పరి పరిశోధన

22 Jan, 2018 03:04 IST|Sakshi

రేపు ఏం చేయాలో రాసుకోండి.. హాయిగా నిద్రపోండి!

రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా..? ఏవేవో ఆలోచనలు కలచివేస్తున్నాయా? ఈ సింపుల్‌ పనిచేయండి. హాయిగా నిద్రపోండి అంటున్నారు బేలర్స్‌ స్లీప్‌ న్యూరోసైన్స్‌ శాస్త్రవేత్తలు. ఏం లేదు... మర్నాడు పొద్దున్న లేవగానే ఏమేం పనులు చేయాలో ముందురాత్రే ఓ కాగితం మీద రాసిపెడితే చాలు. గందరగోళానికి తెరపడి రెప్పలు వాలిపోతాయని పరిశోధనపూర్వకంగా తెలుసుకున్నారు.

చాలామంది పక్కమీదకు చేరేటప్పుడు ఆ రోజు తాము ఏమేం పనులు చేయలేకపోయామో  ఆలోచిస్తూంటారని.. దాంతో ‘అయ్యో పనులన్ని పెండింగ్‌లో ఉండిపోయాయ’న్న ఆందోళనతో నిద్ర పట్టదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మైకేల్‌ స్కలిన్‌ అంటున్నారు. కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి, వచ్చే ఐదు రోజుల్లో చేయాల్సిన పనుల జాబితాను పడుకునే ముందు రాయాల్సిందిగా ఒక గ్రూపును కోరామని స్కలిన్‌ చెప్పారు.

మరో గ్రూపు వారికి... గత వారంలో పూర్తి చేసిన పనుల జాబితా రాయమని చెప్పారు. రెండు గ్రూపుల వారు ఆ రోజు నిద్రపోయిన తీరును పరిశీలించినప్పుడు భవిష్యత్తు గురించి రాసిన వాళ్లే సుఖంగా నిద్రపోయారని స్కలిన్‌ విశ్లేషించారు. అయితే తాము చేసింది చాలా చిన్న అధ్యయనం మాత్రమేనని, మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా మాత్రమే ఈ అంశాలపై ఒక నిర్ధారణకు రావచ్చునని వివరించారు.


చిటికేస్తే పలికే యమహా బైక్‌...!

లాస్‌వేగస్‌లో జరుగుతున్న కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌ –18)లో జపనీస్‌ మోటర్‌బైక్‌ కంపెనీ ఓ వినూత్నమైన మోటర్‌బైక్‌ను ప్రదర్శనకు పెట్టింది. దీన్ని నడిపేందుకు మనిషి అవసరం లేదు. స్టాండ్‌ వేయాల్సిన పనీ లేదు.  రా.. రమ్మని చేత్తో సైగ చేస్తే చాలు.. మన దగ్గరకు వచ్చేస్తుంది. భలే ఉందే ఈ మోటర్‌బైక్‌... మరి మనమెప్పుడు కొనుక్కోవచ్చు అని ఆలోచిస్తూంటే మాత్రం కొంచెం ఆగాల్సిందే.

మోటరాయిడ్‌ అని పిలుస్తున్న ఈ సూపర్‌బైక్‌ను ఇప్పట్లో అమ్మే ఆలోచన లేదట. కాకపోతే యంత్రాలు మనుషులతో ఎంత మెరుగ్గా వ్యవహరించగలవో పరీక్షించేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నామని యమహా కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మోటరాయిడ్‌ తనను తాను బ్యాలెన్స్‌ చేసుకోవడంతోపాటు డ్రైవర్లను గుర్తుపెట్టుకోగలదని బోర్‌లాండ్‌ తెలిపారు.  టెస్ట్‌ ట్రాక్‌పై మోటరాయిడ్‌ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇంకో విషయమండోయ్‌... ఇప్పటిదాకా తాము జరిపిన పరీక్షల ద్వారా తెలిసింది ఏమిటంటే.. యంత్రాల కంటే మనుషులు చాలా వేగంగా ఆలోచిస్తారని అంటున్నారు యమహా ప్రతినిధి జాన్‌ బోర్‌లాండ్‌. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడంలోనూ మనుషులే బెటర్‌ అంట.


కేన్సర్‌పై అస్త్రంగా జన్యుమార్పిడి బ్యాక్టీరియా...

మన పేగుల్లో కనిపించే ఓ సాధారణ బ్యాక్టీరియాను కేన్సర్‌పై అస్త్రంగా మార్చడంలో నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. జన్యుమార్పిడి పరిజ్ఞానం ద్వారా ఈ బ్యాక్టీరియా పేగులు, మలద్వార కేన్సర్‌ కణాలకు అతుక్కుపోతుంది. పచ్చటి కాలీఫ్లవర్‌ (బ్రాకోలీ)లో కనిపించే ఓ రసాయనం ద్వారా ఆ కణాలను చంపేయవచ్చునని వీరు అంటున్నారు. ఈ–కోలీ నిసెల్‌ అనే సాధారణ బ్యాక్టీరియా జన్యువుల్లో మార్పులు చేస్తే.. అది కేన్సర్‌కణాల్లోని హెపరాన్‌ సల్ఫేట్‌ ప్రొటియోగ్లైకన్‌కు అతుక్కుంటుందని.. బ్రాకోలీలో ఉండే గ్లూకోసినోలేట్స్‌ అందిన వెంటనే సల్ఫరోఫేన్‌గా మారిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాథ్యూ ఛాంగ్‌ తెలిపారు. సల్ఫరోఫేన్‌కు కేన్సర్‌ కణాలను చంపేసే లక్షణముంది. తాము జరిపిన పరిశోధనల్లో దాదాపు 95 శాతం పేగులు, మలద్వార కేన్సర్‌ కణాలు నాశనమయ్యాయని, ఎలుకల్లో కూడా దాదాపు 75 శాతం కణాలు నశించినట్లు ఛాంగ్‌ వివరించారు. అయితే జన్యుమార్పిడి చేసిన బ్యాక్టీరియాను మానవుల్లోకి జొప్పించడంపై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వీటిని అధిగమించగలిగితే భవిష్యత్తులో ఆహార పదార్థాలతోనే ఇలాంటి బ్యాక్టీరియాను అందించడం ద్వారా కేన్సర్‌ను నయం చేయడమే కాకుండా... శస్త్రచికిత్స తరువాత శరీరంలో మిగిలిపోయే కణాలను కూడా నిరపాయకరంగా నాశనం చేయవచ్చునని ఆయన తెలిపారు. 

>
మరిన్ని వార్తలు