వాడికి నేను...అక్కను కాదు అమ్మను!

9 Aug, 2014 22:37 IST|Sakshi

రాఖీ పండుగ...
 ఒకరికి ఒకరు అండగా నిలుస్తామని ప్రమాణం చేసే పండుగ...
 చెల్లెళ్లు అన్నయ్యలకు మాత్రమే రాఖీ కట్టే పండుగ కాదు...
 అక్కయ్యలు తమ్ముళ్లకు అండగా నిలుస్తామనే
 భరోసా ఇచ్చే పండుగ కూడా ...
 శ్రీకాంత్, అనిల్... .
 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారలు...
 నిర్మల... ఆ సెలబ్రిటీల తోబుట్టువు...
 నలభై సంవత్సరాలుగా వీరి మధ్య అనుబంధం ఎంతో పొందికగా కొనసాగుతోంది...
 ‘మాకు అందరి కంటె మా అక్కే ఎక్కువ’ అని ఆ తమ్ముళ్లు చెబుతుంటే...
 ‘నాకు మా ఇద్దరు తమ్ముళ్లు దేవుడిచ్చిన బహుమతి...
 వాళ్లు నాకు పెద్ద కొడుకులు, ఆ తరవాతే మా అమ్మాయి’ అంటున్నారు అక్కయ్య నిర్మలచిన్నప్పటి నుంచీ తమ్ముళ్లతో టెన్షన్స్...
 తరవాత సరదాలు, సాహసాలూ... రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈ అక్కాతమ్ముళ్ల ఆప్యాయతానురాగాలను శ్రీకాంత్ సోదరి నిర్మల ‘సాక్షి’ తో మురిపెంగా పంచుకున్నారు.

రక్షాబంధనం...
మా పెద్ద తమ్ముడు శ్రీకాంత్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారి రాఖీ కట్టాను. అప్పుడు వాడు తనకి స్పోర్ట్స్‌లో వచ్చిన బహుమతులలో నుంచి ఒక బొమ్మ తీసి, దాన్ని అందంగా ప్యాక్ చేసి, ప్రేమగా నా చేతికి ఇచ్చినట్లు గుర్తు. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఒక్క సంవత్సరం కూడా మానకుండా రాఖీ కడుతున్నాను.
 
రక్షణకేనా...
రాఖీ కట్టడమంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్లకు రక్షణ కల్పించడం అనుకుంటారు చాలా మంది. నా లెక్క ప్రకారం సందర్భాన్ని బట్టి ఒకరికొకరు రక్షణగా నిలబడాలి. నేను మా ఇంట్లో పెద్దదానిని. అందువల్ల మా తమ్ముళ్లకి రాఖీ కట్టి వాళ్లని ఆశీర్వదించే అవకాశం నాకు ఈ రోజు హక్కుగా సంక్రమించినట్టు, ‘భగవంతుడి రక్ష’ నాతో కట్టిస్తున్నట్టు భావిస్తాను.
 
బాధగా ఉండేది...

నేను పుట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత మా కాంతి (శ్రీకాంత్‌ని ప్రేమగా కాంతి అంటారు) పుట్టాడు. నా ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుంచి వాడంటే ప్రాణం. ఎవరైనా మా కాంతిని ఏమైనా అన్నారో, ఇక వాళ్ల పని అయిపోయినట్లే!
 
బాల శ్రీకృష్ణుడు

మా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా మేనత్త మా ఇంటికి వచ్చారు. మా కాంతి ఆవిడని ఏదో అడిగితే, ఆవిడ కాదన్నారు. అందుకు వాడికి కోపం వచ్చింది. వాడు అదనుకోసం చూస్తున్నాడు. ఆవిడ స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లి, తలుపు మీద బట్టలు వేయగానే, ఆ బట్టలు తీసుకుని, గోడ ఎక్కేశాడు. నాన్నగారు వాళ్లు చూస్తారేమోనని నాకు భయం. బట్టలు ఇచ్చేయమని వాడిని ఎంతో బతిమాలాను. ఈ లోపల అమ్మవాళ్లంతా అక్కడకు వచ్చారు. ఎలాగో చివరకు బట్టలు ఇచ్చాడు. అప్పటి నుంచి వాడిని మావాళ్లంతా ముద్దుగా శ్రీకృష్ణుడు అనేవారు. ఇంతా చేస్తే అప్పుడు వాడికి ఐదేళ్లు. మాఅత్తయ్య ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుని నవ్వుకుంటారు.
 
స్కూల్‌లో నా పక్కనే...

స్కూల్లో చేరిన కొత్తలో వాడు నా దగ్గరే కూర్చునేవాడు. కొన్నిరోజులయ్యాక వాడి  క్లాస్‌లో కూర్చోవడం మొదలుపెట్టాడు. మా స్కూల్ పక్కన పెద్ద కాల్వ ఉంది. అందులో ఉండే చేపలకు క్యారేజీలో తెచ్చుకున్నదంతా వేసేవాడు. ఒకసారి చేప అనుకుని ఒక పాముని పట్టుకున్నాడు. వదిలేయమని నేను ఎంత గట్టిగా అరిచినా వాడు వదలలేదు. ఇంతలో ఆ పాము కరిచింది. దాంతో భయం వేసిందో ఏమో, స్పృహతప్పి పడిపోయాడు. నాకు చాలా భయం వేసింది. అది విషపు పాము కాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ రోజు వాడితో ప్రమాణం చేయించుకున్నాను ‘సాహసాలు చేయను’ అని. అప్పటి నుంచి ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు.
 
కొండ మీద సాధువంటే... అమ్మో...

వాడికి చిన్నప్పటి మా ఊళ్లో కొండ మీద ఉండే సాధువంటే భయం, భక్తీను. ఎప్పుడు అల్లరి చేసినా ఆ సాధువుకి ఇచ్చేస్తామని అనేవాళ్లం. మేం సరదాగా చెప్పిన మాటతో, కొండ మీద సాధువు ఏదో చేస్తాడని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఆ సాధువు భిక్ష కోసం రాగానే ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసేవాడు.
 
దొంగ భయం...

వాడికి దొంగల భయం కూడా ఎక్కువే. వేసవికాలంలో మేమంతా ఆరుబయట పక్కలు వేసుకుని పడుకుంటే, వాడు మాత్రం తలుపులన్నీ వేసుకుని ఇంట్లో పడుకుని, కిటికీ దగ్గర నుంచి బయటకు చూస్తుండేవాడు, ఎవరైనా దొంగలు వస్తున్నారేమోనని. ఒకరోజు నిజంగానే ఒక దొంగ కిటికీ పక్క నుంచి వెళ్లాడు. దాంతో నన్ను లేపి, ‘అక్కా! ఇటు నుంచి దొంగ వెళ్లాడు’ అని చెప్పాడు. మేం వాడి మాట నమ్మలేదు. ఇంతలోనే పక్కింటి దగ్గర నుంచి పారిపోవడం చూశాం. వాడు చెప్పింది నిజమే అనుకున్నాం. ఆ సంఘటనతో వాడికి బాగా ధైర్యం వచ్చింది. అది చూసే వాడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను.
 
చిన్నప్పుడు ఒకసారి...
 
చిన్నప్పటి నుంచి వాడు చేసే పనుల వల్ల సరదా కంటె టెన్షన్స్ ఎక్కువగా ఉండేది. ఇంటికి వచ్చిన చుట్టాలతో అమ్మ ఎప్పుడూ బిజీగా ఉండేది. అందువల్ల తమ్ముళ్ల బాగోగులన్నీ నేనే చూసేదాన్ని. వాడు ఏం చేసినా అమ్మానాన్నలకు చెప్పకుండా కవర్ చేసేదాన్ని.
 
ఆ రోజు చాలా భయపడ్డాను...
 
ఒకసారి నాన్నగారు మా కాంతిని కోప్పడ్డారు, సరిగ్గా చదవట్లేదని. అప్పుడు వాడు నాతో ‘నేను లేకపోతే కాని వీళ్లకి నా విలువ తెలియదు’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఒక కుర్రాడు వచ్చి, ‘మీ తమ్ముడు కాల్వ వైపుగా వెళుతూ కనిపించాడు’ అని చెప్పాడు. అంతకుముందే ఎవరో ఆ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని మా కాంతి విన్నాడు. ఒక్కసారి నా నవనాడులూ కుంగిపోయాయి. పరుగుపరుగున కాల్వ దగ్గరకు వెళితే, వాడు నెమ్మదిగా నడుచుకుంటూ కాల్వ వైపు వెళ్తూ కనిపించాడు. గభాల్న వాడిని పొదివి పట్టుకుని సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజున ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడు మాత్రం... మా కాంతేనా నన్ను అంత ఇబ్బంది పెట్టింది అనుకుంటాను.
 
టపాసుల్లో నా వాటా కూడా...
 
దీపావళి పండుగకి, నాలుగు రోజులు ముందుగానే బాణాసంచా కొని అమ్మ మా ముగ్గురికీ సమానంగా పంచేది. పంచుతున్నంతసేపు కాంతి చాలా కామ్‌గా ఉండేవాడు. నేను, మా చిన్న తమ్ముడు అనిల్ జాగ్రత్తగా దాచుకునేవాళ్లం. మా కాంతి మాత్రం అన్నీ ముందే కాల్చేసేవాడు. ఒకసారి అలాగే వాడివన్నీ కాల్చేసుకుని, ఎవ్వరూ చూడకుండా నా వాటా బాణాసంచా ఎత్తుకుపోయి, పొలంలో గడ్డివాము దగ్గర కాల్చడం ప్రారంభించాడు. కొంతసేపటికే గడ్డివాములు కాలిపోయాయి. ‘అక్కడ ఎందుకు కాల్చావురా’ అని అడిగితే, ‘నేను అడిగితే నాకు ఇవ్వరుగా, అందుకే ఎత్తుకుపోయి కాల్చేశాను’ అన్నాడు. ఇప్పుడయితే తనే స్వయంగా కొని తీసుకువచ్చి, నన్ను కాల్చమంటాడు.
 
నా ఉత్తరం రాకపోతే...
 
ఇంటర్మీడియట్ ధార్వాడ్‌లో హాస్టల్‌లో ఉండి చదివాడు. వారానికొకసారి నా దగ్గర నుంచి ఉత్తరం అందితేనే పాఠాలు చదివేవాడు. ఎప్పుడైనా నా నుంచి లెటర్ అందడం ఆలస్యం అయితే ఇంక ఆ వారం చదువు అటకెక్కేదని వాడి స్నేహితులు చెప్పేవారు.
 
మంచి బహుమతులు...
 
మా తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లినా నా కోసం ఏదో ఒకటి తప్పకుండా తీసుకువస్తారు. నాకు ఆధ్యాత్మిక పుస్తకాలంటే చాలా ఇష్టం. ఒకసారి మా కాంతి వివేకానందుడి ఉపన్యాసాల బుక్స్ సెట్ కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. అదలా ఉంచితే, ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి చీర కొంటారు. వాళ్లు బిజీగా ఉంటే, డబ్బులిచ్చి నన్నే కొనుక్కోమంటారు. వాళ్లు బయటి ప్రపంచానికి మాత్రమే సెలబ్రిటీస్. నాకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తమ్ముళ్లే.
 
వివాహమయ్యాక...
 
మా వివాహం జరిగాక మా కాంతి నాతో మా ఇంటికి వచ్చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక సినిమాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు మా వారు. అసలు నా కంటె కూడా మా వారే మా తమ్ముళ్లని ప్రేమగా చూస్తారనిపిస్తుంది. వాళ్లు కూడా ఆయనతో చాలా స్నేహంగా ఉంటారు. అందువల్ల మా అనుబంధం ఇంకా బాగా కొనసాగుతోంది.
 
బైక్ మీదే...
 
ఇప్పటికీ చిన్న అవసరం ఉందని ఫోన్ చేస్తే చాలు క్షణాలలో వచ్చి వాలతారు. ఒకసారి నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి మా కాంతి ఎంతో టెన్షన్ పడి, బైక్ మీద బయలుదేరాడు. అప్పుడు మేం విజయవాడలో, వాడు చెన్నైలో ఉంటున్నాం. ‘ఎందుకురా అంత సాహసం చేశావు’ అని అడిగితే, ‘నీకు బాగాలేదని తెలిసింది. ఇంక ఉండలేకపోయాను. వచ్చేశాను. అంతే’ అన్నాడు. వాడికి నేను అక్కను కాదు! అమ్మను!
 
తమ్ముళ్ల గురించి చెప్పాలంటే...
 
వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. మా కాంతి బాగా సెంటిమెంటల్, ఎఫెక్షనేట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్. చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు వాళ్లకి  ప్రతి విషయంలో ఎలా సలహాలు ఇచ్చానో, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వగలుగుతున్నాను. అదే సమయంలో వాళ్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రం వాళ్లదే. అందువల్ల మా మధ్య తేడాలు రావట్లేదు.
 
రక్తపు దుస్తులతో...
 
ఒకసారి పోలీస్ డ్రెస్‌లో దెబ్బలతో, ఒంటి నిండా రక్తంతో మా ఇంటికి వచ్చాడు. అప్పటికింకా వాడికి పెళ్లి కాలేదు. వస్తూనే ‘చూడు నేను ఎలా ఉన్నానో’ అంటూ పడిపోయాడు. నాకు ఏడుపు వచ్చేసింది. మా వారు కూడా భయపడిపోయారు. ఐదు నిమిషాల తర్వాత (మొదటి సినిమా పీపుల్స్ ఎన్‌కౌంటర్) నవ్వుతూ లేచి , ‘నేను పోలీసాఫీసరైతే ఇలాగే అవుతుంది’ అన్నాడు. షూటింగ్ డ్రెస్‌లో వచ్చి నన్ను అలా భయపెట్టాడు. వాడి అల్లరి పనులు అన్నీ ఇన్నీ అని చెప్పలేను. తమ్ముడి గురించి లెక్కలేనన్ని అనుభవాలు ఉన్నాయి. మా ఇద్దరు తమ్ముళ్లూ నాకు దేవుడిచ్చిన వరం.
 
- డా. పురాణపండ వైజయంతి
 
చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లే రోజుల నుంచి అక్కతో అటాచ్‌మెంట్ ఎక్కువ. సినిమాకి వెళ్లాలంటే అక్క దగ్గర డబ్బులు తీసుకుని, వెళ్లిపోయేవాడిని. అక్క రాకపోతే స్కూల్‌కి వెళ్లేవాళ్లం కాదు. ఏది కావాలన్నా ఎక్కువగా అక్కనే అడిగేవాళ్లం. ఇప్పటికి కూడా మా బాగోగుల గురించి అక్కే ఆలోచిస్తుంది. అక్కలా కాకుండా అన్నీ అమ్మలా చూస్తుంది. మా అవసరాలేంటో చిన్నప్పటి నుంచి తనే చూసుకునేది. మా పెళ్ళిళ్లయ్యాక కూడా ప్రతి ఫంక్షన్‌కీ కలుస్తుంటాం. మేమే కాదు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అక్క. తనంటే మాకు గౌరవం, ప్రేమ.
 - శ్రీకాంత్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం