అందమైన మనసు

1 Jan, 2020 01:15 IST|Sakshi

మనసు అందంగా ఉంటే మనిషి అభిరుచులు కూడా అందంగా ఉంటాయి.  ఆసక్తి ఉన్నా ఆసరా లేని మహిళలకు వివిధ ఉపాధి నైపుణ్యాలు నేర్పించి వారికి ఆర్థికంగా తోడ్పాటునిస్తున్న గీతా మిశ్రా.. నాలుగేళ్లుగా అనాథ పిల్లల్నీ చేరదీసి..సొంత ఖర్చుతో..  సొంతవాళ్ల సహకారంతో.. ఆ పిల్లల భవిష్యత్తుగా  అందమైన బాటను నిర్మిస్తున్నారు.

హైదరాబాద్, కోఠీలోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఇరుకు గల్లీలో ఓ మూడంతస్తుల భవనం ఉంది. ఆ బిల్డింగ్‌కి ‘నవజీవన్‌ ఆర్ఫన్‌ హోమ్‌’ అనే బోర్డు ఉంది. సాయంత్రం నాలుగు గంటల వరకు నిశ్శబ్దంగా ఉందా హోమ్‌. నాలుగుంపావుకు అక్కడికి స్కూల్‌ వ్యాన్‌ వచ్చి ఆగింది. బిలబిలమంటూ ఓ ఇరవై మంది పిల్లల వరకు దిగారు. రెండో అంతస్థులో ఉన్న గీతా మిశ్రా దగ్గరకు వెళ్లి ‘‘మమ్మీ! గుడీవినింగ్‌’’ అని విష్‌ చేశారు. వాళ్లలో పదేళ్ల దివ్య అయితే ఏకంగా గీతా మిశ్రా ఒళ్లో వాలిపోయింది. ‘‘పెద్దయిన తరవాత నాలాగ ‘మమ్మీ’ అవుతానని అంటోంది’’ అంటూ దివ్య బుగ్గలు పుణికింది గీతా మిశ్రా. ‘‘అవును, మా ఆంటీ నా ఒంటి మీద వాతలు పెడుతుంటే ఈ మమ్మీనే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. మమ్మీ నాలాంటి పిల్లలందరినీ ముద్దుగా చూసుకుంటోంది. అందుకే నేను పెద్దయిన తర్వాత ఆర్ఫనేజ్‌ పెట్టి అమ్మానాన్నలు లేకుండా కష్టాలు పడే పిల్లలందరికీ మమ్మీనవుతాను’’ అని గీతామిశ్రా మెడను చుట్టుకుని తన చేతి మీదున్న మానిపోయిన గాయాల మచ్చలను చూసుకున్నది దివ్య.

నిర్దయకు ఆనవాలు
దివ్య అమ్మానాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. అప్పుడు ఆ ఇంటి యజమాని పెట్టిన చిత్ర హింసలకు ఆనవాళ్లే మచ్చలు. ‘‘ఆమెకు కోపం వస్తే ఈ పాప చేతుల మీద వాతలు పెట్టేది, ఆడుకుంటున్నప్పుడు పెద్ద రాయి పైన వేసిందోసారి. అదృష్టవశాత్తూ ఆ బండరాయి తలకు తగల్లేదు’’ అని దివ్య తల నిమురుతూ చెప్పారు గీత.

ఆధార్‌ కార్డులోనూ ఆమే తల్లి
గీతామిశ్రా పూర్వికులది ఉత్తరప్రదేశ్, ఉన్నావ్‌ జిల్లా. నాలుగు తరాల కిందటే అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిర పడిన హిందీ కుటుంబం వాళ్లది. ఆమె బాల్యం హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గడిచింది. పెళ్లితో హైదరాబాద్, కోఠీలో స్థిరపడిన మరో మర్వాడీ కుటుంబంలో అడుగుపెట్టారు. సోషల్‌ వర్కర్‌గా గీత అల్పాదాయ వర్గాలు నివసించే బస్తీల్లో పని చేసేవారు. అక్కడ తాను చూసిన అనాథ పిల్లలను చేరదీస్తూ... వాళ్లకు తానే తల్లయ్యారు.

అలా ఓ ఇరవై మంది చిన్నారులకు ‘మమ్మీ, డాడీ’ రెండూ ఆమే అయ్యారు. ఆ పిల్లల స్కూల్‌ రిజిస్టర్‌లో గీతా మిశ్రా పేరే ఉంటుంది. ఆరుగురు పిల్లలకైతే ఆధార్‌ కార్డులో కూడా తల్లిగా ఆమె పేరే ఉంది. అదే గదిలో ఒక టేబుల్‌ మీద పిల్లల ఆధార్‌ కార్డుల రికార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌ల ఫైల్, పిల్లల మెడికల్‌ రికార్డ్స్‌ వరుసగా పేర్చి ఉన్నాయి. ఒక గోడకు పిల్లలు జూ పార్క్‌కు వెళ్లినప్పటి ఫొటోలతోపాటు పిక్‌నిక్‌లో ఒంటె మీద సవారీ చేస్తున్న ఫొటోలు, బాసరకు ట్రైన్‌లో వెళ్తున్న ఫొటోలు, జూ పార్క్, బోనాల వేడుక, గురుపూర్ణిమ, జాదూగర్‌ ఆనంద్‌ మ్యాజిక్‌ షో చూడడానికి వెళ్లినప్పటి ఫొటోలు ఉన్నాయి. మరో గోడకు క్యాలెండర్‌లో కొన్ని తేదీలు రెడ్‌ ఇంకుతో రౌండప్‌ చేసి ఉన్నాయి. అవి బర్త్‌డేలు, న్యూ ఇయర్‌ వేడుకలను హోమ్‌లో ఉన్న పిల్లలతో జరుపుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్లు రిజర్వ్‌ చేసుకున్న తేదీలు.

భగవంతుడే నడిపిస్తున్నాడు
ఒక మామూలు మహిళ ఇంత పెద్ద బాధ్యతను తలకెత్తుకోవడం గురించి గీతా మిశ్రా ఇలా అన్నారు. ‘‘నాది సంకల్పం మాత్రమే. నడిపిస్తున్నది ఆ భగవంతుడు. నాకు బరువు కలగకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చును పంచుకున్నారు. ‘నిరాధార్‌∙గుజరాతీ జైన్‌ సేవా సమితి’ వాళ్లు నెలకు ఇరవై వేలిస్తారు. హోమ్‌ నిర్వహణ కోసం ఒక కుక్, ఒక కేర్‌టేకర్, ఒక ట్యూటర్‌ ఉన్నారు. వాళ్ల జీతాలకు ఆ డబ్బు సరిపోతుంది. మా అమ్మ విద్యామిశ్రా, స్నేహితులు ఆర్తి పాటిల్, లతారెడ్డి, నావల్‌ కిశోర్, ఓం ప్రకాశ్, ఉర్మిళ క్రమం తప్పకుండా ప్రతినెలా రెండు–మూడు వేలిస్తారు. ఉర్వి అనే మరో ఫ్రెండ్‌ అప్పుడప్పుడూ కిరాణా సరుకులు తెచ్చి పెడుతుంటుంది. స్కాల్‌ (ఎస్‌కెఏఎల్‌) మెంబర్‌ రవీశ్‌ దవే పిల్లలకు నెలకోసారి స్టార్‌ హోటల్‌ ఫుడ్‌ పంపిస్తారు. కొంతమంది వాళ్లకు తోచినప్పుడు పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కు పాలు, బిస్కట్, అరటి పండ్లను స్పాన్సర్‌ చేస్తారు. నేరుగా పాలవాళ్లకు, అరటిపండ్ల వాళ్లకు డబ్బిచ్చి ఎన్ని రోజులు వేయాలో చెప్తారు. మిగిలిన రోజులకు నేను పే చేసుకుంటాను.

నేను బ్యూటిషియన్‌గా హోమ్‌సర్వీస్‌ చేస్తాను కాబట్టి మంచి ఫీజు ఇస్తారు. ఆ భగవంతుడి దయ వల్ల మా ఇంట్లో నా సంపాదన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. అమ్మాయిలిద్దరికీ పెళ్లయింది. ముంబయిలో ఉంటారు. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మా వారు ప్రైవేట్‌ కంపెనీలో చేస్తారు. ఆర్ఫన్‌ హోమ్‌ కోసం ఇల్లు వెతుకుతున్నప్పుడు ఎవరూ ఇల్లు అద్దెకివ్వలేదు. ఆ టెన్షన్‌తో నాకు బీపీ ఒడిదొడుకులు, షుగరూ వచ్చేశాయి. అప్పుడు మా వారు, పిల్లలు నాకు నచ్చచెప్పి ఈ ఇంట్లోనే హోమ్‌ నడుపుకోమన్నారు. ఇప్పుడు మేము కాచిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాం’’ అని ఈ హోమ్‌ నిర్వహణలో ఎవరెంతెంత సహాయం చేస్తున్నారో చెప్తూ ‘ఒక మంచి పని చేస్తుంటే కలిసి వచ్చే చేతులు సమాజంలో చాలానే ఉన్నాయి’’ అన్నారు గీతామిశ్రా.

మంచి డాక్టర్లు దొరికారు
హోమ్‌లోని పిల్లలకు విద్యతో పాటు వైద్యానికి కూడా తనకు దేవుడు మంచి దారిని చూపించాడు అన్నారు గీత. ‘‘డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ బోలే ఇద్దరూ పిల్లలకు ఏ సమయంలో అవసరం వచ్చినా సరే ఉచితంగా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అనాథ బిడ్డల బాధ్యత తీసుకోవడం అంటే... వాళ్లకు ఉండడానికి నీడనిచ్చి, కట్టుకోవడానికి దుస్తులిచ్చి, వేళకింత అన్నం పెట్టడం మాత్రమే కాదు. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి మంచి జీవితంలో స్థిరపడడానికి ఒక దారిని కూడా వేయాలి. పిల్లల చదువే నా మొదటి ప్రాధాన్యత. మొదట్లో మా హోమ్‌కు దగ్గరలో ఉన్న గవర్నమెంట్‌ స్కూల్లో చేర్పించాను.

అక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఉంది కదా అనుకున్నాను. అయితే ఆ స్కూల్లో పిల్లలకు చదువు మీద ఇష్టం కలగలేదు. దాంతో నల్లకుంటలోని ‘వామాక్షి విద్యానికేతన్‌ హైస్కూల్‌’లో చేర్చాను. ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పద్మ ఫీజు రాయితీ ఇచ్చారు. రాయితీ పోగా కట్టాల్సిన ఫీజును కూడా సిటీలో ఉన్న మా మార్వాడీ కమ్యూనిటీలో రామకృష్ణ, రమ, శకుంతల వంటి వాళ్లు ఏడాది మొత్తానికి ఒకేసారి కట్టేస్తున్నారు. నందకిశోర్‌ వ్యాస్‌ వంటి ఎందరో సహాయం చేస్తున్నారు. ఈ పిల్లలను నా దగ్గరకు చేర్చిన భగవంతుడే జరగాల్సిన వాటికి కూడా దారి చూపిస్తున్నాడు’’ అన్నారామె సంతోషంగా.

ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంది
‘‘మా పిల్లలు ఊరికే స్కూలుకుపోవడం కాదండీ, ఇదిగో... ఈ నికిత స్కూల్‌ టాపర్, కలెక్టర్‌ కావాలని తన కోరిక. అమ్ములు, జీవన, శిరీష, పూజ తమ క్లాస్‌లకు లీడర్‌లు. ఈ చిన్నారులకు భవిష్యత్తు మీద ఎంత పెద్ద ఆలోచనలున్నాయో అని చెబుతూ.. ‘‘మోనికా నువ్వేమవుతావు’’ అని అడిగారు గీతామిశ్రా. వెంటనే మోనిక ‘డాక్టర్‌’ అని, నూతన ‘హార్స్‌ రైడర్‌’ అని, హేమలత ‘పోలీస్‌’, మరో నికిత ‘టీచర్‌’’, జీవన ‘కలెక్టర్‌’ అని చెప్పారు. శిరీష ఎయిర్‌హోస్టెస్‌ అవుతానని చెప్పింది, అంకిత మాత్రం ‘నేను హీరోయిన్‌నవుతా’ అని సిగ్గుపడిపోయింది. ఇంతలో ఓ పాపాయి ‘‘మేము ఫ్లయిట్‌ ఎక్కుతాం’’ అన్నది. ‘‘ట్రూజెట్‌ వాళ్లు ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ ప్రోగ్రామ్‌లో పేద పిల్లలకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తున్నారు. ఈ సారి ఆ ట్రిప్‌లో మా హోమ్‌ పిల్లలను కూడా తీసుకెళ్లనున్నారు’’ అని చెప్పారు గీతామిశ్రా.
– వాకా మంజులారెడ్డి

ఎలాగైనా ప్రభాస్‌ని చూపించాలి

‘‘స్వర్ణజయంతి షహరి రోజ్‌గార్‌ యోజన’లో భాగంగా అల్పాదాయ వర్గాల నివాస ప్రదేశాల్లోని మహిళలకు ఫ్యాషన్‌ డిజైనింగ్, ఇంటీరియర్‌ డెకరేషన్, బ్యూటీషియన్‌ కోర్సుల్లో స్కిల్‌ ట్రైనింగ్‌ ఇచ్చాను. రేషన్‌కార్డు, ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌ల వంటి గవర్నమెంట్‌ ఆఫీసుల్లో జరగాల్సిన పనులు చేయించడంలో సహాయంగా ఉండేదాన్ని. కాలనీ వాళ్లు తల్లిదండ్రులు లేక నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూపించి వాళ్లకు ఏదో ఒక దారి చూపించమని అడిగేవాళ్లు. అలా ఒక్కొక్కొళ్లనీ మా ఇంటికి తెచ్చుకున్నాను. ఇంతమంది పిల్లలకు తల్లినయ్యాను. మా పిల్లలు సినీ యాక్టర్‌ ప్రభాస్‌ను చూపించమని మారాం చేస్తున్నారిప్పుడు. ఎలాగైనా సరే వాళ్ల ముచ్చట తీర్చాలి.

మరిన్ని వార్తలు