కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ...

2 Oct, 2019 05:09 IST|Sakshi

పద్మవిద్యాధురంధరుడైన గుర్రం జాషువా ‘బాపూజీ’ అనే ఖండ కావ్యంలో ఎంతో ఆర్తితో బాపూ హత్యపై యావత్ప్రపంచం చెందిన దిగ్భ్రాంతిని మన కళ్లకు కట్టారు.‘కలమున్‌ కైతలు మూగవోయినవి, శోకధ్వాంతముప్పొంగి కన్నులువోయెన్‌ సకల ప్రపంచమునకున్, దోడ్తో భయభ్రాంతమై బలహీనంబయి తూలె భారతము, విశ్వవ్యాపి బాపూజి, గుండెలలోనుండి పవిత్ర రక్తము చితాగ్నిన్‌ గ్రాగి ఘోషింపగన్‌’

తెలుగు సాహిత్యకారుల్లో గాంధీ అధికులకు ప్రియమైన వ్యక్తి. కొందరికి జాతిపిత. కొందరికి భగవంతుడి అపరావతారం. కొందరికి నాయకుడు. కొందరికి ఈనాటికీ అనుసరించవలసిన మార్గదర్శకుడు. ఇటీవల కొందరికి ప్రశ్నించవలసిన, కొండొకచో తిట్టవలసిన సామాన్యుడు. స్థూలదృష్టితో తెలుగు సాహిత్యంలో గాంధీ చిత్రణను చూస్తే మొట్టమొదట గుర్తుకొచ్చేది ‘కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ కోమటైతేనేమి’ అన్న బవసరావు అప్పారావు గీతమే. ఈ గేయంలో గాంధీని వర్ణించిన తీరు కమనీయంగా, గాంధీని కళ్లెదుట చూస్తున్నట్లుగా ఉంటుంది.

‘వెన్నపూసా మనసు కన్నతల్లీ ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు చక చక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మ వాక్కేను’
అంటూ అప్పారావు గారు ఈ ఒక్క గీతంలోనే కాదు. ఎన్నో గీతాల్లో గాంధీని ప్రస్తుతించారు. గాంధీ వల్లే హిందూ, ముస్లిం ఐక్యత సాధ్యమైందని అంటూ చెరుకువాడ వెంకటరామయ్య–‘మన పాలి భాగ్యమేమందు హిందూ మహమ్మదీయుల పొందు ఘనతర ధైర్యము గల్గించు నాథుడు గాంధి మహాత్ముడు కైదండౖయెనాడు’ అన్నారు. అప్పట్లో దామరాజు పుండరీకాక్షుడు రాసిన ‘శ్రీగాంధీనామము మరువాం మరువాం’ అన్న గీతం అందరి నోటా తరచూ వినిపించేది.కనుపర్తి వరలక్ష్మమ్మ, బసవరాజు అప్పారావు, తుమ్మల సీతారామమూర్తి, జాషువా మొదలైన వారెందరో గాంధీని, సమాజంపై గాంధీ ప్రభావాన్ని నేరుగా ప్రస్తుతించారు.తుమ్మల సీతారామమూర్తి చౌదరిని ‘మహాత్ముని ఆస్థానకవి’గా చేసినవి ఆయన రాసిన ‘ఆత్మకథ’ (గాంధీ స్వీయచరిత్రకు అనువాదం), ‘మహాత్మకథ’, ‘ధర్మజ్యోతి’, ‘ఆత్మార్పణ’, ‘గాంధీగానం’ వంటి కావ్యాలు. మహాత్మకథలో ఆయనంటారు–‘గాంధీయుగమున బుట్టితి గాంధి నడుపు నుద్యమంబుల నలిగితినోపినంతగాంధి వీక్షించితిని గాంధీ కవిత వ్రాయ గంటి నీ జన్మమునకు నీ పంట చాలు’.

గాంధీమీద శతకాలు మొదలుకుని స్మృతికావ్యాలు, చివరికి మంగళహారతులు కూడా వచ్చాయి.‘జయగాంధీ దేవా మంగళం జయమంగళం నీకు, సత్యాగ్రహాశ్రమతాపసా శాంత స్వభావ మానసా’’ వంటివి వింటే గాంధీ సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామంలా కూడా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాంధీపై కావ్యాలు, గేయాలతోపాటు హరికథలు, శతకాలు, దండకాలు కూడా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో కోసం రాసిన గాంధీ పాటలోని కమ్మదనం ఈనాటికీ తాజాగానే ఉంటుంది.‘కమ్మగా బతికితే గాంధీయుగం– మనిషి కడుపునిండా తింటె గాంధీ జగం.తన కంఠమున దాచి హాలాహలం తలనుంచి కురిపించి గంగాజలం మనిషి శివుడవడమే గాంధీ వరం బాపుననుసరిస్తే చాలు మనమందరం’ అంటారు కృష్ణశాస్త్రి.

సంప్రదాయకవులుగా భావించే పుట్టపర్తి నుంచి అభ్యుదయ కవులైన ఆరుద్ర, దాశరథుల వరకూ ఎందరో కవులు గాంధీకి తమ కవిత్వంలో చోటిచ్చారు. ‘కొత్తవిజయాలు’ అనే గేయంలో ఆరుద్ర– ‘బుద్ధదేవుని కాలమందున పుట్టలేదని బాధపొందను గాంధి మెట్టిన ఈయుగమ్మే ఘనతరంబని యెంచెదన్‌’ అని అంటే, ‘అహింసతో హృదయాలను అవలీలగా జయించిన మహాత్ముడే దేశానికి మహనీయ దయాజ్యోతి’ అన్నారు దాశరథి. చివరకు, ‘గాంధీలాలీ మోహన గాంధీలాలీ కరుణాసాంద్రా మోహనదాసాగాంధీలాలీ’ అంటూ జోలపాట కూడ వచ్చిందంటే గాంధీని తెలుగు వారు తమ సాహిత్యంతో ఎంతగా అక్కున చేర్చుకున్నారో అర్థమవుతుంది.

‘కలి యుగ ప్రహ్లాద చరిత్ర’లో దామరాజు పుండరీకాక్షుడు గాంధీని విష్ణుభక్త పరమాణువుగా భావించారు. పద్యం, వచనం, గేయం మూడు ప్రక్రియల్లోనూ గాంధీని కవిత్వీకరించారు కవులు. ఇక కల్పనా సాహిత్యానికి వస్తే కనుపర్తి వరలక్ష్మమ్మ దగ్గర్నుంచి తల్లావఝల పతంజలి శాస్త్రి వరకూ గాంధీ ప్రస్తావనతో కథలు రాశారు. కథలు, నవలల్లో గాంధీ ఒక పాత్రగా అక్కడక్కడా కనిపించినా, గాంధీ నడిపించిన పోరాట ఘట్టాల చిత్రణే ఎక్కువగా కనిపిస్తుంది. నవలల్లో జాతీయోద్యమాన్ని ప్రస్తావించిన తొలి నవల వేలూరి శివరామశాస్త్రిగారి ‘ఓబయ్య’(1920) పూర్తిగా గాంధీ స్ఫూర్తితో వచ్చిందే. ఆ తర్వాత అడవి బాపిరాజు నుంచి మహీధర రామమోహనరావు వరకూ ఎందరో నవలాకారులు గాంధీ స్ఫూర్తిగా కథానాయకుల జీవితాలను చిత్రించారు.

1921లో వచ్చిన ‘మాలపల్లి’లో ప్రత్యేకంగా గాంధీని ఎక్కువసార్లు ప్రస్తావించకపోయినా గాంధీ సిద్ధాంతాల వ్యాప్తే ప్రధానాంశంగా రామదాసును దానికి ప్రతినిధిగా చూపించారు. అడవి బాపిరాజు నవలలు ‘నారాయణరావు’, ‘కోనంగి’ లో కథానాయకులిద్దరూ గాంధీ పిలుపునందుకుని చదువులు, ఉద్యోగాలు వదిలేసుకున్నవారు. విశ్వనాథ ‘వేయి పడగలు’లో నాయకుడు ధర్మారావు జాతీయోద్యమంలో పాల్గొనకపోయినా, కేశవరావు, రాఘవరావు గాంధీ భక్తులుగా కనిపిస్తారు. గాంధీని కృష్ణుడితో, రాట్నాన్ని వేణువుతో, దేశప్రజలను గోపికలతో పోలుస్తూ విశ్వనాథ.. గాంధీ అప్పటి సమాజంపై ఎంతటి ప్రభావం చూపాడో వర్ణిస్తారు. ధర్మారావు మాత్రం హరిజనోద్యమాన్ని, సహాయ నిరాకరణోద్యమాన్ని వ్యతిరేకించడం, అతనికి గాంధీపై తక్కినవాళ్లకున్నంత గౌరవం లేదని తెలుపుతుంది.

అడవి బాపిరాజు సంగతి వేరు. ఆయన స్వయంగా గాంధీ అభిమాని కనక ఆయన నవలానాయకుడు నారాయణరావు అలాగే కనిపిస్తాడు. కోనంగి నవలలో గాంధీకే పరిమితం కాకుండా, కమ్యూనిస్టుల భావజాలం గురించి కూడా రాసి, గాంధీ ఆలోచనలకూ, వారి ఆలోచనలకూ ఉన్న తేడాను చెప్పడం ద్వారా బాపిరాజు గాంధీని సవిమర్శకంగా చూసే ప్రయత్నం చేశారు. ‘చివరకు మిగిలేది’ జాతీయోద్యమానికి సంబంధిం చిన నవల కాకపోయినా, దయానిధి పెళ్లిరోజు రాత్రి ఇల్లు వదిలి వెళ్లడంతో అతని జీవితంలో వచ్చిన మలుపు గొప్పది; అలా వెళ్లిపోవడానికి కారణం ‘ఒక సన్నటి, నల్లటి పొడుగాయన కర్ర పుచ్చుకుని తొందరగా కదిలిపోతున్నాడు. అందరూ ఆయన వెనకాల పడ్డారు. ఆయన పాదాల కింద ఇసుక రేణువులై ఈ ప్రజ, ఒక్కసారి లేచి గంతులేసి నలుదిక్కులా వ్యాపించింది’ అని గాంధీని గొప్పగా వర్ణించాడు బుచ్చిబాబు.
– మృణాళిని వ్యాసకర్త రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయ తీరాల ‘తెర’చాప

ఆయన కళగన్నారు

గాంధీ మార్గంలో పల్లెను మళ్లిదాం..

‘స్వచ్ఛ’మేవ జయతే

‘నాలుక’ను జయించి

నయా నిజం..గాంధీయిజం

లైలా..మజ్ను

మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!

పర్యాటక రంగంతో శాంతికి ఊతం

నీడల ఊడ

సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు

ఆమె భార్య అయ్యాక

ఒప్పుకునేవాడే మహాత్ముడు..

తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.

ఆశయాల లేఖనం

గ్రేటర్‌ గృహాలంకరణ

ధైర్యం చేసి రాశా

టిక్‌టాక్‌ ఎడబాటు..ఫేస్‌బుక్‌ డిప్రెషన్‌

ఇలా ఉంటే గుండె బేఫికర్‌..

ప్రశ్నల మేఘాలు తొలగితే ప్రశాంత మహోదయం...

కర్తవ్యమ్‌

పూలకు పండగొచ్చింది

ఏడు నడకదారులు

అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

తారలు తరించిన కూడలి

ఆ చేతి బజ్జీ

రుచికి గొప్పాయి

ఈ వర్షాల్లో ఇమ్యూనిటీ పెంచుకోండిలా...

విశాఖ అందాలకు ఫిదా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైరా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

సైరా నాకో పుస్తకం

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

ఏపీలో ‘సైరా’ అదనపు షోలు

‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’