కామెడీ చేయడం... పెద్ద ట్రాజెడీ!

11 Aug, 2014 23:55 IST|Sakshi
కామెడీ చేయడం... పెద్ద ట్రాజెడీ!

లైఫ్ బుక్
 
చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం. నేనే సొంతంగా నృత్యరీతులు సమకూర్చుకునేదాన్ని. సినిమాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమాల వైపు గాలి మళ్లింది. నటి కావాలనుకున్నాను. అలా తొలిసారిగా ఒక పంజాబీ సినిమాలో నటించాను.
     
తొలిసారిగా ముంబయిలోకి అడుగు పెట్టినప్పుడు కాస్త భయపడ్డాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. అనవసరంగా  రిస్క్ చేశానా? అనిపించింది. అయితే కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. అలా భయానికి దూరంగా ఉండగలిగాను.
      
భాష తెలియని చిత్రాల్లో నటిస్తున్నప్పుడు...అనువాదకుడి సహాయంతో నేను చెప్పబోయే డైలాగు గురించి తెలుసుకుంటాను. భావాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుంటేగానీ నటించడానికి ప్రయత్నించను.
 
గ్లామర్ ప్రపంచంలోకి వచ్చాక చాలా విషయాలు తెలిశాయి. చూసేదంతా నిజం కాదు... ప్రేక్షకులకు నటుల గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే రాత్రనక, పగలనక వారు పడే కష్టం చాలా తక్కువమందికి మాత్రమే తెలుస్తుంది. ‘సినిమా ఫీల్డ్‌లోకి వెళితే చాలు మహారాణిలా బతకవచ్చు’ అని వెళ్లక ముందు అనిపిస్తుంది. తరువాత మాత్రం ‘కష్టం’ అనేది అవగాహనలోకి వస్తుంది.. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దిగులు ఉన్నా...వీటినేమీ పట్టించుకోకుండా సదా పెదవుల మీద చిరునవ్వుతో కనిపించాలి. ఎంత కష్టం!
 
అన్నిట్లోకి హాస్యం పండించడం చాలా కష్టం అనేది నా అభిప్రాయం. నటించే వాళ్లు నవ్వగానే సరిపోదు కదా! కొన్నిసార్లు ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా-‘‘ఏడ్చినట్లే ఉంది’’లాంటి కామెంట్లు వినిపిస్తాయి. అందుకే అంటాను ‘కామెడీ చేయడం...పెద్ద ట్రాజెడీ’ అని!     ఒకవిధంగా చెప్పాలంటే భోజనప్రియురాలిని. మూడు పూటలా లాగించేస్తాను. చిరుతిండికి మాత్రం చాలా దూరంగా ఉంటాను. ఇంటి తిండిలో ఉన్న తృప్తి ఎంత ఖరీదైన హోటల్లో తిన్నా ఉండదు.
 
- సుర్వీన్ చావ్లా, హీరోయిన్, (హేట్‌స్టోరీ-2 ఫేం)

>
మరిన్ని వార్తలు