, వేదభూమి, సత్యభూమి. అంతటా వ్యాపించి ఉన్న సత్యనారాయణుని సాక్షాత్కరించుకోవాలంటే, ప్రతిజీవిని, ప్రతిప్రాణినీ ఆత్మస్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం.

అలాంటి అభిలాష నన్ను జీవన స్రవంతికి దగ్గర చేసింది. సత్యారాధనే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికీ సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని నేను గట్టిగా చెబుతాను. ఆత్మశుద్ధి లేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అంతరాత్మ– పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవనయానంలో ప్రతిభాగమూ పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇది అందరికీ సాధ్యమే. శుద్ధికావడమాటే, మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడూ కావడమే. రాగద్వేష రహితుడు కావడమే ఇట్టి నిర్వికార ప్రవృత్తికి దారితీస్తుంది అంటూ మహాత్ముడు ఈ లోకానికి మహత్తర ఆధ్యాత్మిక సందేశాన్నందించాడు.

మహాత్ముడు ఆంగ్లదేశంలో ఉన్న రెండవ చివరిభాగంలో దివ్యజ్ఞాన సమాజంతో పరిచయం ఏర్పడింది. వారు సంస్కృతంలో భగవద్గీతపై సర్‌ ఎడ్డిన్‌ ఆర్నాల్డ్‌ చేసిన ఆంగ్లానువాదాన్ని చదవడానికి– గాంధీజీని ఆహ్వానించారు. అయితే గాంధీ అంతవరకూ గీతను చూడలేదు. దాంతో ఆయన సిగ్గుపడ్డారు. వారికావిషయం సంకోచంతోనే చెప్పారు. అప్పటినుంచి గీత చదవడం ఆరంభించారు. ద్వితీయార్థంలో గాంధీజీని రెండుశ్లోకాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయనలో భగవద్గీత ఒక అమూల్యగ్రంథం అన్న భావన కలిగింది.

తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదని గాంధీజీ నమ్మకం. అందుకేనేమో, తన మనస్సు చెదిరినప్పుడల్లా భగవద్గీత తనకెంతో సాయపడిందన్నారు. కొంతకాలం తర్వాత మహాత్మునికి అదొక నిత్యపారాయణ గ్రంథమయ్యింది. గాంధీజీకి అనీబీసెంట్‌ పరిచయం అయ్యాక దివ్యజ్ఞాన సమాజంలో చేరమంటూ ఆయనను ఆహ్వానించారు. కానీ గాంధీజీ ‘నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అటువంటి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరడం’ అని చెప్పి వినమ్రంగా వారి ఆహ్వానాన్ని నిరాకరించారు. తర్వాత ‘కీ టు థియాసఫీ’ అన్న గ్రంథాన్ని చదివారు. అది చదివిన తర్వాత గాంధీజికి హిందూమతగ్రంథాలు చదవాలన్న కోరిక కలిగింది.

హిందూమతం మూఢనమ్మకాలమయం అని ఇతర మతస్థుల ప్రచారం తప్పు అన్న నమ్మకం గాంధీజీకి కలిగింది. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనపడదు. కొందరు వారి తపస్సు, వేదాంతాధ్యయనం, సాధన, నిష్ఠాబలం రక్షించిందనుకుంటారు. కానీ నిష్ఠాబలం ఆపత్సమయంలో ఎందుకూ పనికిరాదు. అట్టి సమయంలో అనుభవంలేని శాస్త్రజ్ఞానం వృథా అంటారు గాంధీ. ఇక్కట్ల సమయంలో దేవుడే తనను రక్షించాడని మాత్రం గాంధీజీ మహాత్ముడు గాఢంగా నమ్మారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాలలోనూ లాయరు పనిలోనూ, వేర్వేరు సంస్థలను నడపడంలోనూ, రాజకీయ వ్యవహారంలోనూ అనేక విషమ సంఘటనలలోనూ భగవంతుడు తనను రక్షించాడని గాంధీజీ నమ్మారు.

ఉపాయాలు తోచనప్పుడు, ఆశలు అడుగంటినప్పుడు, ఎటునుండో ఆ సహాయం అందిందని మహాత్ముడు తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. స్తుతి, ఉపాసన, ప్రార్థన వంటివి గుడ్డినమ్మకాలు కావన్నారు. ఇవి ఆహార విహారాదులకంటే అధికమైన సత్యాలన్నారు. ఈ ఉపాసన, ప్రార్థనలకు మూలం హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం. ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి సంబంధించింది. హృదయ పూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనం. అయితే ఆ ఉపాసన నమ్రత భావంతో మాత్రమే సాగాలన్నారు మహాత్ముడు.గాంధీజీ ఉపవాసం గురించి విపులంగా తెలియజేశారు.

విషయ వాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించి ఉపవాసాలు అవసరం అన్నారు. మనస్సును అదుపులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదన్నారు. మనస్సు రీత్యా ఉపవాసం చేయకపోతే అది దంబానికి కారణభూతం అవుతుంది. అది హానికూడా కలిగించవచ్చునన్నారు మహాత్ముడు.అట్టడుగు వర్గాలవారిని ఈ సమాజం అగౌరవ పరుస్తున్న తీరుకు మహాత్ముడు చలించిపోయాడు. వారిని హరిజనులు అంటూ భవంతునికి అత్యంత సన్నిహితులుగా తీర్చిదిద్దారు. సర్వమానవ సమానత్వం ప్రాతిపదికగా కొల్లాయిగట్టుకుని, చేతిలో ఊతకర్రతో వడివడిగా సాగిపోయే గాంధీని చూసి భారతీయులంతా మురిసిపోయి ‘మహాత్మా’ అంటూ చేతులెత్తి నమస్కరించేవారు.

వందల సంవత్సరాల దాస్యం నుండి విముక్తి కలిగించి, దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఒక మహోన్నత త్యాగమూర్తి ఆయన. ప్రాణాలు కోల్పోయే క్షణాల్లో కూడా ‘హేరామ్‌’ అని భగవంతుని నామాన్ని జపించిన మహాభక్తుడు. ఆయన నమ్మి, అనుసరించి, ఆచరించిన సత్యం, అహింస, దైవభక్తి, నిరాడంబరతలే ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి గుండెల్లోనూ మహాత్ముడిగా గుడికట్టాయి. మహా ఆప్తుడిగా తీర్చిదిద్దాయి.

విశ్వాసం
భగవంతుడే కాదు, ఎవరిపైనైనా, దేనిమీదనైనా విశ్వాసం కలిగి ఉండడం అనేది కొద్దిపాటి గాలికి కొట్టుకుపోయేది కాదు. అది అచంచలమైనది. అనిర్వచనీయమైనది. అమోఘమైనది.
అందువల్ల విశ్వాసం ఎప్పుడూ దృఢంగానే ఉండాలి.

ఎంతటి అవమానాన్ని అయినా, మరెంతటి క్రోధాన్నైనా అవలీలగా ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం చిరునవ్వు. బాధపడటం మినహా మానవదేహాన్ని సర్వనాశనం చేసే అంశం మరొకటి లేదు. ఎటువంటి క్లిష్టపరిస్థితులెదురైనా నిజంగా ఆ భగవంతునిపై నమ్మకం ఉంచితే బాధపడుతున్నందుకు సిగ్గుపడాలి.

– డా. పులివర్తి కృష్ణమూర్తి

మరిన్ని వార్తలు