అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి

14 Nov, 2017 00:53 IST|Sakshi

ఆత్మీయం

ఆదిశంకరాచార్యుల వారు తను రాసిన ఒక గ్రంథాన్ని ‘శివానందలహరి’ అన్నారు. మరొకటి అమ్మవారి మీద రాసినప్పుడు దానిని ‘శ్రీమాతానందలహరి’ అనో, శ్రీమాతాలహరి’ అనో అనాలి. కానీ ఆయన ‘సౌందర్య లహరి’ అన్నారు. ఎందుకంటే – సౌందర్యమంటే అమ్మే. లోకంలో ‘‘మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది’’ అని ఎవరూ అనరు. ఎవరి అమ్మ వాళ్ళకు అందం. అమ్మకు ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఎంత చదువు ఉన్నదీ అన్నదానితో సంబంధం ఉండదు. రోడ్డు నిర్మాణంలో ఒళ్ళంతా చెమటపట్టి కూలీపని చేసుకునే తల్లికి సమీపంలోనే ఆడుకుంటున్న ఒక పిల్లను దారిన పోతున్న ఆగర్భ శ్రీమంతురాలయిన ఒక స్త్రీ ఎత్తుకుని నోట్లో పంచదార పోసే ప్రయత్నం చేస్తే... ఇంత డబ్బున్న ఆమె, ఇన్ని నగలు వేసుకున్నామె, ఈమె పెట్టిన పంచదార తిందాం, ఈమె ముందు మా అమ్మ ఏ పాటి’’ అని ఆ పిల్ల అనుకోదు.

బలవంతంగా విడిపించుకుని వెళ్ళి చెమటతో, దుమ్ముతో తడిసిముద్దయిన తన తల్లి ఒళ్లో వాలిపోతుంది. అమ్మే  క్షేమం. అమ్మే సంతోషం. బిడ్డకు ఎంత వయసొచ్చినా అమ్మలో అందం అంటే క్షేమమే. అమ్మకున్న మరో గొప్పతనం ఎక్కడుంటుందంటే తన కడుపున పుట్టిన పిల్లల్లో అందరికన్నా పనికిమాలిన వారు, అర్భకులు ఎవరోవారిని ఎక్కువ ప్రేమిస్తుంది, ఎక్కువగా దగ్గరకు తీసుకుంటుంది. వారిని ఎక్కువ స్మరిస్తుంటుంది. లోకంలో మిగిలిన వాళ్ళు సమర్థత ఉన్న పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అమ్మ తన సంతానంలో అర్భకుడు, చేతకానివాడైన బిడ్డ వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక అలా ప్రేమించే వాళ్ళుంటారని ఆ కొడుకు విషయంలో చెప్పడం కష్టం. మిగిలిన వారికి వాడు నిస్సందేహంగా బరువే. అమ్మ నిరంతరం వాడి క్షేమం కోసమే ప్రార్థిస్తుంది. అటువంటి వ్యక్తి సృష్టిలో ఉండరు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మదయ అటువంటిది. అందుకే మిగిలిన సంతానం అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి. 

మరిన్ని వార్తలు