శేషాచలం సానువుల్లో....

27 Nov, 2019 04:02 IST|Sakshi

ట్రెక్కింగ్‌

భ్రమణ కాంక్షే అసలైన మానవ కాంక్ష అని పెద్దలు అంటారు. తిరిగినవారే గెలుస్తారు అని కూడా అంటారు. నాలుగు వైపులకు వెళ్లకపోతే, నాలుగు దిశలలో నడవకపోతే బతుకు బావిలా మారుతుంది. కనుచూపు కురచబారుతుంది. ‘ఎదగాలంటే తిరగాలి’ అంటారు భూమన అభినయ్‌ రెడ్డి. అతనికి శేషాచలం కొండలు కొట్టిన పిండి. పదిహేనేళ్ల కిందట బ్రహ్మదేవుని గుండంకు చేసిన తొలి ట్రెక్కింగ్‌ నుంచి ఇటీవల తలకోనతో మొదలెట్టి యుద్ధగళ వరకు వారం రోజుల పాటు శేషాచలం అడవుల్లో సాగిన ట్రెక్కింగ్‌ వరకు అతడు పోగు చేసుకున్న అనుభూతులు ఎన్నో. వాటిలో కొన్ని ఇవి.

‘పదేళ్ల క్రితం మా అమ్మ రేవతి ‘యుద్ధగళ’కు వెళ్లి వచ్చి, ఆ విశేషాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలను కున్నాను. అందురూ నడిచే మార్గంలో కాకుండా కొత్తదారిలో ఆ తీర్థానికి వెళ్లాలనుకున్నాను. ట్రెక్కింగ్‌ చేసే ఔత్సాహికులతో కలిసి యుద్ధగళకు పయనమయ్యాను. యుద్ధగళ ట్రెక్కింగ్‌ అడుగడుగునా ఆశ్చర్యంతో పాటు ఆనందానుభూతిని కలిగించింది.

వారం రోజులు అడవిలోనే!
యాభై మందితో సాగిన మా ట్రెక్కింగ్‌ యాత్ర.. శేషాచలం కొండలకు పడమర దిక్కున ఉన్న తలకోన నుంచి తాబేలు బావి, యుద్ధగళ, మూడేళ్ల కురవ, కంగుమడుగు, ఆదిమానుబండలు, ఎర్రంరెడ్డి మడుగు మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని కుక్కలదొడ్డి వరకు సాగింది. ఎత్తైన తలకోన జలపాతాన్ని తనివి తీరా చూసుకుంటూ, ఆ కొండ ఎక్కి నాగరికత ఆనవాళ్లకు దూరంగా వారం రోజులు అడవిలోనే గడిపాం. నా చిరకాల కాంక్షను తీర్చే నడక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహావృక్షాలు, మానవ అలికిడికి భయపడి పారిపోయే జంతు జాలాలు,  లెక్కలేనన్ని వృక్షజాతులు ఈ శేషాచలం అడవుల్లో ఉన్నాయి.

జలపాత సోయగాల తలకోన
అక్టోబర్‌ 8న ఉదయం తిరుపతి నుంచి తెల్లవారుజామునే బయల్దేరి తలకోనకు వెళ్ళాం. ఒక్కొక్కరి వీపుమీద దాదాపు ఇరవై కిలోల బరువుతో కొండపైకి నడక మొదలు పెట్టాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమైన తలకోన అందాలను, ఆ జలపాత సోయగాలను వీక్షిస్తూ ఆ కొండ కొసకు చేరాం. ఉదయం తొమ్మిదైంది. అప్పుడు కానీ మాకు సూర్యదర్శనం కాలేదు. అలా అడవిలో నాలుగు గంటలు నడిచాక మాకు అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు కనిపించింది. ఆ ఏరు ప్రవాహానికి ఎదురుగా వెళితే తాంబేలేరు కనిపించింది. కొండపైన అంత ఎత్తులో ఎంతో స్వచ్ఛమైన నీళ్లు.! ఇక నేరుగా యుద్ధగళ తీర్థానికి వెళ్లాం.

బొట్లు బొట్లుగా.. యుద్ధగళ
యుద్ధగళ తీర్థంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గీసిన హనుమంతుడి బొమ్మలు చూశాం. ఆ రాత్రికి అక్కడే బసచేశాం. అడవిన కాసిన వెన్నెలను మేం తనివితీరా అనుభవించాం. మర్నాడు యుద్ధగళ తీర్థం దిగువున ఉన్న విష్ణుగుండంలోకి దిగాం. ఎనిమిది వందల మీటర్ల లోపలికి తాడు సాయంతో కిందకు దిగాం. అదొక గొప్ప అనుభూతి. మధ్యాహ్నం యుద్ధగళ తీర్థం సమీపంలో పెట్రోగ్లిఫ్‌లుగా పిలిచే చిత్రాలను పెద్ద బండపై ఉలితో చెక్కి ఉండడాన్ని చూశాం.

ఆ చిత్రాలను ఎన్నో సామాజిక, సాంస్కతిక, మార్మిక అంశాలను పొందపరిచారు. ఉరకడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆంబోతులు, ఒక గణాచారి ఈ చిత్రసంచయానికి హైలైట్‌. ఈ చిత్రాలపై పూర్తిస్థాయిలో పురావస్తు శాస్త్ర పరిశీలన జరగాల్సి ఉంది. పరిశోధన జరిగితే అదిమానవునికి సంబంధించిన ఆనవాళ్లు మరిన్ని బయటపడచ్చు. సాయంత్రం తిరిగి మడుగు వద్దకు వచ్చాం. యుద్ధగళ అసలు పేరు రుద్రగళ. ఆ తీర్థంలో రాత్రి నిద్రించినప్పుడు అందులో బొట్లు బొట్లుగా పడే నీళ్లు యుద్ధ శబ్దాలను తలపించేటట్టు ఉంటాయి. అందుకే ఈ తీర్థానికి యుద్ధగళ అని పేరొచ్చింది.

మూడేర్ల కురవ.. కంగుమడుగు
కంగుమడుగుకు సమీపంలో మూడేర్ల కురవ అనే ఏరు ఉంది. మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఏర్లు కలిసి ప్రవహించడం వల్ల దీనికా పేరొచ్చింది. మరుసటి రోజు కంగు మడుగుకు ప్రయాణమయ్యాం. కంగు మడుగు పెద్ద ఏరు. ఏనుగులు నీటి కోసం, జలకాలాడటం కోసం వస్తాయి. కనుకే ఏనుగుల రాకను గమనిస్తూ ఉండాలి. అవి వచ్చి పడ్డాయంటే, తప్పించుకోవడం కష్టమే. ఇక్కడ ఏనుగులు సంచరించిన ఆనవాళ్లను గమనించాం. ఇక్కడ అటవీ శాఖ వారి బేస్‌ క్యాంప్‌ కూడా ఉంది. ఆ రాత్రి కంగుమడుగు ప్రాంతంలోనే బస చేశాం. తెల్లని వెన్నెల్లో..

అరిమాను బండలు
మరుసటి రోజు ఉదయమే మళ్లీ మా నడక. మ«ధ్యాహ్నానికి అరిమాను బండలకు చేరుకోగలిగాం. అదొక ఎత్తైన ప్రదేశం. పౌర్ణమికి సరిగ్గా రెండు రోజులు ముందు కావడంతో ఆ రాత్రి చందమామ కురిపించే తెల్లని వెన్నెల ఎంత చల్లగా ఉందో. మరుసటి రోజు అరిమాను బండ కింద నుంచి గద్దలపీతుగుండం వెళ్లాం. ఇక్కడ కొన్ని గద్దలు సంచరించడం మాకు కనిపించింది. ఈ గుండానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో అద్బుతమైన సుందర ప్రదేశం బూడిదపునుకు. ఇది రమణీమైన గుండం. లేలేత సూర్యకిరణాలు నీటిని తాకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు.

ఆదిమానవుడు గీసిన చిత్రాలు
ఇక్కడ కూడా చరిత్ర పూర్వయుగం నాటి ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఉన్నాయి. అనంతరం ఓ నాలుగు వందల మీటర్ల దూరాన్ని చిన్న కొండల మధ్య నడిచాం. అక్కడ ఓ చిత్రం మా కంటపడింది. అది ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేది. జంతువులను వేటాతున్న మహిళల చిత్రం చూసి అబ్బుర పడ్డాం. సాయంత్రం ఆరిమానుబండకు తిరిగి వచ్చాం. రాత్రి అక్కడే బస చేశాం.

నీటి మడుగుల్లో దీపాలు     
మా అడవి యాత్రలో ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరింది. బూడిదపునుకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమరెడ్డి మడుగుకు మరుసటి రోజు నడక ప్రారంభించాం. ఆ రోజంతా అక్కడే గడిపాం. అక్కడ దగ్గర దగ్గరగానే రెండు మడుగులున్నాయి. ఆ రోజు పున్నమి. మడుగులను దీపాలతో అలంకరించాం. ఆ దీపాల ప్రతిబింబాలతో మడుగులు చూడచక్కగా ఉన్నాయి. కళ్లార్పకుండా ఎంత సేపైనా చూడాలనిపించేంత  అద్భుతంగా వెలుగొందాయి. పౌర్ణమి  రాత్రి నీటిలో దాదాపు మూడు గంటల పాటు తనివితీరా గడిపాం. మా యాత్రలో ఆ చివరి రాత్రి ఎర్రమరెడ్డి మడుగు వద్దే గడిచింది. మరునాడు సోమవారం ఉదయం అక్కడి నుంచి వైఎస్సార్‌ జిల్లా కుక్కల దొడ్డికి చేరుకున్నాం.’ అని ముగించాడు అభినయ్‌.

జీవవైవిధ్యం
అన్ని సదుపాయాలూ ఉన్న నగరాలను, కాంక్రీటు వనాలను వదిలి అచ్చమైన, స్వచ్ఛమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి వారం రోజుల పాటు ఉండటం గొప్ప అనుభూతి. ప్రకృతితో లీనమైపోవడం, ప్రకృతిపైన ప్రేమను పెంచుకోవడం, అడవి అంటే ఇష్టం పెంచుకోవడం, అడవులను కాపాడాలన్న భావన కలిగించుకోవడం స్వయంగా అనుభూతించాం. మానవ మనుగడకు అడవుల రక్షణ, వాటిలోని జంతుజాలం రక్షణ ఎంతగా ఉపకరిస్తాయో స్వయంగా తెలుసుకున్నాం. 

– భూమన అభినయ్‌ రెడ్డి, తిరుపతి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా