ఆధ్యాత్మికం... వ్యక్తిత్వ వికాసం

5 Jun, 2014 22:46 IST|Sakshi

సంకలనం
 
అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాతగా ఆంధ్రదేశానికి సుపరిచితులు వెంకట్ గరికపాటి. గతంలో ఆయన సంగీత ప్రియులకోసం అన్నమయ్య సంకీర్తన రత్నాకరము, అన్నమయ్య సంకీర్తన సుధాకరము పేరిట రెండు స్వరరాగ సుధారసాలను అందించారు. ఆ గ్రంథాలకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తాజాగా ‘వికాస విభాసం’ పేరిట మరో చక్కటి వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ‘సాక్షి’ సహా పలు దినపత్రికలలో ప్రచురితమైన ఈ వ్యాసాలు ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసాలకు మేలు చేకూర్చే మేలిమి ముత్యాల్లాంటివి.

ఇంపైన పదబంధాలతో, సులభమైన శైలితో సాగిన ఈ వ్యాసాలలో అందరికీ తెలిసిన విషయాల నుంచి, ఏ కొందరికో మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి. రచయితది సాహితీ సుగంధాలకు కానీ, ఆధ్యాత్మిక పరిమళాలకు గానీ ఏమాత్రం పొసగని ఉద్యోగం. అయినా చిన్నప్పటి నుంచి తాను విన్న, చదివిన మంచి విషయాలను పదిమందితోటీ పంచుకోవాలన్న తపనతో పలు రచనలు చేశారు.

మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వ్యాసాలన్నింటిలోనూ యువతకు, విద్యార్థులకు అవసరమైన వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉండటం విశేషం. (వికాస విభాసం- ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి, పుటలు: 240, వెల రూ. 150 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు).
 
- డి.వి.ఆర్.
 

మరిన్ని వార్తలు