కార్తీకం కట్టు

26 Nov, 2015 22:49 IST|Sakshi
కార్తీకం కట్టు

కార్తీకంలో చీకటిని చీల్చడానికి దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుతురులో చలి ముసుగేసుకుంటుంది. పెళ్లి వేడుకలు కూడా ఈ కాలంలో ఎక్కువే. డిజైనర్ దుస్తులు సరే, చలిని తట్టుకోవాలంటే ఎలా? వాటి మీద స్వెటర్ వేసుకోవాలా! అనేవారికి మహత్తరమైన ఆలోచనలతో ప్రసిద్ధ డిజైనర్స్ కొత్త కొత్త మోడల్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కొత్త డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోండి. చలిని దూరంగా తరిమేయండి. వెచ్చగా వివాహ వేడకల్లో దీపాకాంతిలా వెలిగిపోండి.
 
చలికాలం పెళ్లి వేడుకలు ఓ రమణీయకాంతిని కళ్లకు కడతాయి. దీపాల వెలుగుల్లో ఎంతో అందంగా మెరిసిపోవచ్చు అతివలంతా ముచ్చటపడిపోతుంటారు. అయితే వారి ఆనందాన్ని తగ్గించడానికా అన్నట్టు చలి వణికించేస్తుంటుంది. శాలూవాతో అందమైన డ్రెస్సులను కప్పేయకుండా డ్రెస్సులనే చలిని తరిమేసేలా డిజైన్ చేస్తే... చలికే వణుకుపుట్టడం ఖాయం.
 
బ్రైట్ కలర్స్
చలికాలం మూడ్స్ కాస్త డల్‌గా ఉంటాయి. హుషారు తెప్పించాలంటే మాంచి కలర్‌ఫుల్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పసుపు, ఎరుపు, పచ్చ, నీలం.. కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి. వేసవి కాలం హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించి సౌకర్యంగా ఉండలేరు. కానీ, చలికాలం ఎంత హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులైనా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి.
 
లాంగ్ స్లీవ్స్ - హై నెక్స్...
శారీ, అనార్కలీ సూట్, లెహంగా... సంప్రదాయ దుస్తులు ఏవైనా ఫుల్ స్లీవ్స్ ఈ కాలానికి మంచి ఎంపిక. ఇది ప్రస్తుత ట్రెండ్. భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ, రోహిత్‌బాల్, మనీష్‌మల్హోత్రా... వింటర్ బ్రైడల్ వెడ్డింగ్ దుస్తులకు ఎక్కువగా ఫుల్ ఎంబ్రాయిడరీ స్లీవ్స్, అందంగా అలంకరించిన హై నెక్ డిజైన్స్‌పై ప్రధాన దృష్టి ఉంచుతారు.
 
బెనారస్ టు వెల్వెట్స్... లెహంగాలకే కాదు బ్లౌజ్‌లకూ చలికాలం వెల్వెట్ మంచి ఎంపిక. చలికి వెచ్చదనాన్ని ఇచ్చే వెల్వెట్ క్లాత్ మీద చేసిన జరీ ఎంబ్రాయిడరీ వర్క్ చూపు తిప్పుకోనివ్వదు. లెహంగా, శారీ.. రెండింటిపైనా ఈ తరహా బ్లౌజ్‌లను వాడచ్చు. సెలబ్రిటీల శారీస్, వెడ్డింగ్ డ్రెస్ ఫొటోగ్రఫీని చూస్తే ఈ విషయం మీకే స్పష్టం అవుతుంది.
 
పొరలు పొరలుగా... చలిని అందంగా తిప్పికొట్టాలంటే  చక్కని ఐడియా లేయర్ దుస్తులఎంపిక. అమెరికాలో చలిని తట్టుకోవడానికి స్వెటర్, జాకెట్, షాల్, స్క్రార్ప్.. ఇలా ఒకదానిమీద ఒకటి ఎలా ధరిస్తారో.. ఇదే థీమ్‌తో మీ వెడ్డింగ్ వేర్‌ను డిజైన్ చేయించుకోవచ్చు. బాలీవుడ్ తారల వెడ్డింగ్ డ్రెస్, వింటర్ ఫ్యాషన్ షోలను చూస్తే మీకే అర్థమవుతుంది. పొరలు పొరలుగా ఉండేలా పట్టు, బెనారస్, వెల్వెట్, నెటెడ్, షిఫాన్... మిక్సింగ్‌లతో లెహంగాలను, అనార్కలీలను రూపుకట్టవచ్చు. షార్ట్ లెంగ్త్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకొని, దాని మీద మరో లాంగ్ లెంగ్త్ జాకెట్ ధరిస్తే స్టైల్‌గా మెరిసిపోవచ్చు. వింటర్‌లో వెచ్చగా ఉండచ్చు.
 
ఇతర అలంకరణలోనూ... వివాహ వేడుకల్లో ఇతర అలంకరణ వస్తువుల్లోనూ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవి మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తున్నాయి. అలాగే  క్లచ్‌లు ధరించిన దుస్తుల డిజైన్లకు, రంగులకు సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి.
 - ఎన్.ఆర్
 

మరిన్ని వార్తలు