హాలీవుడ్‌లోనూ మగ పెత్తనమే!

14 May, 2016 09:30 IST|Sakshi
హాలీవుడ్‌లోనూ మగ పెత్తనమే!

జెండర్
ఆడా మగా అన్న తేడా చూడడం, దాన్నిబట్టి వాళ్ళకు చెల్లించే జీతభత్యాల్లో వివక్ష చూపడం - ఈ విషయం చాలాకాలంగా చర్చనీయాంశమే. అనేక రంగాల్లో ఉన్న ఈ లింగవివక్ష సినీ రంగంలో హీరో, హీరోయిన్ల విషయంలోనూ ఉందన్న సంగతి తెలిసిందే. చిత్రం ఏమిటంటే, హాలీవుడ్‌లోనూ ఈ లింగ వివక్ష తప్పడం లేదు. పెపైచ్చు, మన లాగే అక్కడ కూడా మహిళా దర్శకులకు ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉందట! తాజాగా జార్డ్ క్లూనే, జూలియా రాబర్ట్స్ నటించిన ‘మనీ మాన్‌స్టర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ హాలీవుడ్ నటి జోడీ ఫాస్టర్ ఆ మాట చెప్పారు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ చలనచిత్రోత్సవంలో తన సినిమా ప్రీమియర్ ప్రదర్శన దగ్గర ఆమె మాట్లాడారు. ప్రాథమికంగా తామందరం నటీనటులమైనా, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి డబ్బులు చెల్లించడమనేది ఇక్కడ రివాజు అని ఆమె అన్నారు. ఈ పద్ధతిని మార్చడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. నిజానికి, సినీ పరిశ్రమలో స్త్రీ పురుషులకు సమాన పారితోషికాలు లేకపోవడంపై హాలీవుడ్ ప్రముఖురాలు జెన్నీఫర్ లారెన్స్ కొద్దికాలం క్రితం ఓ వ్యాసం రాశారు.

అప్పటి నుంచి పలువురు హాలీవుడ్ నటీమణులు ఈ అంశంపై తమ గళం విప్పారు. ‘‘ఇవాళ మునుపెన్నడూ లేనంతగా వర్గ అసమానత్వం, ఆర్థిక అసమానత్వం నెలకొన్నాయి. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద సమస్య కానుంది. దీనిపై దృష్టి సారించి, ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి’’ అని జోడీ ఫాస్టర్ వ్యాఖ్యానించారు.
 
మహిళలకు మొండిచెయ్యి!
అలాగే, హాలీవుడ్‌లో సైతం మహిళా దర్శకులకు తగినంత ప్రోత్సాహం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘‘మహిళా దర్శకులతో సినిమా తీయడం చాలా పెద్ద రిస్క్ అని చాలామంది స్టూడియో యజమానులు ఇప్పటికీ భావిస్తున్నారు’’ అని ఆమె అన్నారు. మూడో ఏటే సినీ రంగంలోకి వచ్చి, ఆ పైన ‘సెలైన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’, ‘ది ఎక్యూజ్డ్’ తదితర చిత్రాల్లో నటనకు ఆస్కార్ అవార్డులు సాధించిన 53 ఏళ్ళ జోడీ ఫాస్టర్ ‘మునుపటితో పోలిస్తే ఇప్పుడు సెట్స్‌లో ఆడవాళ్ళ సంఖ్య పెరిగింద’ని ఒప్పుకున్నారు.

అయితే, ‘ప్రధాన స్టూడియోలు ఇప్పటికీ మహిళా దర్శకుల్ని ప్రోత్సహించడం లేదు’ అన్నారు. నిజానికి, అమెరికా సినీ రంగంలో మహిళా దర్శకులు  కేవలం 9 శాతమే ఉన్నారని శాన్‌డియాగో విశ్వవిద్యాలయం జరిపిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఐరోపాలో సైతం ప్రతి 5 సినిమాల్లో ఒకటి మాత్రమే మహిళా దర్శకులు తీస్తున్నది.
 
‘ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉండడం, అలాగే ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాలు మారిపోతుండడంతో స్టూడియో యజమానులు రిస్క్ తీసుకోవడానికి సాహసించడం లేదు’ అని జోడీ ఫాస్టర్ అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే ఉండడం వల్ల ఇక్కడి మగవాళ్ళ గుంపులో తానూ భాగమైపోగలిగాననీ, ఇతర మహిళలకు మాత్రం ఇప్పటికీ సినీ రంగ ప్రవేశం, దర్శకత్వం క్లిష్టంగానే ఉన్నాయని ఆమె అన్నారు.

సినీ వ్యాపారంలో స్త్రీలను తొక్కేయాలని ఉద్దేశపూర్వకంగా కుట్ర ఏమీ జరగడం లేదనీ, అయితే పాత కాలపు అభిప్రాయాల మూసల్లోనే ఇప్పటికీ ఇరుక్కుపోవడం వల్ల ఈ లింగ వివక్ష కొనసాగుతోందనీ పేర్కొన్నారు. మొత్తం మీద, జోడీ ఫాస్టర్ మాటలు వింటుంటే - ప్రాంతం, భాష వేరన్న మాటే కానీ, మన సినీ రంగానికీ, హాలీవుడ్‌కీ తేడా లేదని అర్థమవుతోంది కదూ! మరి, ఆకాశంలో సగమైన మహిళలకు సినీరంగంలోనూ సమప్రాధాన్యం ఎప్పుడొస్తుందో!

మరిన్ని వార్తలు