స్వరణీయం

18 Dec, 2019 00:29 IST|Sakshi
సత్యం గారి కుమార్తె ఉండవల్లి నాగలక్ష్మి, కుమారుడు మాధవపెద్ది వెంకట నారాయణ మూర్తి, ఇన్సెట్లో మాధవపెద్ది సత్యం (నేడు వర్ధంతి)

సినీ పరివారం

‘భలే చాన్సులే భలే చాన్సులే’ అంటూ ఇల్లరికంలో ఉన్న మజాను తన గొంతుతో మన కళ్ల ముందుంచినా... ‘సరదా సరదా సిగరెట్టు’ అని పాడుతూ ధూమపానం అనర్థాల గురించి హెచ్చరించినా... ‘భళి భళి భళి భళి’ దేవా అంటూ తత్త్వాన్ని బోధించినా...‘అయయో జేబులో డబ్బులు పోయెనే’ అంటూ పేకాట గురించి సరదాగా వాపోయినా...‘వివాహ భోజనంబు’ పాట చెవిన పడ్డా, మాధవపెద్ది సత్యం స్వరం మన చెవులలో ఇంపుగా వినిపిస్తుంది. నేడు మాధవపెద్ది వర్థంతి. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు ఆయన పిల్లలు నాగలక్ష్మి, వెంకటనారాయణ మూర్తి.

నాగలక్ష్మి: నాన్నగారు ఆ రోజుల్లో వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్నా, చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడేవారు. ఆర్భాటాలు, విలాసాలు ఆయనకు నచ్చేవి కాదు. మమ్మల్ని కూడా అతి సామాన్యుల్లాగే పెంచారు. జీవితంలో అన్నీ తెలుసుకోవాలని చెప్పేవారు. కష్టపడితే ఫలితం వస్తుందన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన వ్యక్తి మా నాన్న. 

మూర్తి: నాన్నగారు బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టారు. మా అమ్మ ప్రభావతి. వాళ్లది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. నాన్నగారికి పేకాట అంటే బాగా ఇష్టం. అలాగని అది డబ్బులకు ఆడే వ్యసనం కాదు. ఇంట్లో అందరం కలిసి సరదాగా ఆడుకోవటానికి ఇష్టపడేవారు.  చెన్నై టి–నగర్‌లో మా పక్కింట్లోనే పెద్దనాన్న గోఖలే గారి ఇల్లు. పెద్దనాన్న, దొడ్డమ్మ అందరూ కలిసి ఆడుకునేవారు. పేకాట ఉంటే నాన్నకు ఇంకేమీ అక్కర్లేదు

నాగలక్ష్మి: నాన్నకి ‘నేను ఏదో సాధించాను’ అని కించిత్తు కూడా గర్వం ఉండేది కాదు. మన కర్తవ్యం మనం నిర్వహించాం అనుకోవడం ఆయన సిద్ధాంతం. తనకు వచ్చిన గౌరవ పురస్కారాలను ఎప్పుడూ ప్రదర్శించుకోలేదు. కారు కూడా ఎక్కేవారు కాదు. మాయాబజార్‌లో నాన్న పాడిన ‘వివాహ భోజనంబు’ పాట ‘సాంగ్‌ ఆఫ్‌ ద మిలీనియమ్‌’గా ఎంపికయినా ఏ మాత్రం గర్వించలేదు. ఆయన సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ విజిటింగ్‌ కార్డు కూడా ఉండేది కాదు.

మూర్తి: ఆ రోజుల్లో సినిమా వాళ్లని చూడటం ఒక క్రేజ్‌. అభిమానులు బస్సులు వేసుకుని మరీ చెన్నై వచ్చేవారు. ఇలా కొందరు నాన్నగారిని చూడటానికి వచ్చే సమయానికి, నాన్న మా తోటలోని గడ్డిని తీస్తున్నారు. వారిని చూసి ఆయన మారుమాట్లాడకుండా ఇంటి వెనుకవైపుకు వెళ్లి చేతులు కడుక్కుని, ముందువైపునుంచి వచ్చారు. వారు ఆశ్చర్యపోతుంటే ‘ఇంటిపని చేసుకోవడం నాకు అలవాటు!’ అన్నారు సింపుల్‌గా. ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేసేవారు. 

నాగలక్ష్మి: ‘అపస్వరమే తెలియని గాయకుడు మా బాబాయ్‌’ అని నాన్న గురించి ఎస్‌. పి. బాలు అన్నారు. నాన్న సంగీతం పెద్దగా నేర్చుకోలేదు. తన పెదనాన్న వెంకటరామయ్యగారి దగ్గర పద్యాలతో ప్రభావితులయ్యారు. పాట రికార్డింగ్‌ పూర్తయ్యి ఇంటికి రాగానే ఒక బైండ్‌ పుస్తకం తీసుకుని, అందులో ఆ రోజు పాడిన పాట సాహిత్యం, అలాగే ఆ పాట ఏ శృతిలో, ఏయే గాయకులతో, ఎవరి సంగీత దర్శకత్వంలో, ఏ నటుడికి పాడారు.. వంటి విషయాలన్నీ రాసుకునేవారు. ఆ తరవాతే భోజన ం. 

మూర్తి: నాన్నగారు నాటకాలలో కూడా నటించేవారు. నాటకం పూర్తయ్యాక, పాటలు పాడేవారు. అలాగే రైలులో సెకండ్‌ క్లాసులోనే ప్రయాణించేవారు. గోంగూర పులుసు, వెన్నపూస, ఉల్లిపాయ కలిపి తినేవారు. పండుగకి గారెలు కావాలనేవారు. తెలుగు వంటలంటేనే ఇష్టం. 

నాగలక్ష్మి: అందరం కలిసి కూర్చుని భోజనం చేయటానికి ఇష్టపడేవారు. ఇంట్లో ఉన్నప్పుడు నలుగురం పీటల మీద కూర్చుని తినేవాళ్లం. కుండలో నీళ్లు మాత్రమే ఇష్టపడేవారు. 

మూర్తి: మా అక్కని అస్సలు కొట్టేవారు కాదు. నన్ను మాత్రం రెండుసార్లు కొట్టారు. ఒకసారి నేను సర్కస్‌కి వెళ్లొచ్చి, తాళ్లు పట్టుకుని వేలాడి కిందపడ్డాను. గడ్డం కింద దెబ్బ తగిలింది. నా అల్లరి భరించలేక గట్టిగా ఒక్కదెబ్బ వేశారు. మరోసారి షాపింగు కోసం పాండీ బజార్‌కి వెళ్దామన్నారు. నేను బీచ్‌కి వెళ్దామని ఏడ్చాను. అంతే! నా వీపు పగిలింది (నవ్వు)

నాగలక్ష్మి: నాన్నకు క్రమశిక్షణ అంటే ప్రాణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాన్న చెప్పిన మాటలను నేటì కీ ఆచరిస్తూనే ఉన్నాను. 

మూర్తి: ఘంటసాలగారిని మాస్టారూ అని పిలిచేవారు. ఆయన నాన్నను ఉరై అనేవారు. అలాగే నాన్నగారు ఎస్వీ రంగారావుగారి కోసమే పుట్టారేమో అని అందరూ అనుకునేవారు. ఒకసారి నాన్న, నేను ఎస్వీ రంగారావుగారి ఇంటికి వెళ్లాం. కబురు పంపగానే, ఆయన వెంటనే మమ్మల్ని పైకి రప్పించారు. నన్ను చూడగానే‘ఉరై డింభకా ఇలా కూర్చోరా’ అని ప్రేమగా ఒళ్లో కూర్చోపెట్టుకున్నారు. నాన్నగారంటే ఆయనకు ఎంతో గౌరవం. నాన్న జీవితమంతా సంబరంగా, అర్థవంతంగా గడిచిపోయింది. ఏ ప్రభుత్వమూ నాన్నగారికి అవార్డులు ఇవ్వకపోయినా బాధపడలేదు. 2006లో నేను అందుకున్న కలైమామణి పురస్కారాన్ని నాన్నకి అంకితం చేశాను.  – సంభాషణ: వైజయంతి పురాణపండ, ఫొటోలు: అనిల్‌ కుమార్‌ మోర్ల

మూర్తి: నా పేరు వెంకటనారాయణమూర్తి. ఎంవిఎన్‌మూర్తి అంటారు. ముద్దుగా బాజీ అని పిలుస్తారు. నేను బి.ఎస్సీ కెమిస్ట్రీ చదివాను. ఎయిర్‌లైన్స్‌ కోర్సు చేశాను. జర్మనీ నేర్చుకున్నాను. వెంపటి చినసత్యంగారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. పాతికేళ్లుగా శివ ఫౌండేషన్‌ పేరుతో డాన్స్‌ స్కూల్‌ నడుపుతున్నాను. 1999లో అమ్మ, 2000లో నాన్న మరణించారు. అమ్మానాన్నల పేరు మీద హృదయాంజలి సంగీత విభావరిని 18 మంది గాయనీ గాయకులతో పాడించాను. బాలమురళి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రస్తుతం వారి పేరు మీద ‘మాధవపెద్ది సత్యం – మాధవపెద్ది ప్రభావతి’ పురస్కారాలు అందిస్తున్నాను. త్వరలో నాన్నగారి పుస్తకం ఆవిష్కరించాలనుకుంటున్నాను.

నాగలక్ష్మి: బి.ఏ. హిస్టరీ చదివాను. పెళ్లయ్యాక బి.ఈడి చేశాను. మావారు ఉండవల్లి రవికుమార్‌ జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో పనిచేశారు. వైజాగ్‌లో ఒక కాన్వెంట్‌లో కాలక్షేపానికి పనిచేశాను. నాన్నకి నేనంటే కొండంత ప్రేమ. కొండ మీద కోతిని అడిగినా తెచ్చేవారు. నో అనే వారు కాదు. కంచంలో అన్నీ ఆయనే వడ్డించి అన్నానికి పిలిచేవారు. నాన్నగారి చివరి రోజులలో హాస్పిటల్‌కి రోజూ వెళ్లి కూర్చునేదాన్ని. అలాగైనా ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నాను. అక్కడ కూడా ఆయన నాతో ఏమీ చేయించుకోలేదు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు