అమ్మా! నీకు వందనం

29 Mar, 2019 01:24 IST|Sakshi

జనని

అమ్మను మించి దైవమున్నదా? అని ప్రశ్నిస్తాం. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అని ప్రవచిస్తాం. కాని అమ్మ అంటే ఇంట్లో మనకు అన్ని పనులు చేసిపెట్టే ఒక బొమ్మ మాత్రమే అనుకునేలా మారిపోయిన  పరిస్థితుల్లో.. మనకు జన్మనిచ్చిన, దైవంతో సమానమైన అమ్మను మనసారా పూజించడం అనే మాటే వినడానికి వింతగా ఉంటే... పూజించడానికి ఒక విధానం కూడా ఉందని చెబితే మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా..  అలాంటి ఆశ్చర్యానందాలను మించిన అద్భుతమైన తృప్తిని కలిగిస్తుంది అమ్మను పూజిస్తే అని నిరూపించింది జన్మనిచ్చిన జననికి జయంత్యుత్సవం కార్యక్రమం. కదిలే దైవం.. కొలుచుకో నిత్యం...తల్లిని ఎలా పూజించాలి? కనుల ముందు కదిలే దైవంలా ఎలా కొలుచుకోవాలి.

ఇలాంటివి తెలియజెప్పేందుకు హైదరాబాద్‌లోని శిల్పారామం సంప్రదాయ వేదికలో సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘జన్మనిచ్చిన జననికి జయంత్యుత్సవం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వందలాదిగా కొడుకులు, కూతుళ్లు తల్లులతో సహా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆత్మానందమయి మాతాజీ ముఖ్య అతిథిగా హాజరై... మాతృమూర్తులను పూజించే విధానాన్ని బోధించారు. తల్లిని పూజించేటప్పుడు కొందరు బిడ్డల్లో కళ్లు చెమరించడం, పూజానంతరం వారి కళ్లలో కనిపించిన తృప్తి... మాతృమూర్తి పట్ల తరాలు మారినా తరగని ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచాయి. కార్యక్రమం విజయవంతం కావడం స్ఫూర్తిని ఇచ్చిందని, ఇకపై ఏటేటా ఈ తరహాలో నిర్వహించాలని అనుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. 
– సత్యబాబు

మరిన్ని వార్తలు