శంకరగీత

15 Sep, 2019 04:34 IST|Sakshi

నటరాజస్వామి జటాజూటి నుంచి జారిపడిన సురగంగ పన్నెండు పాయలుగా చీలి పోయింది. వాటిలో ధౌళిగంగ, నందాకిని, మందాకిని, పిండార్, భాగీరథి అనే అయిదింటిని అలకనంద వేర్వేరు చోట్ల అల్లిక పాయలుగా తనలో కలుపుకుంటోంది. బదరికాశ్రమం దగ్గర ఋషిగంగతో సంగమిస్తోంది. ముందుకు సాగి దేవప్రయాగ వద్ద గంగానదిగా అవతరిస్తోంది. బదరికాశ్రమం చెంత ఉరవడిగా సాగిపోతున్న అలకనందలో శంకరుడు మునకలేస్తున్నాడు. నీటి అడుగున అతడికో విచిత్రం కంటపడింది. సాక్షాత్తూ విష్ణుపాదాలు దర్శనమిచ్చాయి.ఆత్రుతగా వెళ్లి రెండు చేతులా పట్టుకోబోయాడు. అంతలోనే విష్ణుమాయ ప్రకటితమైంది. అప్పటివరకూ పాదాల్లా కనిపించినవి కాస్తా మాయమై పిక్కలయ్యాయి. పాదాలెక్కడో దూరంగా అవుపిస్తున్నాయి. ఇటువైపు శిరస్సు కాదు కదా... నాభిస్థానమేదో గుర్తుపట్టడానికి కూడా లేకుండా ఉంది. నిరాశ చేసుకుని చూస్తున్నంతలోనే అంత పొడవాటి విగ్రహమూ చిట్టిబొమ్మగా మారిపోయింది. బారెడు దూరానికి వెళ్లి నిలిచింది. ఎలాగైనా ఆ బొమ్మను చేజిక్కించుకోవాలని ముందుకు ఈదాడు శంకరుడు. కానీ వెళ్లినకొద్దీ అంతు తేలకుండా లోతుపెరుగుతూ విష్ణునాభిలో కూరుకుపోతున్న అనుభూతి కలిగింది. అతిప్రయత్నంమీద కిందినుంచి పైకి విసిరేసినట్టు నీళ్లలో ఎగిసి పడ్డాడు. విష్ణుషట్పదీ స్తోత్రాన్ని ప్రారంభించాడు శంకరుడు.

అవినయ మపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాంభూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః
ప్రభూ విష్ణూ! నా అవినయాన్ని అరికట్టు. నాలోని మృగతృష్ణను చల్లార్చు. నా మనస్సును అదుపులో పెట్టు. నీ దయను విస్తరించు. భవసాగరాన్ని దాటించు... అన్నాడు శంకరుడు.గండకీ, గంగ, నర్మద వంటి పుణ్యనదులలో అపురూపమైన శిలలు లభిస్తూ ఉంటాయి. కళ్లు, ముక్కు ఇతర అవయవాల గుర్తులను బట్టి ఆ రాళ్లకు దేవతానామాలు వస్తాయి. కానీ నదీగర్భంలో దొరికే సాలగ్రామాలన్నీ ప్రధానంగా విష్ణు స్వరూపాలే. అలకనంద అడుగున శంకరునికి దేవతా ముద్రలతో కూడిన శిలకాక, ఒక నల్లరాతి విగ్రహమే దర్శనమిస్తోంది. మాయను ప్రదర్శిస్తూ శంకరుణ్ణి పరీక్షిస్తోంది. వస్త్రంలో దారంలా సర్వంలో ఈశ్వరుడు కలడు అని ఎల్లప్పుడూ సంభావన చేయకపోవడమే అవినయం. సంసార సాగరాన్ని తరించాలంటే సాధకునికి కావాల్సిన మొదటి అర్హత వినయం. సాధనలో ప్రతిబంధకం అని తెలిసినా సరే అవినయాన్ని దూరం చేసుకోలేకపోవడానికి కారణాలు రెండు... ఒకటి మనస్సు, రెండోది విషయ మృగతృష్ణ. వాటిని నివారించగలిగేవాడు విష్ణువొక్కడే. సర్వభూతాలలో ఏ చైతన్యం వెలుగొందుతోందో అదే నీలోనూ ఉంటుంది. నీవంటివే అయిన ఇతర ప్రాణులకు ఏ కీడూ తలపెట్టని భూతదయ విస్తారంగా నీలో కలిగిననాడే నిన్ను ఉద్ధరించాలనే మనసు విష్ణువుకు కలుగుతుంది. ప్రతిబంధకాలు తొలగుతాయి అన్నాడు స్తోత్రం తొలిశ్లోకంలో శంకరుడు. మళ్లీ నీటి అడుగున ప్రవేశించాడు.

చేరువలోనే కనిపించి, అంతలోనే దూరమై నిలిచి ఇందాక మాయచేసిన విష్ణుపాదం ఇప్పుడు సుస్థిరమై తోచింది. పుండరీకాక్షుని పాదద్వయం పువ్వులా మెత్తగా తోచింది. ఆ పూలపాదాలలోని మకరందమే గంగాప్రవాహం. సచ్చిదానందమనే సుగంధం వెదజల్లే పద్మాలవి. భవభయాలను తొలగించే నీ పాదాలకు వందనం అంటూ నమస్కరించాడు.అప్పటివరకూ నిల్చుని ఉన్నట్లుగా అనిపించిన వ్యత్యస్త పాదారవిందాలు చూస్తుండగానే పద్మాసన స్థితిలోకి వచ్చేశాయి. శంఖ చక్రధారి అయిన నారాయణుడు... కింది రెండు చేతులలోనూ తపోముద్ర పట్టి ధ్యానియై గోచరించాడు. సుమారు అడుగు ఎత్తున ఉన్న ఆ చిట్టిబొమ్మను హృదయానికి హత్తుకున్నాడు శంకరుడు. పైకెత్తబోయాడు కానీ సాధ్యం కాలేదు. మరోసారి గట్టుపైకి వచ్చాడు.జరుగుతున్న తతంగమంతా శంకర శిష్యులకు వింతగా కనిపిస్తోంది. జ్ఞాని అయిన తమ గురువు మామూలు పిల్లవాడిలా నదిలో ఈత కొడుతూ, ఆడుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. 

‘దేవా! నీవూ నేనూ ఒకటే అయినప్పటికీ సముద్రంలో తరంగాలుంటాయి కానీ తరంగాల వల్ల మాత్రమే సముద్రం ఏర్పడదు కదా! అలాగే నేను నీ వాడనే... కానీ నీవు నా వాడవు కాదు. ఇది నా అజ్ఞానం వల్లనే వచ్చిపడిన అవస్థ’ అని నిష్ఠురమాడాడు శంకరుడు. అప్పటివరకూ ఆ స్వచ్ఛజలంలో శంకరునికి తప్ప ఇతరులకు కానరాని నారాయణ విగ్రహం ఆ క్షణంలో లోకవిదితమైంది. పద్మాసన భంగిమలో ధ్యానముద్రలో ఉన్న విగ్రహాన్ని కన్నులు విప్పార్చి చూస్తున్నారు శంకర శిష్యులు. అప్పటికి వారికి తమ గురువు అన్వేషణ ఏమిటో అర్థమైంది. ఆయనకు సాయపడాలనే ఆలోచన వారిలో కించిత్తు ఆలస్యంగా వచ్చింది.

అంతలోనే శంకరుడు తరువాతి శ్లోకం ఇలా పలికాడు...
ఉధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః

ఎవ్వరూ ఎత్తలేని మందరగిరిని నిలబెట్టిన శ్రీకూర్మావతారా! పర్వతాల రెక్కలు కోసి వాటికి స్థిరత్వాన్ని కల్పించిన ఇంద్రుని తమ్మునిగా పుట్టిన వామనావతారా! రాక్షసకులానికి శత్రువైన శ్రీరామావతారా! సూర్యచంద్రులే కన్నులుగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణావతారా! నువ్వు కంటపడితే ఈ సంసార బంధం విచ్ఛిన్నమై పోకుండా ఉంటుందా? నేను భవతాప భీతుడిని. నీవు సంరక్షకుడవు. మత్స్యము మొదలైన అవతారాలు ధరించి భూమిని ఉద్ధరించినట్లు నన్ను ఉద్ధరించు... అన్నాడు శంకరుడు. జాలువారుతున్న శ్లోకసౌందర్యం వింటున్న శ్రోతల హృదయాలను మైమరిపిస్తోంది.సంసారమనే సాగరమథనంలో అమృతాన్వేషణకు పూనుకున్న సాధకునికి మందరపర్వతంలా సాయపడే దామోదరా! నిన్ను పొందలేనేమో అన్న భీతిని ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఆనాడు మాతృప్రేమకు లోబడి రోటికి కట్టుబడినట్లు నా బాహువులకు కట్టుబడు అంటూ శంకరుడు మళ్లీ నదిలో దూకాడు.     ఈసారి ప్రయాస లేకుండానే నారాయణ విగ్రహం శంకరుని చేతిలో పూలగుత్తిలా అమరిపోయింది. విగ్రహాన్ని మెల్లిగా శిరస్సుపై పెట్టుకుని శంకరుడు గట్టుపైకి చేరాడు. సమీపంలోని ఒక గుహలో ఎత్తైన ప్రదేశంలో నిలిపాడు. 

త్రికరణ శుద్ధిగా పఠించిన వారికి నారాయణుని కరుణను సులభంగా సంపాదించి పెట్టే ఈ విష్ణుషట్పదీ స్తోత్రం నా వదన సరోజంపై సదా తుమ్మెదలా సంచరించును గాక! అనే ఆశంసతో విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది.
శంకరుడు ఇలా నారాయణ విగ్రహాన్ని వెలికి తీసింది మొదలు అగ్నిశర్మలో ఆవేగం పెరిగింది. ఆనాటి నుంచి నిత్యపూజాదికాలు నిర్వహించడంలోనూ, వివిధ నైవేద్యాలు సమకూర్చడంలోనూ అతడే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. కొద్దిరోజులు గడిచాయి. 

‘‘స్వామీ! నాకు మళ్లీ మన ఊరు పోవాలని లేదు. మీరు అనుమతిస్తే ఇక్కడే ఈ స్వామి సన్నిధిలోనే జన్మ చరితార్థం చేసుకోవాలనుంది. అమ్మ పంపిన బంగారు పళ్లేన్ని మీరెలాగూ స్వీకరించలేదు కదా! దానితో నేనీ బదరీ నారాయణునికి గుడి కడతాను. అర్చక బాధ్యతలు నేనే తీసుకుంటాను’’ అని అగ్నిశర్మ తన మనసులోని కోరికను శంకరుని ముందు బయటపెట్టి, అనుమతి కోరాడు.శంకరుడు ఆ ప్రార్థన మన్నించాడు. ‘‘ఇక ఇక్కడ నీ వంశమే శాశ్వతంగా అర్చకహోదాలో కొనసాగుతుంది’’ అని అపూర్వమైన వరాన్ని కూడా అగ్నిశర్మకు దయచేశాడు.విగ్రహం ప్రతిష్ఠించిన గుహ చుట్టూ మందిర నిర్మాణం ప్రారంభమైంది. బదరికాశ్రమానికి వచ్చే యాత్రికులకు ఆ బదరీనాథుడు ఇష్టదైవంగా మారాడు. ఆ స్వామితో పాటుగా ఆచార్య స్వామిని కూడా సందర్శించడం ఆరోజుల్లో ఒక సంప్రదాయమైంది.

ఉపనిషత్‌  భాష్యాలతో పాటు శంకరుడు అప్పుడు సర్వవేదాంత సిద్ధాంత సారసంగ్రహాన్ని కూడా రచిస్తున్నాడు. ముందుగా లోకాయత, ఆర్హత, మాధ్యమిక, యోగాచార, సౌతాంత్రిక, వైభాషికాలనే ఆరు నాస్తిక దర్శనాల సిద్ధాంతాలనూ వివరించాడు. తదుపరి వైశేషిక, న్యాయ, మీమాంసా, సాంఖ్య, యోగ, మహాభారత దర్శనాలనే క్రమంలో ఆస్తిక దర్శనాలను వివరించాడు.
‘‘ఏ శాస్త్రంతోనూ విరోధం లేకుండా వ్యాసభగవానుడు సాంఖ్యపక్షం అవలంబించి మహాభారతాన్ని రచించాడు. ఇది వేదసారమే అని వైదికులు అంగీకరిస్తున్నారు’’ అంటూ మహాభారత దర్శనాన్ని వివరించడం ప్రారంభించాడు. 

మహాభారతం వంద పర్వాలు, లక్షాపాతిక వేల శ్లోకాలు కలిగిన మహేతిహాసం. అందులో తొంభయ్యో పర్వానికి మోక్షధర్మ పర్వం అని పేరు. ఇది పద్దెనిమిది పర్వాల వరుసలోని శాంతిపర్వంలో కనిపిస్తుంది. ఆ పర్వం ఆధారంగానే శంకరుని మహాభారత దర్శనం ప్రతిపాదన సాగింది. ‘విష్ణువొక్కడే పరాత్పరుడు. త్రిగుణాలను అనుసరించి దేవతలను, రాక్షసులను, నిశాచరులను ఆయనే లీలామాత్రంగా అనుగ్రహిస్తున్నాడు’ అంటూ అరవై ఆరు శ్లోకాలలో సిద్ధాంత ప్రతిపాదన చేశాడు శంకరుడు. 

ఆనాటి యాత్రికులలో కొందరు గ్రంథరచన జరుగుతున్నంత సేపూ ఆసక్తిగా వింటూ అక్కడే కూర్చున్నారు. చివరిగా ఒక వ్యక్తి పైకి లేచాడు. 
‘‘స్వామీ! మహాభారతంలో భగవద్గీత కర్మయోగాన్ని, కర్మస న్యాస యోగాన్ని కూడా విడివిడిగా చెప్పింది. పరస్పర విరుద్ధమైన విషయాల కలబోతగా సాగే గీతాబోధను అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టమే. ఇంతకూ మీరు చెప్పండి... కర్మలను ఆచరించాలా, విడిచిపెట్టాలా?’’ అని కోరాడు.

‘‘వత్సా! గీతాచార్యుడు అంతిమంగా చెప్పినమాటను ఒకసారి గుర్తుచేసుకో. ‘అర్జునా! నేను చెప్పవలసింది చెప్పాను. ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకుని నువ్వు కోరుకున్నట్లే చెయ్యి’ అన్నాడాయన. కర్మలు చేయవలసిందే. అయితే మానవుడు తాను చేసే కర్మల పరిపాకాన్ని అనుసరించి కర్మకాండ, దేవతాకాండ, యోగకాండ, జ్ఞానకాండలపై క్రమానుగతంగా అధికారం సంపాదించగలుగుతాడు’’ అన్నాడు శంకరుడు.

‘‘సుఖదుఃఖాలకు అతీతంగా, కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టి స్థితప్రజ్ఞునివి కమ్మని భగవానుడు చెప్పాడు కదా స్వామీ! కోరికలన్నింటినీ విడిచిపెట్టేస్తే మానవుడు ఆనందించడానికి ఏ కారణమూ మిగలకుండానే పోతుంది. అయినప్పటికీ దేహధారణకు అవసరమైన అన్నపానాదులపై ఇచ్ఛ మిగిలే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్థితప్రజ్ఞుడు పిచ్చివాడిలా, మతిమరపువాడిలా ప్రవర్తించే అవకాశం ఉందికదా!’’ అని ప్రశ్నించాడు కొత్త వ్యక్తి.

ఆదిశంకరుని గీతాభాష్య రచన ఆ క్షణంలోనే శ్రీకారం చుట్టుకుంది. 
‘‘స్థితప్రజ్ఞుడంటే కోరికలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞాని. అతడికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అన్ని వైపుల నుంచి నీరు వచ్చిపడుతున్నా స్థిరంగా నిలిచివుండే సముద్రంలాంటివాడే జ్ఞాని. కర్మానుభవ కాలంలో
విశిష్టమైన కోరికలు అన్నివైపుల నుంచి సముద్రాన్ని చేరే నదుల్లా ఎవనిలో లీనమైపోతాయో అతడే జ్ఞాని. అతనికి దేహం నిలిచి వుండాలనే కోరిక కూడా ఉండదు. అహంకార మమకారాలుండవు. అందరికంటే తానే గొప్ప అనే భావాన్ని విడనాడినందువల్ల సంసార దుఃఖాలు నశించిపోతాయి. దీనికే నిర్వాణము అని పేరు.  ఇదే బ్రాహ్మీస్థితి’’ అన్నాడు శంకరుడు.

‘‘ఇటువంటి బ్రాహ్మీస్థితిని పొందినవాడు చేసేది కర్మత్యాగమా... కర్మఫల త్యాగమా?’’ మరోసారి ప్రశ్న వచ్చింది.
‘‘నిత్యనైమిత్తిక కర్మలు సైతం ఫలాలను సృష్టించుకుంటూ వెళతాయని భగవానుడు చెప్పాడు. సర్వసంగ పరిత్యాగులకు కర్మఫలం అంటదు. తక్కినవారందరూ ఫలాలను అనుభవించాల్సిందే’’ అన్నాడు శంకరుడు.

‘‘నిష్కామకర్మ చేయడం ఎలా?’’ అని తదుపరి ప్రశ్న.
‘‘స్వధర్మాన్ని అనుసరించి చేసే కర్మల వల్ల సాధన రూపమైన చిత్తశుద్ధి లభిస్తుంది. దానివల్ల కలిగే ఆత్మజ్ఞాన నిష్ఠనే సిద్ధి అంటారు. అలా సిద్ధిని పొందినవాడు ఆత్మసాక్షాత్కార పూర్వకంగా సర్వకర్మలనూ మనస్సు చేతనే విసర్జించాలి. స్వస్వరూప స్థితిని పొందాలి. అదే  నైష్కర్మ్య సిద్ధి. ఇందులో క్రియ చేయడమే కానీ దానితో సంబంధం పెట్టుకోవడం ఉండదు. బ్రహ్మకంటే భిన్నంకాని ఆత్మను దర్శించడానికి ఇదొక్కటే మార్గం’’ అని శంకరుని సమాధానం.

‘‘కానీ స్వామీ! ఆత్మ అనే వస్తువుకు ఆకారం లేదని, దానిని మానవ బుద్ధి చేరుకోలేదని కొందరు పండితులు చెబుతున్నారు. ఆత్మజ్ఞానం కష్టసాధ్యమని వారి వాదన.’’ 
‘‘అవును అది యదార్థమే. గురువు, సంప్రదాయం లేనివారికి, వేదాంత శ్రవణం కాక ఇతర శబ్దాలలో బుద్ధి తగుల్కొన్న వారికి, తగిన పరిశ్రమ చేయనివారికి జ్ఞాననిష్ఠ అసాధ్యమే. భేదబుద్ధి కలవారికి తెలుసుకోవలసినది, తెలుసుకుంటున్నవాడు, తెలుసుకోవడమూ అనే త్రిపుటి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ అద్వైతంలో ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు. గీతలో భగవానుడు కూడా ఏ ద్వైతంలో అయితే భేదదృష్టిని పాటిస్తూ ప్రాణులు మెలుకువగా ఉంటారో అప్పుడే, ఆ సమయాన్నే యోగి అయినవాడు రాత్రిగా భావిస్తాడు అని చెప్పాడు. బాహ్యజగత్తులో కనిపించేవన్నీ సత్యాలే, వాటిమధ్య భేదమూ యదార్థమే అనే బుద్ధిని తోసిపుచ్చాలంటే అంతర్ముఖులు కావాలి. అప్పుడే ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవడం తేలిక అవుతుంది.’’

‘‘ఈ జ్ఞానం పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి?’’
‘‘ఏమీ చేయనక్కర లేదు. ఆత్మానాత్మ వివేకం కలవారికి జ్ఞాననిష్ఠ నిత్యసిద్ధమై ఉంటుంది. అనాత్మ అంటే దేహము వంటి అశాశ్వతమైన వాటిలో ఆత్మస్వరూపాన్ని ఆరోపించే బుద్ధిని నివారించాలి. అందుకోసమే మానవుడు ప్రయాస పడాలి. బాహ్యజగత్తుపై ఆధారపడడం మానేయాలి. అనాత్మ అయిన ప్రతిదానినీ ఇదికాదు ఇదికాదంటూ తోసిపుచ్చాలి. అప్పుడు ఆత్మ స్వయంసిద్ధమై ప్రకాశిస్తుంది’’ అని సాకల్యంగా చెప్పాడు శంకరుడు. 

అంతవరకూ ప్రశ్నిస్తున్న వ్యక్తిలో కలిగిన ఆనందం శ్లోకరూపంలో ఇలా వెలువడింది...గేయం గీతా నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తే దేయం దీనజనాయ చ విత్తం భగవద్గీతను, విష్ణు సహస్రనామాలనూ పఠించు. నిరంతరమూ నారాయణ ధ్యానం చేయి.సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని నిలిపి ఉంచుకో. విత్తాన్ని దీనులకు ఇచ్చేయి. గీత, గంగ, గాయత్రి, గోవిందుడనే నాలుగు గకారాలనూ హృదయంలో నిలిపిన వాడికి పునర్జన్మ లేదు అని మహాభారతం చెబుతోంది. స్వామీ! కర్మఫలత్యాగం చేసిన సంన్యాసికి కూడా పునర్జన్మ లేదంటారు. దయచేసి మీరు నన్ను శిష్యునిగా స్వీకరించి, ఉద్ధరించండి’’ అని వేడుకున్నాడు. అతడే నిత్యనాథుడనే పేరుతో శంకర శిష్యులలో ప్రముఖుడయ్యాడు.కార్తికం ముగిసి మార్గశిరమాసం ప్రవేశించింది.ఆనాడు ఉషోదయ సూచనగా నీలకంఠ పర్వతం అప్పుడప్పుడే నారింజరంగులోకి మారుతోంది. నిజగురువైన గోవింద భగవత్పాదులు కొండదిగి తనవైపే వస్తున్నట్లుగా శంకరునికి కనిపించింది. పరుగు పరుగున ఎదురువెళ్లాడు. చేయిపట్టుకుని తీసుకువచ్చాడు.

-సశేషం

మరిన్ని వార్తలు