ఇక్కడి యజమాని కన్నా అక్కడి కార్మికుడు సో బెటరు

1 May, 2016 12:41 IST|Sakshi
ఇక్కడి యజమాని కన్నా అక్కడి కార్మికుడు సో బెటరు

మే డే స్పెషల్
రోజుకు ఆరు గంటల పని. వారానికి ఐదు పనిదినాలు. ఓవర్‌టైమ్ అక్కడో వింత. వీకెండ్లను వదిలేసి, వేతనంతో కూడిన సెలవులు ఏడాదికి దాదాపు 40 రోజులు. పిల్లలు పుడితే తల్లిదండ్రులిద్దరికీ కలిపి 480 రోజులు వేతనంతో కూడిన సెలవులు. ఒకవేళ కవలలు పుడితే అదనంగా మరో 180 రోజులు సెలవులు. పిల్లలు పుడితే తల్లులు ఎలాగూ సెలవులు తీసుకుంటారు. అయితే, పిల్లలు పుట్టిన కారణంగా సెలవులు తీసుకునేందుకు తటపటాయించే తండ్రులను సైతం మరిన్ని సెలవులు తీసుకోవాలంటూ ప్రోత్సహించే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.

ఇంతే కాదు, అనారోగ్యంతో బాధపడే కార్మికులకు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు దాదాపు మూడు నెలల వరకు ఉంటాయి. పిల్లల చదువులకయ్యే ఖర్చులు, పనిప్రదేశంలో తిండి తిప్పలకయ్యే ఖర్చులు, ఏడాదికోసారి ఊళ్లు చుట్టి రావడానికి ప్రయాణాలకు అయ్యే ఖర్చులను పూర్తిగా చెల్లిస్తాయి.

 ఔనా! నిజమేనా..! అనుకుంటున్నారా? ఇంతకీ ఇలాంటి అద్భుతమైన పని పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటారా? స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, లగ్జెంబర్గ్ వంటి పలు స్కాండినేవియన్ దేశాల్లో ఉన్నాయి. అక్కడి చట్టాలు కార్మికుల హక్కులకు మాత్రమే కాదు, వారి సమస్త సౌకర్యాలకు, సంక్షేమానికి పూర్తి భరోసా ఇస్తాయి. స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో చట్టబద్ధమైన కనీసవేతనాలు లేవు.

అయితే, ఆ దేశాల్లో ఏమాత్రం నైపుణ్యం లేని పనులు చేసేవారికి కూడా నెలకు దాదాపు రెండువేల డాలర్ల వరకు దొరుకుతాయి. చట్టబద్ధంగా  కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో బ్రిటన్, ఫ్రాన్స్ కూడా స్కాండినేవియన్ దేశాల సరసన నిలుస్తున్నాయి. నైట్ డ్యూటీలు చేసేవారికి ఈ దేశాలు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాలనే చెల్లిస్తాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కనీస వేతనాలు చెల్లించడంలో టాప్-5 దేశాలు... అక్కడి కనీస వేతనాల వివరాలు...

దేశం                           కనీస వేతనం
లగ్జెంబర్గ్        2029 డాలర్లు (రూ.1,34,774)
నెదర్లాండ్స్    1918 డాలర్లు (రూ.1,27,401)
బెల్జియం      1800 డాలర్లు (రూ.1,19,563)
ఫ్రాన్స్          1707 డాలర్లు (రూ.1,13,385)
బ్రిటన్          1657 డాలర్లు (రూ. 1,10,064)

మరిన్ని వార్తలు