స్త్రీలోక సంచారం

24 Nov, 2018 00:20 IST|Sakshi

పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ (ఐ.సి.సి.) ఏర్పాటు చేసినట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు).. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాసింది. 2013 నాటి ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌’ చట్టాన్ని అనుసరించి ఐ.సి.సి.ని ఏర్పాటు చేసే విషయమై గత నెలలో మేనకాగాంధీ ఏడు జాతీయ పార్టీలకు, 51 ప్రాంతీయ పార్టీలకు పంపిన లేఖకు ప్రత్యుత్తరంగా సి.ఐ.పి. ఈ లేఖను రాసింది.

పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ మందలించినందుకు కోల్‌కతా మేయర్, తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడర్‌ సోవన్‌ చటర్జీ తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తర్వాత ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తర్వాత ఇంటి పరువును, పార్టీ పరువును తీసుకెళ్లి ఓ బెంగాలీ టీవీ చానల్‌లో కలిపేశాడు. ఆయన భార్య రత్నా చటర్జీ. ఆమెకు వేరే మగాళ్లతో çసంబంధాలున్నాయని చానల్‌ ముఖంగా ఆయన ఆరోపించారు. ఇంకో ఆరోపణ.. తన స్నేహితురాలు వైశాఖీ బెనర్జీని, ఆమె కూతుర్ని చంపించడానికి తన భార్య సుపారీ ఇచ్చిందట. (వైశాఖీ యూనివర్శిటీ లెక్చరర్‌). అయితే ఇవన్నీ అబద్ధాలనీ అదే చానల్‌కు వచ్చి, ఖండించి తిరిగి వెళ్లిపోయారు సోవన్‌ భార్య రత్న.

ఇంతకీ మమత అతణ్ణి ఎందుకు మందలించారు? ఆ విషయాన్ని రత్న అయితే బాగా చెప్పగలుగుతారు. సోవన్‌.. పని దొంగలా మారాడట! దీదీ టికెట్‌ ఇచ్చి, గెలిపించి, మేయర్‌ పదవినీ, మంత్రి పదవులను ఇప్పిస్తే.. పరస్త్రీ వ్యామోహంలో పడి.. ఇంటినీ, కన్నతల్లిలాంటి పార్టీని నిర్లక్ష్యం చేసి తన గోతిని తనే తవ్వుకున్నాడట. ఇంకా ముఖ్యమైన విషయం ఈ భార్యాభర్తలిద్దరూ యేటా కాళీపూజకు మమత ఇంటికి వెళతారు. ఈ ఏడాది రత్న ఒక్కరే వెళ్లివలసి వచ్చింది. ‘‘ఆమె వలలో పడి నన్ను పట్టించుకోవడం మానేశాడు. పూజకు నా భర్త లేకుండా వెళ్లడం నన్నెంతో బాధించింది’’ అని రత్న అంటున్నారు. పాపం.. హౌసింగ్, ఫైర్, ఎమర్జెన్సీ అనే మూడు పదవులు నిర్వహించిన సోవన్‌ చటర్జీ హౌస్‌లో ఇప్పుడు ఫైర్‌ రేగి, ఆయన మనశ్శాంతి అత్యవసర స్థితిలో పడిపోయింది. రత్న వేరే ఫ్లాట్‌లో ఉంటున్నారు.   

మరిన్ని వార్తలు