హలో.. కంట్రోల్‌ రూమ్‌

10 Apr, 2020 04:03 IST|Sakshi

నాలుగ్గోడలు లేని ‘లాక్‌డౌన్‌’.. వలస కూలీలది! సొంత ఊళ్లకు మైళ్ల దూరంలో.. భాష రాక ఉక్కిరిబిక్కిరౌతున్న బతుకు శ్వాస వాళ్లది. ఆకలౌతోందని.. అనారోగ్యంగా ఉందని.. ఉండటానికి ఇంత చోటు కావాలని.. ఎవర్ని అడగాలి? ఏ భాషలో అడగాలి?! ‘కంట్రోల్‌ రూమ్‌’కి సుప్రియ రాక ముందు వరకు.. ఎర్నాకుళంలోని వలసలకూ భాష సమస్య ఉండేది. ఆమెకు ఏడు భాషలు రావడంతో.. వాళ్ల చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటోంది.

కేరళలో పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఆ పద్నాలుగు జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాలలో పద్నాలుగు ‘కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌’లను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా గత రెండు వారాలుగా  కేరళలో ఉన్న వలస కార్మికుల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఫోన్‌ చేసి ఎవరైనా ‘ఆకలౌతోంది’ అంటే ఫలానా చోట భోజనం దొరుకుతుంది వెళ్లండి’ అని చెబుతున్నాయి. ‘ఉండటానికి చోటెక్కడైనా ఉందా?’ అని అడిగితే.. ఫలానా ప్రాంతంలో షెల్టర్‌లు ఉన్నాయి వెళ్లండి’ అని అడ్రెస్‌ ఇస్తున్నాయి. ‘‘మా ఊరికి ఎప్పట్నుంచి బస్సులు తిరుగుతాయి?’ అని కొందరు అడుగుతుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఫోన్‌ చేసి, ‘కేరళలో మా వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కుని చెబుతారా?’ అని పలకని ఫోన్‌ నెంబర్‌లను ఇస్తుంటారు. కష్టంలో ఉన్న వాళ్లు ఎలాంటి ప్రశ్నలైనా వేస్తారు. కష్టం తీర్చడానికి ఉన్నవాళ్లు ఓర్పుగా సమాధానాలు ఇవ్వాలి.

సుప్రియకు ఓర్పుతో పాటు, ఏడు భాషలలో ప్రశ్నలను అర్థం చేసుకుని ఏడు భాషలలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వగల నేర్పు ఉంది. అలాగని ఆమేమీ బహుభాషా ప్రవీణురాలు, కోవిదురాలు కాదు. జీవనోపాధి కోసం స్వరాష్ట్రమైన ఒడిశా నుంచి కేరళకు వచ్చాక పరభాషలను నేర్చుకోవాలన్న ఉత్సాహంతో.. కేవలం ఉత్సాహంతో.. మలయాళం, హిందీ, బెంగాలీ, అస్సామీ, బంగ్లా భాషలను నెట్‌లో నేర్చుకున్నారు. ఒడియా ఎలాగూ మాతృభాష. ఇంటర్‌ వరకు చదువుకుంది కాబట్టి ఇంగ్లీష్‌ కూడా వచ్చు. అన్ని భాషల్లోనూ రాయలేరు కానీ.. చక్కగా మాట్లాడగలరు. అర్థం చేసుకోగలరు. అన్నీ భాషల్లోనూ ఆమెకు ఫ్రెండ్స్‌ ఉన్నారు. అదొకటి కూడా సుప్రియకు ఉపయోగపడింది.

ఎర్నాకుళం కలెక్టరేట్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ‘మైగ్రెంట్‌ లింక్‌ వర్కర్‌’గా సుప్రియకు రోజుకు 200 వరకు కాల్స్‌ వస్తుంటాయి. వాళ్ల భాషలో విని, వాళ్ల భాషలో సమాధానం చెప్పగానే వాళ్లు వ్యక్తం చేసే సంతోషానికి అవధులే ఉండటం లేదు. ‘‘కొందరైతే.. నాతో మాట్లాడుతుంటే వాళ్ల ఊళ్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అని పూడుకు పోయిన గొంతుతో కృతజ్ఞతగా అంటుంటారు. వాళ్లు అలా అన్నప్పుడు.. తాత్కాలికంగానే అయినా తగిన ఉద్యోగంలోకే వచ్చానని అనిపిస్తుంటుంది నాకు’’ అంటారు సుప్రియ. వలస కూలీలను కేరళ ప్రభుత్వం ‘వలస అతిథులు’ అంటుం ది. సుప్రియ కూడా అతిథులను ఆహ్వానించినట్లే వాళ్ల ఫోన్‌ కాల్స్‌ని రిసీవ్‌ చేసుకుంటున్నారు. సుప్రియతోపాటు ఆ సెంటర్‌లో మరో 11 మంది ‘మైగ్రెంట్‌ లింక్‌ వర్కర్‌’లు పని చేస్తున్నారు.

సుప్రియ ‘రోష్ని’లో వాలంటీర్‌ కూడా. వలస కార్మికుల పిల్లలకు విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకమది. ఇంకా.. మలయిదోంతురుత్‌లోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు సుప్రియ. ‘సర్వశిక్ష అభయాన్‌ ప్రాజెక్ట్‌’ కింద ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉండటం ఎర్నాకుళంలోనే.. పుక్కట్టుపాడి లో. సుప్రియ పూర్తి పేరు సుప్రియా దేవ్‌నాథ్‌. ఐదేళ్ల క్రితం భర్తతోపాటు కేరళ వచ్చేశారు. ఆయన పేరు ప్రశాంతకుమార్‌ సామల్‌. పెరంబవూర్‌లోని ప్లయ్‌ ఉడ్‌ కంపెనీలో ఉద్యోగం. కూతురు శుభస్మిత.. తల్లి టీచర్‌గా ఉన్న బడిలోనే ప్రి–నర్సరీలో ఉంది. సుప్రియ తన చదువును ఇంటర్‌తోనే ఆపేయాలని అనుకోవడం లేదు. పెరంబువూర్‌ కాలేజ్‌లో బి.ఎ. హిందీలో చేరబోతున్నారు. అందుకు అవసరమైన సర్టిఫికెట్‌లు కొన్ని ఒడిశాలోనే ఉండిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో వాటిని తెచ్చుకోవాలని అనుకుంటుండగానే.. ఇదిగో, ఈ లాక్‌డౌన్‌! ‘‘ఇంట్లోనే ఉండిపోవడం కష్టమే. అసలు ఇల్లే లేకపోవడం ఇంకా పెద్ద కష్టం అంటారు’’ సుప్రియా.. ‘వలస అతిథుల్ని’ గుర్తుకు తెచ్చుకుని. l

మరిన్ని వార్తలు