కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..

30 Sep, 2023 13:11 IST|Sakshi

ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్‌లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే...

అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ వార్డ్‌ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్‌. ఆమె వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్‌ ఎడ్మండ్స్‌లోని పబ్లిషింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్‌ రిజర్వ్‌లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్‌ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది.

దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు.  ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్‌ వార్డ్‌ స్వయంగా డిటెక్టివ్‌లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు.


జూన్‌వార్డ్‌ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్‌సెట్‌లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం

అందులో భాగంగా ఫోరెన్సిక్‌ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్‌కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్‌ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్‌లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు.

జాన్‌ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్‌ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్‌ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్‌ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్‌ ఎగ్జామిన్‌ని జాన్‌ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది.


                                           ఇద్దరు సోదరులో జూలీ వార్డ్‌(ఫైల్‌ఫోటో)

ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్‌ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్‌ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్‌ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్‌, టిమ్‌ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్‌ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్‌ కొడుకులు.


                                            జాన్‌ వార్డ్‌ కొడుకు బాబ్‌ వార్డ్‌

న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్‌ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్‌ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్‌ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్‌కీపర్‌ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు.

2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్‌ డిటెక్టివ్‌ల సాయంతో కెన్యా  స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్‌ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్‌ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్‌. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్‌ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ‍ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! 

--ఆర్‌ లక్ష్మీ లావణ్య

(చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..)


 

మరిన్ని వార్తలు