ఆమే నా గాడ్‌ మదర్‌

29 Jan, 2019 23:56 IST|Sakshi

సీరియల్

సస్పెన్స్‌ కథనంతో, అనూహ్యమైన మలుపులతో రక్తి కట్టించే విధంగా సీరియల్‌ని ముందుకు నడిపించడంలో మంజులానాయుడు స్టైలే వేరు. దూరదర్శన్‌లో సీరియల్స్‌ కొత్తగా వస్తున్న రోజులవి. అక్కడ మొదలైన ప్రయాణం తెలుగులో కమర్షియల్‌ చానెల్స్‌ మొదలయ్యాక ఊపందుకుంది. ‘రుతురాగాలు’ తెలుగు టీవీ సీరియల్స్‌ని మలుపు తిప్పిన సీరియల్‌. కస్తూరి, మొగలిరేకులు .. ఇలా ఎన్నో సెన్సేషల్‌ టీవీ సీరియల్స్‌ ఆమె చేతిలో రూపుదిద్దుకున్నాయి. టీఆర్‌పి రేటింగ్స్‌ని పరిగెత్తించే సత్తా గల ఆమే మంజునాయుడు. 

సీరియల్స్‌ సక్సెస్‌ గురించి...
నాది, బిందు(చెల్లెలు)ది వేవ్‌లెంగ్త్‌ బాగుంటుంది. మంచే చూపించాలి అనుకునేవారం. దానివల్లే మంచి ప్రాజెక్ట్స్‌ వచ్చాయి. వారంలో ఒకరోజు స్టోరీ చర్చకోసం అని పెట్టుకునేవాళ్లం. 2 గంటల్లో స్టోరీ డిస్కషన్‌ ఉండేది. దాంతో రాబోయే వారం స్టోరీ లైన్‌ వచ్చేసేది

మీరు సీరియల్స్‌ తీసేనాటికి ఇప్పటికీ ఓవరాల్‌ సీరియల్స్‌ వ్యూ..
(నవ్వుతూ) ఇప్పటి కంటెంట్‌లో చాలా మార్పులు వచ్చాయి. చూసేవాళ్లంతా చెబుతుంటారు ఆ తేడా. ఆ విషవలయం అనేది ఎప్పుడు బ్రేక్‌ అవుతుందో చెప్పలేం. ప్రేక్షకులు ఏమంటారంటే.. ‘మీరు తీస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం’ అంటారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ ఏమంటారంటే.. ‘ఆడియన్స్‌ చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం’ అంటున్నారు. సీరియల్స్‌ అయినా ఇతర కార్యక్రమాలైనా ప్రేక్షకుల స్పృహ తప్పనిసరి. ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు? వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం.. అనే ఆలోచన ప్రేక్షకుల్లోనే ఉండాలి.

అలాగే సీరియల్స్‌ తీసే దర్శక నిర్మాతలకూ సామాజిక బాధ్యత ఉండాలి. సీరియల్స్‌ డౌన్‌ ట్రెండ్‌ ఇప్పుడు చాలా ఎక్కువ. ఆధునికతకు, మెచ్యూరిటీకి చాలా తేడా ఉంది. ఇది ఒక్కరిదే లోపం అనలేం అందరూ ఆలోచించాల్సిన విషయం. వీటన్నింటి నడుమ ఎన్నో మంచి సీరియల్స్‌ కూడా వచ్చాయి. వస్తున్నాయి. నేనలాంటి ఔట్‌ఫోకస్‌ ఉన్న సీరియల్సే తీసాను. కక్షలు, మోసాలు అన్నింటా ఉంటాయి. అయితే, ఏం చూపుతున్నాం అనేది కూడా దర్శకుడికి చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా డిప్రెసివ్‌ సినారియో నడుస్తుంది.  

యంగ్‌జనరేషన్‌ ఇష్టపడేవి..
ఇప్పటి యంగ్‌ జనరేషన్‌లో హానెస్టీ ఉంటుంది. ప్రతీ థాట్‌లో ఓపెన్‌నెస్‌ని బాగా ఇష్టపడుతున్నారు. మాటలు, చేతలు, ధైర్యంగా ఇష్టాయిష్టాలు చెప్పుకోవడం.. ఇలా ప్రతీది ఓపెన్‌గా కనిపిస్తున్నారు. అది మంచికో చెడుకో అనేది మళ్ళీ క్వెశ్చన్స్‌ వేసుకోవాల్సిందే. నా విషయానికి వస్తే చిన్న వయసులోనే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. 18 ఏళ్లకే నాకు పెళ్లయింది. అప్పుడు ఇంటర్మీడియేట్‌ మాత్రమే. రిజల్ట్‌ వచ్చాక ఇంట్లో ఇంకా చదువుకోవాలన్నారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా పెద్ద కొడుకు పుట్టాడు. కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు కూడా వేసేదాన్ని. మా అమ్మ నన్ను ఎంకరేజ్‌ చేసేవారు.  మా వారు దూరదర్శన్‌లో వర్క్‌ చేసేవారు.

చిత్రలహరికి టైటిల్స్‌ రాయమన్నారు. బొమ్మలేసే అలవాటు ఉండటం వల్ల ఆ వర్క్‌ తీసుకున్నాను. అలా టీవీలో నా వర్క్‌ డాక్యుమెంట్స్‌కి చేయడం వరకు వెళ్లింది. డిగ్రీ పూర్తయ్యాక అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ మరికొన్ని కనిపించాయి. అలా నేచరల్‌గా టీవీ సీరియల్‌ వర్క్‌లోకి ఎంటరయ్యాను. ముందు తక్కువ ఎపిసోడ్స్‌ ఉన్న సీరియల్స్‌ చేశాను. తర్వాత 26 ఎపిసోడ్స్, 50 ఎపిసోడ్స్, వంద, వెయ్యి... అలా పెద్ద సీరియల్స్‌ వరకు వెళ్లాం. 

ఏ సీరియల్‌ బాగా ఇష్టం? సీరియల్‌ ఆఫ్‌ స్క్రీన్‌లో గ్రేట్‌ మూమెంట్స్‌..
రుతురాగాలు బాగా ఇష్టమైన సీరియల్‌. అలా స్మూత్‌గా వెళ్లిపోయింది కథ. ప్రతీ సీరియల్‌ ఎండ్‌ మూమెంట్‌ అనేసరికి చాలా బాధనిపించేది. యూనిట్‌లో అంతా ఏడుపులతో గందరగోళంగా ఉండేది. స్టోరీతోనూ, ఆ పాత్రలు, వర్క్‌ చేసే ప్రతి ఒక్కరి మధ్యా ఒక బంధం ఉండేది. రేపటి నుంచి ఇక కలవం అనుకుంటే చాలా బాధగా ఉండేది. ప్రేక్షకులతో ఉండే ఒక బాండ్‌ కూడా అక్కడితో ఎండ్‌ అవుతుంది. కానీ, ఎన్నాళ్లో అలా సాగదీయలేం కదా! 

సీరియల్స్‌ ద్వారా జనాలకు ఇచ్చే సందేశం
మెసేజ్‌ ఇవ్వడానికి సీరియల్, సినిమాను మించిన సాధనం లేదు. సీరియల్‌ ద్వారా అరగంట ఆడియన్స్‌ టైమ్‌ మనచేతిలో ఉందంటే చెప్పే విషయం పట్ల చాలా క్లారిటీ ఉండాలి. సొసైటీని డీ జనరేట్‌ కానివ్వకూడదు. మంచి–చెడు చెప్పగలగాలి. సృష్టించే క్యారెక్టర్‌కి విలువలు ఉండాలి. కథలో సస్పెన్స్‌ ఉండాలి. వాటితో పాటే క్యార్టెక్టర్‌తో ప్రేక్షకుడికి ఒక బంధం ఏర్పడాలి. ఆగమనం సీరియల్‌ నుంచి కెరటాల దాక మోరల్‌ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సెల్ఫ్‌ డిఫెన్స్, ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పాం. ఈ ఆలోచన కూడా ఏదో పనిగట్టుకొని రాదు. అది మన మైండ్‌లో నేచురల్‌గా చేరిపోతుంది. 

నటీ నటుల ఎంపిక... 
ఈ ఫేస్‌ అయితే ఈ క్యారెక్టర్‌కి కరెక్ట అనుకుంటాం. కొన్ని ఆర్టిస్ట్‌ను బట్టి మార్పులు చేసుకుంటాం. కొంతమంది బాడీలాంగ్వేజెస్‌ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. వాళ్లని బట్టి కూడా కొత్త కథలు పుట్టుకువస్తాయి. నటీనటుల్లో ‘నటించగలం’ అనే కాన్ఫిడెన్స్‌ ఉండాలి. కొత్తకథ అనుకున్నప్పుడు ఆర్టిస్టుల గురించి అనౌన్స్‌ చేస్తాం. 
లాంగ్‌ సీరియల్స్‌ని కొనసాగించడం చాలా కష్టం అనుకుంటారు. కానీ, చాలా సింపుల్‌. తక్కువ మందితో ముందే అనుకున్న కథనంతో సీన్‌ నడిపించేస్తాం. కొంతమంది వెళ్లి వెనక వంట కూడా చేసేస్తుంటారు. ప్రతిరోజూ ఒక పిక్నిక్‌లా ఉంటుంది. 

తెలుగు సీరియల్స్‌ – ఫారిన్స్‌ సీరియల్స్‌కి తేడా!
ఇంగ్లిష్‌ సీరియల్స్‌ కల్చర్‌ చాలా భిన్నంగా ఉంటుంది. ‘శాంటాబార్బరా, బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌..’ వంటివి అలా కొనసాగుతూనే ఉంటాయి. వాటిలో ఉండే పాత్రలు అక్కడి కల్చర్‌కి అనుగుణంగా ఉంటాయి. అక్కడి బంధాలు కూడా  వాళ్లు యాక్సెప్ట్‌ చేస్తారు. అలాగే డబ్బు ఫ్లో కూడా వారికి సపోర్టింగ్‌గా ఉంటుంది.

సీరియల్స్‌కి తీసుకున్న కథలు ?
సీరియల్స్‌ తీయాలని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేం అనుకున్నాం.. ‘మనమే రాసేద్దాం’ అని. కామన్‌ఫ్రెండ్స్‌ కొందరు యుద్ధనపూడి సులోచనారాణిగారిని కలవమన్నారు. దాంతో ఆవిడ  పుస్తకాలు ఇచ్చి ఏం కావాలో సెలక్ట్‌ చేసుకోమన్నారు. అలా ‘ఆగమనం’ చేశాం. నాటినుంచి కథ అంటే ఆవిడ దగ్గరకు పరిగెత్తేదాన్ని. ఆమే నా గాడ్‌ మదర్‌. ఆ తర్వాతి సీరియల్స్‌నీ ఆమెతో చర్చించాను. 

ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్‌ గురించి..? 
కథ, పాత్రల గురించి ముందు నేను కన్విన్స్‌ అవ్వాలి. అందుకే ఏడాది పాటు బ్రేక్‌ తీసుకున్నాను. ఇప్పుడు  నవలలు చదువుతున్నాను. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథనాలను ఇష్టపడుతున్నాను. వచ్చే అక్టోబర్‌ వరకు పుస్తకాలతోనే నా కాలక్షేపం. పోలిక లేకుండా మనసు పెట్టి చేస్తే ఎవ్వరైనా తమ వృత్తిలో సక్సెస్‌ అవుతారు.
– నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు