పక్షులు.. పంటలకు ఆప్తమిత్రులు!

17 Oct, 2017 00:45 IST|Sakshi

పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలనాశించే శనగపచ్చ పురుగును తినే పక్షి జాతులున్నాయి..

పంటలను పాడు చేసే పక్షి జాతులు 63.. మేలు చేసే పక్షి జాతులు 420!

పంటలకు మేలు/హాని చేసే పక్షులపై పీజేటీఎస్‌ఏయూలో విస్తృత పరిశోధనలు

అడవి పందులు, కోతుల నుంచి పంటలను కాపాడుకునే మార్గాలపైనా అన్వేషణ

మిత్ర పక్షుల ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతు సురేశ్‌రెడ్డి

పక్షులు..!  పంటలకు మిత్రులా? శత్రువులా??

పక్షుల పేరు వినగానే పంటలకు కీడు చేస్తాయన్న భావనే సాధారణంగా చాలా మంది రైతుల మదిలో మెదులుతుంది...  కానీ, నిజానికి పంటలను కనిపెట్టుకొని ఉంటూ పురుగులను ఎప్పటికప్పుడు ఏరుకు తింటూ ఎంతో మేలు చేసే పక్షి జాతులు వందలాదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటూ ఉంటే..  ఏదో చెబుతుంటారు.. కానీ, ఈ కలికాలంలో ఇవన్నీ రైతులు ఆధారపడదగినవి కాదేమోనని అనిపిస్తుంటుంది. అయితే, యువరైతు సురేశ్‌రెడ్డి మాత్రం మిత్ర పక్షుల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతున్న మాట ముమ్మాటికీ నిజమేనని అనుభవపూర్వకంగా చెబుతున్నారు!

తన పొలంలో కొంగలు, కాకులు, నీటికోళ్లు, బండారి గాళ్లు (గిజిగాళ్లు) వంటి మిత్ర పక్షులు పురుగులను ఏరుకు తింటూ పంటలను చాలా వరకు చీడపీడల నుంచి కాపాడుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మిత్ర పక్షులు మన పొలాలకు రావాలంటే.. పొలం గట్ల మీద, పరిసరాల్లో చెట్లను పెరగనివ్వాలని.. వాటిపైనే మిత్రపక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకొని మన పంటలకు అనుక్షణం కాపలా కాస్తున్నాయని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్నారు.

గత 20 ఏళ్లుగా తాము ఒక్క చెట్టునూ నరకలేదని సురేశ్‌రెడ్డి గర్వంగా చెబుతున్నారు. పక్షులు, జంతువుల ద్వారా పంటలకు కలిగే లాభనష్టాలపై, పంట నష్టాలను అధిగమించే ఉపాయాలపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ వైద్యుల వాసుదేవరావు సారధ్యంలో దీర్ఘకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి.   డా.వాసుదేవరావు సూచనలు, సలహాలను సురేశ్‌రెడ్డి గత ఐదారేళ్లుగా శ్రద్ధగా పాటిస్తూ.. పంటల సాగులో మిత్ర పక్షుల సహాయంతో చీడపీడలను సులువుగా జయిస్తుండటం విశేషం.   

మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి పంటపై అతి ప్రమాదకరమైన పురుగుల మందులను చల్లుతూ ఇటీవల 18 మంది రైతులు, రైతు కూలీలు చనిపోగా 400 మంది ఆసుపత్రులపాలయ్యారు. ఈ నేపథ్యంలో చీడపీడల బారి నుంచి పంటలను కాపాడటంలో పురుగుమందులే కాదు మిత్ర పక్షులు కూడా ఎంత సమర్థవంతంగా ఉపకరిస్తాయో తెలియజెప్పే శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాలపై ప్రత్యేక సమగ్ర కథనం ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం..

పొలాల్లో పురుగులను పక్షులతో ఏరించవచ్చు!
 ► పొలాల్లో పురుగులను ఏరుకు తిని పంటలకు మేలు చేసే పక్షులు 420 జాతులున్నాయి.
► పత్తి తదితర పంటల్లో శనగపచ్చ పురుగులు, పొగాకు లద్దెపురుగులను పక్షులు ఇష్టంగా తింటాయి
► మిత్ర పక్షులను సంరక్షిస్తే పురుగుమందుల అవసరాన్ని మూడొంతులు తగ్గించవచ్చు
► ‘సాగుబడి’ ఇంటర్వ్యూలో ముఖ్య శాస్త్రవేత్త డా. వాసుదేవరావు

మన దేశంలో 1300 పక్షి జాతులుంటే.. 483 జాతుల పక్షులకు వ్యవసాయ పంటలతో సంబంధం ఉంది. 420 జాతుల పక్షులు రైతు నేస్తాలు. పొలాల్లోని పురుగులు మాత్రం తిని బతుకుతూ రైతులకు ఇవి ఎనలేని మేలు చేస్తున్నాయి. పండ్లు, గింజలు తినే 63 జాతుల పక్షులు పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఈ పక్షులు, అడవి పందులు, కోతులు తదితర జంతువుల (ఎలుకలు మినహా) వల్ల దేశవ్యాప్తంగా పంటలకు తీరని నష్టం జరుగుతున్నది. అడవులు, పొలాల దగ్గర చెట్ల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ వీటి బెడద పెరుగుతున్నది. వీటిని చంపడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం అంగీకరించదు.

కాబట్టి, పంటలను వీటి నుంచి కాపాడుకునే ఉపాయాలపై పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా 17 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ‘అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం’ ఏర్పాటైంది. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు అధిపతిగా పనిచేస్తున్నారు. ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పంటలకు హాని చేసే పక్షులను, అడవి పందులను పారదోలడానికి ఆయన కనిపెట్టిన యంత్రానికి పేటెంట్‌ రావటం విశేషం. ఆయన సారథ్యంలో పక్షులపై 17 ఏళ్లుగా, అడవి పందులపై ఐదేళ్లుగా, రెండేళ్లుగా కోతులపై జరుగుతున్న పరిశోధనలు రైతుల శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి. ‘సాక్షి సాగుబడి’కి డా. వాసుదేవరావు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు..

పక్షులు, జంతువులకు క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటాయి. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకొని ఎంత అవసరమో అంతే తింటాయి. పక్షుల్లో కొన్ని జాతులు పురుగులు మాత్రమే తింటాయి. మరికొన్ని జాతులు గింజలను తింటాయి. రామచిలుకలు స్వతహాగా పండ్లు తింటాయి. అడవుల నరికివేతతో పాటు రోడ్ల విస్తరణ వల్ల పండ్ల చెట్లు తగ్గిపోవటంతో రామచిలుకలు గింజలు తింటున్నాయి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను పురుగుమందుల పిచికారీ ద్వారానే కాదు మిత్ర పక్షుల ద్వారా కూడా అరికట్టవచ్చు.

పత్తి, వేరుశనగ, శనగ, కంది, మినుము, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం చేస్తుంది. పొలాల్లో శనగపచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులను ఇష్టంగా తినే పక్షులు మన దేశంలో 420 రకాల జాతులు ఉన్నాయి. వేరుశనగ పొలంలో ఒక కొంగ 20 నిమిషాల్లో సుమారు 50 పురుగులను తింటుంది. శనగ పంటలో శనగపచ్చ పురుగును సముద్ర కాకులు ఏరుకు తిని పురుగుల ఉధృతిని 73% వరకు తగ్గిస్తాయి. పంటల సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉన్న పొలాల్లో కన్నా.. 2 అడుగుల దూరం ఉన్న పొలాల్లో పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ పురుగులను ఏరుకు తింటాయి.  మిత్ర పక్షుల్లో తెల్లకొంగలు చాలా ముఖ్యమైనవి. వర్షాలు పడి పొలాలు దున్నుతున్నప్పుడు బయటపడే వేరుపురుగులను, లార్వా దశలో ఉన్న పురుగులను 73% వరకు కొంగలు తినేస్తాయి. మే,జూన్‌ నెలల్లో చెట్లపై స్థావరాలను ఏర్పాటు చేసుకొని దుక్కుల సమయంలో సంతానోత్పత్తి చేస్తాయి.

తెల్ల కొంగలు.. వర్షాల రాకను ముందే పసిగట్టగలవు!
ఒకటి, రెండు నెలలు ముందుగానే వర్షాల రాకను తెల్లకొంగలు గ్రహించి, తదనుగుణంగా గుడ్లు పెట్టడానికి సమాయత్తమవుతాయి. వర్షాలు ఆలస్యమౌతాయనుకుంటే.. సంతానోత్పత్తి షెడ్యూల్‌ను ఆ మేరకు వాయిదా వేసుకుంటాయి. పిల్లలను పొదిగే దశలో తెల్లకొంగల మెడ భాగం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి వర్షం రాకను తెలుసుకోవచ్చు. వర్ష  సూచిక జాతిగా కొంగలు గుర్తింపు పొందాయి. పొలాలు దున్నుతున్నప్పుడు, పశువులు నడుస్తున్నప్పుడు బయటపడే వేరుపురుగులను కొంగలు తింటాయి.ఒక్కో పిల్లకు రోజుకు 16 గ్రాముల చొప్పున.. 3 పిల్లలకు కలిపి 45 గ్రాముల వేరుపురుగులను ఆహారంగా అందిస్తాయి. ఒక చెట్టుంటే.. వందలాది కొంగల గూళ్లుంటాయి. దీన్నిబట్టి పంటలకు ఎంత మేలు చేస్తున్నాయో గుర్తించవచ్చు. వీటి ఆహారంలో 60% పురుగులు, 10% కప్పలు, 5% చిన్నపాములు, చేపలు ఉంటాయి. తెల్లకొంగలు పొలాల్లో చెట్ల మీదకన్నా మనుషుల ఇళ్లకు దగ్గర్లోని చెట్లపైనే ఎక్కువ గూళ్లు పెట్టుకుంటాయి. మనుషులకు దగ్గర్లో ఉంటే శత్రువుల నుంచి రక్షణ దొరుకుతుందని భావిస్తాయి.

కానీ, కొంగలు రెట్టలు వేస్తున్నాయని, నీసు వాసన వస్తున్నదని మనం మూర్ఖంగా చెట్లు కొట్టేస్తున్నాం. పంటలపై చీడపీడలు పెరగడానికి ఇదొక ముఖ్య కారణం. పొలాల దగ్గర్లో, గట్ల మీద పూలు, పండ్ల చెట్లను పెంచితే వాటిపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ పక్షులు పురుగులను తింటూ పంటలను కాపాడతాయి. కానీ, మన పొలాల్లో, గట్లపై చెట్లను 95% వరకు నరికేశాం. చెట్లుంటే పక్షులు వాలి పెంటికలు వేస్తాయి. వర్షం పడినప్పుడు నీసు వాసన వస్తుంది.ఇది తెలియక మనుషులు ఇళ్ల దగ్గర, ఊళ్లో, పొలాల గట్ల మీద ఉన్న చెట్లను నరికేస్తున్నారు. తెల్ల కొంగలు ఊళ్లో చెట్ల మీదే ఎక్కువగా గూళ్లు పెట్టి.. కిలోమీటర్ల దూరంలోని పొలాలకు వెళ్లి పురుగులను తింటాయి. పక్షుల విసర్జితాలు భూసారాన్ని సహజసిద్ధంగా పెంపొందించడానికి దోహదపడతాయి. పంటల్లో పురుగులు ఏరుకొని తినే మిత్ర పక్షులను ఆహ్వానించాలనుకుంటే పొలాల గట్లపైన, పరిసరాల్లో చెట్లు పెంచాలి. పంట పొలాల మధ్య ‘టి’ ఆకారంలో పంగల కర్రలు లేదా పక్షి స్థావరాలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. పంట ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దానికన్నా అడుగు ఎత్తున ఈ పంగల కర్రలు ఉండాలి.  పురుగులు పంట పూత దశలో వస్తాయి. అప్పుడు పంగల కర్రలను ఏర్పాటు చేయాలి. ఎన్‌.పి.వి. (న్యూక్లియో పాలీ హైడ్రో ద్రావణం) ద్రావణాన్ని హెక్టారుకు 250 ఎల్‌.ఈ. మోతాదులో పురుగు వచ్చిన తొలిదశ(మొక్కకు 2,3 పురుగులు కనిపించినప్పుడు)లో పిచికారీ చేయాలి. ఈ రెండు పనులూ చేస్తే పురుగుమందుల వాడకాన్ని 75% తగ్గించుకోవచ్చు.  

శత్రు పక్షుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలు!
పొలాల్లో పురుగులు ఏరుకు తిని బతికే పక్షుల వల్ల పంటలకు మేలు జరుగుతుండగా.. పంటలపై దాడి చేసి కంకుల్లో గింజలను, కాయలను తినేసే 63 రకాల పక్షుల వల్ల రైతుకు నష్టం జరుగుతున్నది. పూల నుంచి మకరందాన్ని, పండ్లను, గింజలను తిని బతికే పక్షులు ఇవి. వీటి నుంచి పంటలను కాపాడుకోవడానికి అనేక ఉపాయాలను   
డా. వాసుదేవరావు రైతులకు సూచిస్తున్నారు.

మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, చిరుధాన్య పంటలకు పక్షుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది. వీటిని ప్రధాన పంటలుగా ఎకరంలో సాగు చేస్తే పక్షుల వల్ల దిగుబడి నష్టం 80–90 శాతం ఉంటుంది. అయితే, ఒకే చోట కనీసం 20 ఎకరాల్లో ఈ పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తే నష్టం 5% కన్నా తక్కువగానే ఉంటుంది. ఈ పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు అనేక ఉపాయాల ద్వారా పంటను రక్షించుకునే తక్షణ, దీర్ఘకాలిక మార్గాలున్నాయి.

రామచిలుకలు, గోరింకలు, కాకులు, జీలువాయిలు, పిచుకలు, గిజిగాళ్లు.. తదితర జాతుల పక్షుల వల్ల పంటలకు నష్టం జరుగుతున్నది. పూల చెట్లు, పండ్ల చెట్లను నరికేయడం వల్ల ఈ పక్షులు పంటల మీదకు వస్తున్నాయి.

ఒక ప్రాంతంలో 250–300 పక్షులు ఉంటాయి. 15–20 కిలోమీటర్ల పరిధిలో పంటలపైనే ఇవి వాలతాయి. ఆ పరిధిలోకి ఇతర పక్షులు రావు. ఆహారం దొరక్కపోతే వెళ్లిపోతాయి. సంతతి బాగా పెరిగినప్పుడు దూరంగా వలస వెళ్లిపోతాయి.

పంటలను నష్టపరిచే జాతుల పక్షులు ఎక్కువగా ఏయే జాతుల చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయో గత 3,4 ఏళ్లుగా డా. వాసుదేవరావు సారధ్యంలో అధ్యయనం జరిగింది. 12 పూలజాతి చెట్లు, 11 పండ్ల జాతి చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటిలో వీలైన కొన్ని జాతుల చెట్లను పొలం గట్లపై నాటితే.. పంటలను నష్టపరిచే పక్షుల దష్టిని మళ్లించి పంటలను కాపాడుకోవచ్చు.

పొలాలకు దగ్గర్లో హెక్టారుకు పూల జాతి చెట్లు 4, పండ్ల జాతి చెట్లు 4 పెంచితే పక్షులు వీటిపై ఆధారపడి బతుకుతాయి. పంటల జోలికి రావు.

పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పూల జాతి చెట్లు:
కాడమల్లి, రేల, అడవి బూరుగ, చెట్టు తంగేడు, నిద్రగన్నేరు, మోదుగ, అడవి గానుగ, దేవకాంచనం, కారక, ఆకుపాల, ఇప్ప, సీమగానుగ...
పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పండ్ల జాతి చెట్లు:
నేరేడు, రావి, మర్రి, చీమచింత, చింత, ఈత, పరిగి, రేగు, చెక్కర చెట్టు, నక్కెర, మేడి...

పేపర్‌ ప్లేట్ల పద్ధతి
► పొద్దు తిరుగుడు గింజలు పాలుపోసుకునే దశలో అల్యూమినియం ఫాయిల్‌ పూతపూసిన పేపర్‌ పేట్లను పొద్దుతిరుగుడు పువ్వుల అడుగున అమర్చితే రామచిలుకల దాడి నుంచి 69% పంటను రక్షించుకోవచ్చు.

మొక్కజొన్నకు ఆకుచుట్టు రక్షణ!
► మొక్కజొన్న పంట పాలు పోసుకునే దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దష్టిని మరల్చవచ్చు.
► పొలం గట్ల నుంచి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దష్టిని మరల్చి పంటలను రక్షించుకోవచ్చు.
► తక్కువ విస్తీర్ణంలో పంట వేసిన రైతులకు ఇది అనువైన పద్ధతి.

రక్షక పంట పద్ధతి
► రామచిలుకలు సాధారణంగా మొక్కజొన్న పంటకు గట్టు పక్కన మొదటి వరుసపై దాడి చేస్తాయి.
► జొన్న లేదా మొక్కజొన్న మొక్కలను గట్ల పక్కన వరుసలో రెట్టింపు ఒత్తుగా వేయడం (స్క్రీన్‌ క్రాప్‌) ద్వారా పక్షులను పంట లోపలికి చొరబడకుండా అడ్డుకోవచ్చు

కోడి గుడ్ల ద్రావణం పిచికారీ
► పొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో 20 మి.లీ. కోడిగుడ్ల ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పూలపై పిచికారీ చేయాలి. పక్షుల వల్ల కలిగే నష్టాన్ని 82% వరకు తగ్గించుకోవచ్చని రుజువైంది.
► విత్తనోత్పత్తి క్షేత్రాలలో నైలాన్‌ వలలను పంటపైన కప్పటం ద్వారా పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు.  

నెమళ్ల నుంచి పంటలను కాపాడుకునేదిలా..
► పొలంలో వేసిన విత్తనాలను నెమళ్లు తినేస్తుంటాయి. ఒక వైపు ఎరుపు, మరోవైపు తెలుపు రంగులో ఉండే రిబ్బన్లను విత్తనాలు వేసిన పొలంలో అడుగు ఎత్తులో కడితే విత్తనాలను నెమళ్ల నుంచి కాపాడుకోవచ్చు. మొలక వచ్చే వరకు 10 రోజులు ఉంచి రిబ్బన్లను తీసేయవచ్చు.
► పంట పొలాల్లోకి నెమళ్లు రాకుండా పొలం చుట్టూ 3 నిలువు వరుసలుగా కొబ్బరి తాళ్లతో కంచె మాదిరిగా కట్టాలి. పై తాడుకు కింది తాడుకు మధ్య అడుగు దూరం ఉండాలి. దాని నుంచి నెమలి లోపలికి వెళ్లలేదు.

వేప గింజల ద్రావణం పిచికారీ పద్ధతి
► వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా పంటలను పక్షులు తినకుండా కాపాడుకోవచ్చు.

► లీటరు నీటికి 200 మి. లీ. వేప గింజల ద్రావణాన్ని కలిపి పంటలు గింజ పాలుపోసుకునే దశలో పిచికారీ చేయాలి. పక్షులు వేప గింజల ద్రావణం రుచి సహించక వెళ్లిపోతాయి.

► వేప గింజల ద్రావణం లేక పొగాకు కషాయాన్ని లీటరు నీటికి 10 మి.లీ. కలిపి పిచికారీ చేసి పక్షుల బెడదను నివారించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటల్లో ఇది బాగా పనిచేసింది.
(అడవి పందులు, కోతుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలపై కథనం వచ్చే వారం ‘సాగుబడి’ పేజీ చూడండి)


పక్షులు నడిచిన పొలాల్లో పురుగులు మిగలవు!
► మా పొలాల్లో వందల చెట్లున్నాయి..20 ఏళ్లలో ఒక్క చెట్టూ కొట్టలేదు
►  పంటలకు పురుగుమందుల అవసరం పెద్దగా లేదు
► ‘సాక్షి సాగుబడి’తో ఆదర్శ రైతు సురేశ్‌రెడ్డి
 పొలాల గట్లపైన, పరిసరాల్లో అనేక జాతుల చెట్లను, వాటిపైన గూళ్లు పెట్టుకున్న మిత్ర పక్షులను సంరక్షించుకుంటూ సమీకృత వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు చింతపల్లి సురేశ్‌ రెడ్డి (39). ఆయన స్వగ్రామం గడ్డమల్లాయిగూడెం. ఆ ఊరు హైదరాబాద్‌కు దగ్గర్లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఐదారు బర్రెలున్నాయి. ఒకటిన్నర ఎకరాల్లో వరి, ఎనిమిదెకరాల్లో రాగులు, సజ్జలు, ఉలవలు, కందులు వంటి ఆహార పంటలనే వేస్తున్నారు. వేసవిలో ఆకుకూరలు సాగు చేస్తారు. అధిక పెట్టుబడులు, అనుక్షణం టెన్షన్‌ పడటం ఎందుకని పత్తి జోలికి వెళ్లటం లేదన్నారు. వరి పొలం గట్ల మీద, చెల్క మధ్యలో కూడా చెట్లను పెరగనివ్వటం సురేశ్‌రెడ్డి ప్రత్యేకత. వంద వరకు వేపచెట్లు, 50 వరకు నల్లతుమ్మ, ఊడుగు తదితర జాతుల చెట్లు ఆయన పొలాల్లో ఉన్నాయి. ఇవన్నీ పడి మొలిచినవేనని అంటూ.. పనిగట్టుకొని మొక్కలు నాటక్కర లేదని, ఉన్న వాటిని నరక్కుండా ఉంటే చాలంటారాయన. గత 20 ఏళ్లలో ఒక్క చెట్టునూ తమ పొలాల్లో కొట్టలేదని గర్వంగా చెబుతున్నారు. గట్ల మీద చెట్లుంటే  పంటకు ఇబ్బందేమీ లేదని, వేసవిలో నీడలో పెరిగే కొత్తిమీర వంటి పంటలకు చెట్ల నీడ ఉపయోగపడుతుందంటున్నారు. చెట్లు ఉండటం వల్ల తమ పొలాల్లోకి అనేక రకాల మిత్ర పక్షులు వచ్చి పురుగులను తింటూ పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయంటున్నారు సురేశ్‌రెడ్డి. గత ఐదారేళ్లుగా డా. వాసుదేవరావు సూచనలు పాటిస్తూ మిత్ర పక్షుల సేవలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పురుగుమందుల అవసరం బాగా తగ్గింది..
సురేశ్‌రెడ్డి ఇంకా ఇలా చెబుతున్నారు.. ‘‘దుక్కి చేస్తున్నప్పుడు తెల్లకొంగలు, కాకులు వేరు పురుగులను, నిద్రావస్థలో ఉన్న పురుగులను తింటాయి. శ్రీవరి నాటిన తర్వాత సాళ్ల మధ్యలో కొంగలు తిరుగుతూ తెల్ల కంకికి కారణమయ్యే పురుగులను ఏరుకు తింటాయి. నీరుకోళ్లు వరి పొలంలో పురుగులను తింటూ కనిపిస్తాయి. పక్షులను పొలంలో నుంచి వెళ్లగొట్టను. వాటి పని వాటిని చేయనిస్తాను. కొందరు రైతులు మొక్కలను తొక్కుతాయేమోననుకొని వీటిని పారదోలుతుంటారు. కానీ, నీరుకోడి నడిచిన వరి పొలానికి కాండం తొలిచే పురుగు సమస్య అసలు రానే రాదు. చిరుధాన్య పంటలను ఇష్టపడే బండారి గాళ్లు (గిజిగాళ్లు) పక్షులు గడ్డిపోచలను ఏరి చెట్లకు అందమైన గూళ్లను నిర్మించుకొని స్థిరనివాసం ఉంటున్నాయి. పురుగులను తింటాయి. కొంత మేరకు చిరుధాన్యాలను తింటాయి. మనకన్నా ఎక్కువగా పంటను కనిపెట్టుకొని ఉంటాయి. పొలంలో పాము కనిపిస్తే ‘వచ్చే.. వచ్చే..’ అనే విధంగా చిత్రమైన శబ్దాలు చేస్తూ దూరంగా వెళ్లిపోతాయి. అక్కడ ఏమో ఉందని గ్రహించి మేమూ జాగ్రత్తపడుతుంటాం. మిత్ర పక్షులు పురుగులను తినటం వల్ల పురుగుమందుల అవసరం బాగా తగ్గింది. వరి, వంగ, బెండ వంటి పంటల్లో ఒకటి, రెండు సార్లు పురుగుమందులు పిచికారీ చేస్తే సరిపోతున్నది. చెట్లుంటేనే పురుగులను తినే పక్షులు మన దగ్గర్లో ఉంటాయి. వేప, నల్లతుమ్మ చెట్లు బాగా పెరిగాయి కాబట్టి వాటి ఆకులను మేకలు, గొర్రెల మేపునకు ఇస్తున్నాం. ఏటా రూ. 10 వేల అదనపు ఆదాయం కూడా వస్తున్నది..’’

ముందుగా రికార్డు చేసిన ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పక్షులను భయపెట్టి పారదోలటం ఒక పరిష్కారం..
రిబ్బన్లు కడితే పంటలు సేఫ్‌!
► రిబ్బన్‌ పద్ధతి ద్వారా వివిధ పంటలను పక్షుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.
► పంటకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర – దక్షిణ దిశలలో నాటాలి. 
► ఒక పక్క ఎరుపు రంగు, మరో పక్క తెలుపు రంగులతో అర అంగులం వెడల్పు, 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ను 3 లేదా 4 మెలికలు తిప్పి.. కర్రలను 10 మీటర్ల దూరంలో నాటి కట్టాలి.   
► పక్షుల ఉధృతి ఎక్కువగా ఉంటే కర్రల మధ్య దూరం 5 మీటర్లకు తగ్గించాలి.
► రిబ్బన్‌పైన ఎండ పడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ.. పంట ఏ దశలో ఉందో పక్షుల కంట పడకుండా ఈ రిబ్బన్‌ చేస్తుంది. 
► ఈ పద్ధతిలో అన్ని రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, పండ్ల తోటలను పక్షుల బారి నుంచి కాపాడుకోవచ్చు. 
(సురేశ్‌రెడ్డి మొబైల్‌: 99595 66312) – శ్రీశైలం, సాక్షి, యాచారం, రంగారెడ్డి జిల్లా, కథనం: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఫొటోలు: మిరియాల వీరాంజనేయులు, సాక్షి ఫొటో జర్నలిస్టు.)
(డా. వాసుదేవరావును 040– 24015754, 94404 11166 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ–మెయిల్‌: vasuvaidyula@gmail.com)

మరిన్ని వార్తలు