దైవారాధనా? ధనారాధనా?

24 Sep, 2017 01:25 IST|Sakshi

సువార్త

‘‘ఆదిమ కాలపు చర్చిల్లో విశ్వసించిన వాళ్లంతా ఏకహృదయం, ఏకాత్మగలవారు. తమకున్నవన్నీ తమవేనని ఎవరూ తలచలేదు. వాళ్లంతా (విశ్వాసులు) తమకు కలిగినవి సమిష్టిగా పంచుకున్నారు’’ అని బైబిల్‌ నాటి విశ్వాసుల ఔన్నత్యాన్ని శ్లాఘిస్తోంది (అపో.కా.4 4:32) ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల ఔన్నత్యాన్ని కోరుకున్నట్టే, పరలోకపు తండ్రిౖయెన దేవుడు కూడా తన సంతానమైన విశ్వాసులు ఆత్మీయంగా ఉన్నతస్థాయి నందుకోవాలని సంకల్పించాడు. వారికి దైవికలక్షణాలైన ప్రేమ, పవిత్రత, క్షమాపణ, ధర్మం, నిజాయితీ యథార్థత, నిస్వార్థత, నిష్కల్మషత్వాన్ని నేర్పించే  పాఠశాలగా పరిశుద్ధాత్ముడే ప్రబోధకుడుగా యేసుక్రీస్తు ఆరోహణానంతరం ‘చర్చి’ని దేవుడు నిర్మించాడు. దేవుని ఆరాధనాస్థలాలైన చర్చిలు, సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ, వర్ణ, వర్గ, భాషావివక్షలకు అతీతమైన వ్యవస్థగా ఆయన నిర్దేశించి నియమించాడు. ఆదిమ కాలంలో అపొస్తలుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆరంభమైన చర్చిలన్నీ ఆ కోవకే చెందినవిగా భాసిల్లి దైవసంకల్పాన్ని నెరవేర్చాయి. అంటే పరలోకానందాన్ని, అనుభవాన్ని, ఆనందాన్ని రుచి చూపించే తొలిమెట్లుగా చర్చిలు విలసిల్లాయి. ఆ చర్చిల కారణంగానే ఈ 2000 ఏళ్లలో ఎన్నడూ జరగనంత సువార్త పరిచర్య మొదటి రెండు శతాబ్దాల్లో జరిగింది.

కాని ఈనాడు? ఈ 8 శతాబ్దాల్లో ఆయా వినూత్నావిష్కరణలతో మనిషి జీవితంలో వేగం పెరిగి నాణ్యత తగ్గింది. ఆవిరి యంత్రం, విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రానిక్స్‌ ఆవిష్కరణలతో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. అంతే అనూహ్యంగా జీవితంలో అత్యంత యాంత్రికమయ్యాడు. మరోవిధంగా చెప్పాలంటే, మానవ ప్రగతి యావత్తూ ప్రచ్ఛన్నంగా ‘ధనశక్తి’కి మనిషిని బానిసను చేసింది. మనిషి కుటుంబం, సమాజం చివరికి పవిత్ర ఆరాధనాస్థలాలు కూడా ధనశక్తికి దాసోహమయ్యాయి. దైవిక లక్షణాలు గల ఈ లోకంలో విలువ లేని ఒక వికృత వ్యవస్థను డబ్బు సమాంతరంగా సృష్టించి అంతటా వ్యాపింపజేసింది. ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులైన మానవ సామాజిక, కుటుంబ బంధాలను పలచన చేయడమేగాక కలుషితం చేసింది డబ్బు. ఒక్క క్రైస్తవంలోనే కాదు అంతటా జరిగిన, జరుగుతున్న పరిణామమిది. కాకపోతే దేవుని స్థానాన్ని దైవారాధన స్థలాల్లో ధనం ఆక్రమించుకోవడం తద్వారా ఎదురయ్యే పరిణామాలకు కనీసం ‘చర్చి’ మినహాయింపుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు కానీ అది జరగడం లేదు. దేవుని ప్రేమ, పవిత్రత, పర్యవేక్షణ స్థలంగా ఉండాల్సిన చర్చిలు ఈనాడు ‘రియల్‌ ఎస్టేట్‌’లుగా మారి అక్రమార్కులకు కోట్లు తెచ్చిపెడుతున్నాయంటే అది అనర్థమే కదా!
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు