హోలీ మందిరాలు

22 Mar, 2016 23:22 IST|Sakshi
హోలీ మందిరాలు

దిక్కులకు అందని ఆనందం... ఎల్లలు దాటిన సంబరం ... కల్లలెరగని కమనీయం... ఆలయ ముంగిళ్ళలో రంగులతో తడిసి మురిసే రాధాకృష్ణుల కేళీ విన్యాసాలు ఎంత నయనానందకరం చేస్తాయో చూద్దాం.. తెలుసుకుని తరిద్దాం...

 

1. ‘మథుర’మైన ఉత్సవం...
ఉత్తరాన యమునా నదిపై వీచే చల్లని గాలులు వేణుగానమై వీనులకు విందుచేస్తుండగా ద్వారకాధీశుడి జన్మస్థలమైన మధురలో రంగుల కేళీ విన్యాసాలు మన్నూ మిన్నూ ఏకం చేస్తుంటాయి. ఎన్నో ప్రత్యేకతలు గల దేవాలయాలు ఉన్న పట్టణం మథుర. ఇక్కడ ప్రతి గృహం, భవనం నుంచి చిన్నా పెద్ద దేవాలయాలు, ఘాట్లు, షాప్‌లు.. అంతా రంగులతో వర్ణశోభితమై నల్లనయ్యను తమ హృదయలోలుడిగా కీర్తిస్తూ భజనలు చేస్తూ భక్త బృందాలు పులకించిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణుడి జన్మస్థలమైన మథురలో ఆరు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. కృష్ణుడి బాల్యం గడిచిన ‘బృందావనం’లో హోలీ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. హోలీ రోజుల్లో సందడంతా కృష్ణాలయాల్లోనే కనిపిస్తుంది.

 
ఇక్కడ గల ద్వారకాధీశ మందిరంలో కృష్ణాష్టమి, దీపావళి, హోలీ వేడుకులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.  బృందావనంలో కొలువుదీరిన రాధారమణ దేవాలయం అత్యంత ప్రాముఖ్యత గలది. ప్రధాన మూర్తులు గోస్వామి, రాధాదేవి.  జుగల్ కిశోర్ దేవాలయం అతి ప్రాచీనమైనదిగానే కాదు ఇక్కడి మురళీధరుడు అత్యంత ప్రాశస్థ్యం గల దైవంగా పూజలు అందుకుంటున్నాడు.  దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ దేవాలయం నమూనాలో ఉంటుంది రంగ్‌జీ దేవాలయం. ఇక్కడ భారీ రథయాత్ర, బ్రహ్మోత్సవాలు ప్రతి యేటా మార్చి-ఏప్రిల్‌లో జరుగుతుంటాయి.  మథుర పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ‘బర్సానా’ గ్రామం. రాధ పుట్టిన ప్రాంతంగా ఈ ఊరుకి పేరు. ఇక్కడికి స్వయంగా కృష్ణుడే వచ్చి హోలీ ఆడుతాడని అంతా భావిస్తారు. పురుషులు కృష్ణుడిగా, అమ్మాయిలు రాధగా భావించుకుంటారు. హోలి రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కర్రలను అడ్డుకుంటారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ హోలీ సరదా సరదాగా సందడి సందడిగా ఉంటుంది. సమీప కృష్ణమందిరాలలో ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి.

 

2. గుజరాత్‌లో ద్వారకాధీశుడు
గుజరాత్‌లోని గోమతి నదీ తీరాన ద్వారక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ ఆలయం పక్కనే అష్టభార్యల మందిరాలూ ఉన్నాయి. రాధాకృష్ణుల మందిరం, మిగతా దేవేరుల మందిరాలూ ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ గోమతి సంగమ్ ఘాట్ విశిష్టమైనది. ఈ ఘాట్ నుంచి 56 మెట్లు ఎక్కి పైకి వెళ్ళితే ద్వారాకాధీశుని ఆలయ స్వర్గ ద్వారం వస్తుంది. ఇక్కడ హోలీ రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు.

 
3. తూర్పు-పడమరలను కలిపిన దైవం
బెంగాల్‌లో ‘బసంత్ ఉత్సవ్’ పేరిట వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ అమ్మాయిలు అబ్బాయిలు సంతోషంగా ఈ వేడుకను జరపుకుంటారు. అయితే వీరు రంగులు చల్లుకోరు. పాటలు, నృత్యాలు, శ్లోక పఠనం.. అంతా శాంతినికేతన్ పద్ధతుల్లో వేడుక సాగుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే విద్యార్థులు కుంకుమపువ్వు రంగు దుస్తులను, సువాసనలు వెదజల్లే పువ్వుల దండలను ధరిస్తారు. సంగీత వాద్యాలను మీటుతూ, పాటలు పాడుతారు. వీళ్లు హోలీని ‘డోలా జాత్రా, డోలా పూర్ణిమ’గా ఊయలోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యమైన వీధులలో రాధాకృష్ణుల ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఆడవాళ్లు నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ల చుట్టూ తిరుగుతూ భక్తి పాటలు పాడతారు. పురుషులు రంగు నీటిని, రంగు పొడిని జల్లుకుంటారు. కుటుంబపెద్దలు కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి, ఖీర్ (పాయసం), సందేశ్, కుంకుమపువ్వు, పాలు వంటి మధుర పదార్థాలను నివేదిస్తారు. ఒడిశాలో హోలీ సందర్భంగా జగన్నాథుడి ఆలయాల్లోను, కృష్ణాలయాల్లోను ప్రత్యేక పూజలు చేస్తారు. పంజాబ్‌లో సిక్కులు హోలీని ‘హోలా మోహల్లా’ అంటారు. భారతదేశంలో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు. వ్యవసాయంలో రబీ పంటలకు ఇది సూచనప్రాయంగా ఉంటుంది. వీధులలో మంటలు వేసి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగ నింపి వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగులకొట్టడానికి పోటీపడుతుంటే అమ్మాయిలు వారిపై నీళ్లు విసురుతారు. చివరకు కుండను పగులకొట్టిన యువకుడిని ‘హోలీ రాజు’గా సత్కరిస్తారు. మహారాష్ట్రలో హోలీ పౌర్ణమికి సాయంత్రం మంటలు వెలిగించి, తినుబండారాలను, భోజనాన్ని అగ్నికి అర్పిస్తారు. ఈ సమయంలో ‘హోలీరే హోలీ పురాణచిపోలీ’ అని పాడతారు. దీంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. పంచమి రోజున రంగులతో ఆడుకుంటారు.

 
4. వెన్నెల రాత్రులలో

మణిపూర్‌లో ఆరు రోజులు హోలి పండగను జరుపుకొంటారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు రాత్రి జానపద నృత్యాలతో, పాటలతో డోలు వాయిస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగిమంటలకు ఎండుగడ్డిని, రెమ్మలను ఉపయోగిస్తారు. తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజు కృష్ణ ఆలయం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ కొచిలోనూ, కాశ్మీర్‌లోనూ ఎండాకాలానికి ప్రారంభంగా, పంటలు కోయడానికి సూచనగా హోలీ పండగను జరుపుకుంటారు. రంగుపొడిని, రంగునీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు.

 
5. గిరిజనుల కోలాహలం

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న గిరిపుత్రుల హోలీ పండగ ప్రత్యేకంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. మామిడిపూత, గింజధాన్యాల రాకతో కొత్త జీవితానికి గుర్తులుగా భావిస్తారు వీరు. అగ్ని చుట్టూ చేరి, బిగ్గరగా ఏడుస్తారు. ఆ విధంగా చెడు తమ నుంచి దూరం అవుతుందని భావిస్తారు. హోలీ పండగ తమ జీవితంలో గొప్ప ఆనందాన్ని నింపుంతుందని భావిస్తారు.

 
మన దేశంలోనే కాదు పురాణేతిహాసాలలో ప్రఖ్యాతిగాంచిన హోలికా దహనం, రాధాకృష్ణుల వసంతకేళీ కథనాలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. గడప గడపకూ చేరి మన సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ వేడుకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి మన దేశానికి విదేశీయులూ వరస కడుతున్నారు. ఎక్కడైనా చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ పండగ భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీక.

 
- నిర్మలారెడ్డి

 

 దక్షిణాన రంగుల దీవెన: హోలీ నాడు దేశమంతటా రాధాకృష్ణుల దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది, చిన్న చిన్న సమూహాలుగా చేరి పాటలు పాడి ఆనందిస్తారు. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అంత వేడుకగా ఈ పండగను జరుపుకోరు. తెలుగు రాష్ట్రాలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలలో చిన్న స్థాయిలోనే హోలీని జరుపుకుంటారు. కొన్ని చోట్ల పెద్దల పాదాలమీద గులాల్ చల్లి, వారి దీవెనలు తీసుకుంటారు. గిరిజనులు మాత్రం పున్నమి రాత్రి కామదహనం పేరుతో పెద్ద పెద్ద మంటలు వేసి, మరుసటి రోజు తమ తెగ నృత్యాలతో హోలీని సంబరంగా జరుపుకుంటారు.

 

మరిన్ని వార్తలు