వేవిళ్ల బాధతో ఆఫీసుకు డుమ్మా..?!

15 Sep, 2016 00:22 IST|Sakshi
వేవిళ్ల బాధతో ఆఫీసుకు డుమ్మా..?!

గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం (నాసియా), వాంతులు చాలా సాధారణం. ఇవి 10 వారం ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అంటే దాదాపు  రెండున్నర నెలల సమయంలోనన్నమాట. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు.

ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించవచ్చంటూ చాలామంది అడుగుతుంటారు. దీనికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. సుకుమారంగా ఉండేవాళ్లు కేవలం రెండు మూడుసార్లకే నీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారుసార్లు వాంతులైనా తట్టుకోగలరు. ఇక దీనివల్ల ఏదైనా ఇబ్బంది అంటూ ఉందా అని కూడా చాలా మంది అడుగుతుంటారు. అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతులు అవుతున్న కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగానూ, సమస్యగానూ పరిగణించాల్సి అవసరం లేదు. ఐదో నెల వరకూ ఇలా ఉండవచ్చు. అప్పటి వరకూ దీనివల్ల బరువు పెరగకపోయినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఐదు నెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.

 వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి చిట్కా విషయానికి వస్తే అల్లం మురబ్బా తీసుకోవడం గాని లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. ఇక ఆహార మార్పుల విషయానికి వస్తే... చాలా మంది మహిళలకు ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లు మారినట్లుగా ఉంటాయి. అంటే... అంతకుమునుపు స్వీట్స్ ఇష్టపడని వారికి ఈ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే అంతకు మునుపు కారాలు, మసాలాలు అస్సలు ముట్టని వారికి, ఈ సమయంలో వాటిని ఎక్కువగా తీసుకోవాలని అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో చేయాల్సిన ఆహారపు మార్పులంటూ పెద్దగా ఉండవు. అన్ని రకాల పదార్థాలూ తీసుకోవచ్చు. కాకపోతే మసాలాలు తగ్గించాలంతే. 

వేవిళ్లు మరీ ఎక్కువగానూ/ తీవ్రంగానూ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయించుకుని, అసాధారణ గర్భం ఏదైనా ఉందేమో అన్నవిషయాన్ని రూల్‌అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ టైమ్‌లో  బరువు పెరిగితే...
ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం చాలా సాధారణంగా జరిగేదే. ఈ సమయంలో గర్భవతులు 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతారు. అయితే ఎవరెవరు ఎంతెంత బరువు పెరగడం ఆరోగ్యకరం అన్న విషయం... గర్భవతి కాకమునుపు వారున్న బరువుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బరువు విషయంలో వారి శరీరతత్వం ఏమిటి అన్నది వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) మీద ఆధారపడి ఉంటుంది. వీరిలో బరువు తక్కువగా ఉన్నవారు (అండర్ వెయిట్ మహిళలు) ప్రెగ్నెన్సీ టైమ్‌లో 15 కిలోల వరకు పెరిగినా పర్లేదు. కానీ స్థూలకాయులు మాత్రం 5 నుంచి 9 కిలలో లోపే తమ బరువు పెరుగుదలను పరిమితం చేసుకోవడం మంచిది.

సగటున చూస్తే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు సాధారణంగా వారినికి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు. ఇక వేవిళ్లతో బాధపడుతూ తరచూ వాంతులు చేసుకునేవారు 20 వారాలలోపు  ఒక్కొక్కసారి అసలు బరువే పెరగకపోవచ్చు. ఇలా బరువు పెరగకపోవడం అన్నది కూడా వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకూ (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు.

 చాలామంది ప్రెగ్నెన్సీలో బరువు పెరుగుతూ పోతూ, సిజేరియన్ తర్వాత ఒళ్లు వచ్చిందంటూ బాధపడుతుంటారు. నిజానికి సిజేరియన్‌కూ బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తినడంతో పాటు బిడ్డకు పాలు తాగించడం, సంరక్షించడంలో పడిపోయి తమ గురించి శ్రద్ధ తీసుకోకపోవడంతో జరిగే పరిణాయిది.

 గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు. శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 ఇక గర్భవతులు ఇద్దరి కోసం తినాలంటూ చాలామంది వారిని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం అన్నది సరికాదని గ్రహించాలి.

గడ్డలు మళ్లీ వస్తాయేమోనని ఆందోళన
నా భార్యకు 43 ఏళ్లు. ఆమెకు రొమ్ములో గడ్డలు వస్తే ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే మళ్లీ గడ్డలు రావచ్చని, అవి క్యాన్సర్ గడ్డలుగా మారవచ్చని కూడా అన్నారు. హోమియో విధానం ద్వారా ఇది తగ్గుతుందా?         - నవీన్ కుమార్, పాలకుర్తి

 ఫైబ్రోఎడినోమా అంటే బినైన్ ట్యూమర్స్. అంటే ఇవి క్యాన్సర్‌లా హానికరమైనవి  కావు. సాధారణంగా మహిళలకు 30 ఏళ్ల వయసులో ఇలాంటి గడ్డలు రొమ్ములో రావడం మామూలే. ఇలాంటివి కనిపించినప్పుడు ప్రతి రెండు నెలలకోసారి అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయాక ఇలాంటి గడ్డలు రావడం కూడా చాలామందిలో తగ్గిపోతుంది. అయితే ఇలాంటి గడ్డలు వచ్చినప్పుడు వాటిని కారణాలేమిటి, వాళ్ల మానసికపరిస్థితులు, తత్వం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇచ్చి, వాటిని పూర్తిగా నయం చేయవచ్చు. గడ్డలు వచ్చే శరీర తత్వం ఉన్నవారికి ఆపరేషన్ చేసినా ఇవి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నిపుణులైన హోమియో వైద్యుడిని కలిసి ఆమెను డాక్టర్‌కు చూపించాకే మందులు వాడటం మంచిది.

 నా వయుసు 22 ఏళ్లు. నాకు  పెదవులపై నీటిపొక్కులు వస్తున్నాయి. ఇదేమైనా అంటువ్యాధా? ఏ మందులు వాడాలి? పరిష్కారం చెప్పండి.    - సురేశ్, చెన్నై

 పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫివర్ బ్లిస్టర్స్ అని అంటారు. ఇవి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. టీబీ, సిఫిలిస్, ల్యుకేమియా, ఎనీమియా, ఏదైనా వుందుల వల్ల అలర్జీ వంటి వాటివల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. ఇవి మానసిక ఒత్తిడి వల్ల కూడా వచ్చే అవకాశం కొందరిలో ఉంది. ఒకటి నుంచి రెండు వారాల్లో ఇవి వాతంతట అవే తగ్గిపోయి... మళ్లీ మానసిక ఒత్తిడి కలిగినప్పుడో, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడో బయటపడటం అన్నది సాధారణం. వీటికి గురికాకుండా ఉండటం కోసం తగిన పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు శాశ్వత పరిష్కారంగా హోమియో మందులు బాగా పనిచేస్తాయి. అయితే ఎవరికి ఏరకమైన మందులు ఇవ్వాలన్న అంశాన్ని వారి లక్షణాలు, జెనెటిక్ నేచర్ ఆధారంగా హోమియో నిపుణులు నిర్ధారణ చేస్తుంటారు. మీరు హోమియో నిపుణులను కలవండి.

>
మరిన్ని వార్తలు