దేవుడు ఒక్కడే అనండి...సాఫల్యం పొందుతారు!

9 Oct, 2016 00:45 IST|Sakshi
దేవుడు ఒక్కడే అనండి...సాఫల్యం పొందుతారు!

రోజులు గడిచి పోతున్నాయి. ప్రియ ప్రవక్త(స) సందేశప్రచారం వల్ల విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. అవిశ్వాసులకు ఈవిషయం మింగుడుపడడం లేదు. ముహమ్మద్‌ను ఇలాగే వదిలేస్తే, అతని ధర్మం విస్తరిస్తుంది. అతను విజయం సాధిస్తాడు. మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. మన నగరం అభాసు పాలవుతుంది. మన వ్యాపారాలు మందగించి పోతాయి. ఇంకా ఉపేక్షించడం ఎంతమాత్రం సరికాదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే’ అని అంతా కలిసి మరోసారి అబూతాలిబ్ వద్దకు వెళ్ళారు.

‘అయ్యా! మీరు మాపెద్దలు. మాకు అత్యంత గౌరవనీయులు. ఇదివరకు కూడా ఒకసారి తమర్ని కలిశాం. అబ్బాయి విషయంలో కాస్త మాకు న్యాయం చేయండి. మా తాత ముత్తాతల ధర్మాన్ని గురించి, మా దేవతా విగ్రహాల గురించి, మా బుద్ధీజ్ఞానాల గురించి మాట్లాడ వద్దని ముహమ్మద్‌కు నచ్చజెప్పండి. లేదంటారా, మీరు పక్కకు తప్పుకోండి అతని సంగతి మేముచూసుకుంటాం. ఎలాగూ మీరు కూడా అతని మాటలు వినీ వినీ విసుగెత్తే ఉంటారు. మీకు కూడా కాస్త ప్రశాంతత లభిస్తుంది.’ అని మొరపెట్టుకున్నారు.

అబూతాలిబ్ సంకట స్థితిలో పడి పొయ్యారు. వీళ్ళను ఎలా శాంతపరచాలో అర్థం కావడం లేదు. ఇక లాభం లేదనుకొని ముహమ్మద్ ప్రవక్తను పిలవనంపారు.

‘బాబూ ! వీళ్ళంతా మనజాతి అగ్ర నాయకులు. గొప్ప ధనసంపన్నులు. నువ్వేదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నావని ఫిర్యాదు చేస్తున్నారు. బాబూ ! ఎందుకొచ్చినగొడవ. నువ్వువాళ్ళజోలికి పోకు, వాళ్ళూనీజోలికి రారు’. అన్నారు అనునయంగా

‘బాబాయ్..! వాళ్ళ శ్రేయోసాఫల్యాలు ఎందులో ఎక్కువ ఉన్నాయో, ఆవైపుకు వాళ్ళను పిలవ వద్దని అంటున్నారా ?’.

 ‘శ్రేయో సాఫల్యాలా ..! ఏమిటది..?’
‘ఒక్కమాట .. ఒకే ఒక్క సద్వచనం. దాన్ని వాళ్ళు ఉచ్చరిస్తేచాలు. అరేబియా అంతా వారికి దాసోహమంటుంది.ప్రపంచమంతా వారి పాదాక్రాంతమవుతుంది’. అన్నారుముహమ్మద్ .

ఇది విని అబూజహల్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. ‘దైవసాక్షి! ఒక్కసారి కాదు, పదిసార్లు వల్లిస్తాం. ఏమిటో చెప్పు.’ అన్నాడు అబూజహెల్ ..

అప్పుడు ప్రవక్త మహనీయులు, ’దేవుడు ఒక్కడే’ అని పలకండి. గౌరవప్రతిష్టలు మీ పాదాక్రాంతమవుతాయి. దైవకారుణ్యం మీపై వర్షిస్తుంది’. అన్నారు ప్రవక్తమహనీయులు.

దీంతో ఒక్కసారిగా వారిముఖ కవళికలు మారిపొయ్యాయి. ఆగ్రహంతో వారికళ్ళుఎరుపెక్కాయి. పళ్ళు పదునెక్కాయి.
‘ఇదేనా నువ్వు చెప్పదలచుకున్నమాట. సరే చూడు నీగతి ఏమవుతుందో..!’అంటూ, పళ్ళునూరుతూ విసవిసా వెళ్ళిపోయారు.

 - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్  (మిగతా వచ్చేవారం)

మరిన్ని వార్తలు