అడవిలో చల్లని తల్లి!

19 Apr, 2018 01:40 IST|Sakshi

వైద్యలక్ష్మి

ఆమె చేయి చలవ. ఎంత చలవంటే.. ఎంతటి విషమైనా కళ్లు తేలేయాల్సిందే! ఆకులను రెండు చేతులతో నలిపి రసం పిండిందంటే.. ఏ జబ్బయినా ఇట్టే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. అది కేవలం ఆమె నిండు మనసుతో ఇచ్చే మందు శక్తి మాత్రమే కాదు. ఆమె నోటి నుంచి జాలువారే చల్లని మాటలు రోగులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తాము త్వరలోనే కోలుకుంటామన్న భరోసానిస్తాయి. అందుకే అందరూ ఆమెను ‘అడవిలో అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ కుట్టి. 75 ఏళ్లు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్‌ అటవీ ప్రాంతంలో కొండకోనల్లో తాటాకు గుడిసే ఆమె నివాసం.పురుగో, పుట్రో, పామో, తేలో కుట్టిందంటే.. ఎక్కడెక్కడి నుంచో కొండలు ఎక్కి మరీ లక్ష్మీ కుట్టి దగ్గరకు వస్తుంటారు కేరళవాసులు. 

లక్ష్మీ కుట్టికి అడవి అన్నా, ఔషధ మొక్కలన్నా పంచప్రాణాలు. 50వ దశకంలో చదువుకున్న తొలి గిరిజన బాలిక ఆమే. తండ్రి చదువెందుకన్నా.. పట్టుపట్టి బడికెళ్లింది. రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి కష్టపడి చదువుకుంది. ఆ బడిలో 8వ తరగతి వరకే ఉండటంతో అక్కడితో చదువు ఆగిపోయింది.     

తల్లి దగ్గర్నుంచి వైద్యం
అడవిలోని కనీసం 500 రకాల వ్యాధులు, రుగ్మతలకు మూలికా వైద్యం చేయటం లక్ష్మీ కుట్టి ప్రత్యేకత. అయితే, పాము లేదా తేలు కుట్టిన సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని ఆమె అంటారు. తన తల్లి దగ్గరి నుంచే ఈ వైద్యం నేర్చుకున్నానని, ఒక్కటి కూడా మరచిపోలేదంటారు. అయితే, ఈ వందలాది ఔషధ మొక్కల గుణగణాల గురించి, వైద్య పద్ధతుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది గమనించిన కేరళ అటవీ శాఖ అరుదైన ఈ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గ్రంధస్థం చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు లక్ష్మీ కుట్టి సహకారం తీసుకుంటోంది. 

ప్రకృతి నుంచి ఫార్మసీ
ఈ అడవి బామ్మను వెతుక్కుంటూ అవార్డులు వచ్చాయి. 1995లో తొలిగా ‘నాటు వైద్య రత్న’ అవార్డుతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. అవార్డుల పరంపరలో తాజాది భారతీయ జీవవైవిధ్య కాంగ్రెస్‌ అవార్డు(2016). తనతోపాటు రోజూ బడికి వచ్చి చదువుకున్న మేనబావ మతన్‌ కానిని 16వ ఏట ఆమె పెళ్లాడింది. ‘నేను తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన విజయాలన్నిటిలోనూ ఆయన నాకు తోడు నీడగా ఉన్నాడు. నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సాధించేదానివే. ఎందుకంటే నువ్వు అంతటి ధీర వనితవు అని అంటూ ఉండేవాడు. ‘‘గత ఏడాది చనిపోయే వరకు నాకు సరైన జీవిత భాగస్వామిగా ఉన్నాడు’ అందామె. వారికి ముగ్గురు మగ సంతానం. విషాదం ఏమిటంటే పెద్ద కొడుకును ఏనుగు చంపేసింది. చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యాడు. (రెండో కొడుకు రైల్వే చీఫ్‌ టిక్కెట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు). అయినా ఆమె కుంగిపోలేదు, అడవినీ, వైద్యాన్నీ వదల్లేదు. 

వ్యంగ్య రచయిత్రి కూడా!
లక్ష్మీ కుట్టి మూలికా వైద్యురాలిగా మాత్రమే కాదు, వ్యంగ్యం పండించిన కవిగా, రచయిత్రిగా కూడా కేరళలో ప్రసిద్ధి పొందారు! గిరిజన సంస్కృతీ సంప్రదాయాల గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి ఆమె వ్యాసాలు రాశారు. వీటి సంకలనం ప్రచురితమైంది. ‘వీటిని గిరిజన భాషలో కాదు, మళయాళంలోనే రాశాను. అలతి పదాలనే వాడాను. పామరులైనా సులువుగా పాడుకునేలా’ అంటారామె. ‘ఈ అడవే నా ప్రపంచం. బయటి ప్రపంచం నాకు చాలానే ఇచ్చింది. అవార్డులు, సత్కారాలతోపాటు పుస్తకాలనూ ఇచ్చింది. అయినా, నేను అడవిని వదలి బయటికి రాలేను. అడవిలో జీవించాలంటే, ధైర్యం ఉండాలి’ అంటున్నది ఒంటరిగానే అడవిలోనే ఉంటున్న ఈ బామ్మగారు. 
 – పంతంగి రాంబాబు 

మరిన్ని వార్తలు