ఆ తర్వాతే డ్రామా ఎపిసోడ్‌ యాడ్‌ చేశాం!

24 Sep, 2017 01:10 IST|Sakshi

‘‘ఎన్టీఆర్‌లాంటి గొప్ప నటుడు దొరికాడు కాబట్టి ‘జైలవకుశ’ వంటి బిగ్‌ స్పాన్‌ మూవీ చేయడానికి స్కోప్‌ దొరికింది. లేకపోతే ఆరు నెలల్లో ఇలాంటి సినిమాను కంప్లీట్‌ చేయడం చాలా కష్టం’’ అని బాబీ (కె.యస్‌. రవీంద్ర) అన్నారు. ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వం లో కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
‘జైలవకుశ’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందన్నారు బాబీ. మరిన్ని విశేషాలను పంచుకున్నారు.

‘జైలవకుశ’ 30 నిమిషాల కథ ఎప్పట్నుంచో నా దగ్గర ఉంది. కథ చెప్పేటప్పుడు ఎన్టీఆర్‌గారి ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యారనుకున్నా. అది నిజమైంది. వారం రోజుల తర్వాత ఆయన్నుంచి పిలుపొచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్‌ చేస్తున్నాం అన్నారు. ఎగై్జట్‌ అయ్యాను. క్లైమాక్స్‌ గురించి నేను, తారక్‌ (ఎన్టీఆర్‌), కల్యాణ్‌రామ్‌గారు చాలా డిస్కస్‌ చేసుకున్నాం. అనుకున్నట్లుగానే క్లైమాక్స్‌ తీశాం. జై క్యారెక్టర్‌  చనిపోకపోయి ఉన్నట్లయితే ఇది సాధారణ సినిమా అయ్యుండేది. క్లైమాక్స్‌ విషయంలో ఎన్టీఆర్‌కి ఎలాంటి అపనమ్మకం లేదు. ఆయన అనుకున్నట్లుగానే పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.
     
సినిమాలో కీలకమైన ముగ్గురు అన్నదమ్ముల మధ్య వచ్చే నాటకం సీన్‌ కథ చెప్పినప్పుడు అనుకోలేదు. అయితే కథను డిస్కస్‌ చేసే టైమ్‌లో ఓసారి ఎన్టీఆర్‌గారిని కలిశాను. అదే టైమ్‌లో కల్యాణ్‌రామ్, హరిగారు కూడా అక్కడే ఉన్నారు. నాటకాల కారణంగా విడిపోయిన అన్నదమ్ములు తిరిగి నాటకాలతోనే కలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. అప్పుడే ఆ డ్రామా ఎపిసోడ్‌ యాడ్‌ చేశాం. మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ లీనమై నటించడం వల్ల స్క్రిప్ట్‌ దశలో ఉన్న కష్టం మేకింగ్‌ సమయంలో కనిపించలేదు. ముందుగా జై పాత్రకే గుర్తింపు వస్తుందనుకున్నప్పటికీ, లవ, కుశ పాత్రలకు కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది.
     
సినిమా రిలీజైన రోజు నేను ఎన్టీఆర్‌గారింట్లో రాజమౌళిగారిని కలిశాను. ఆయన దాదాపు అరగంటసేపు ఈ సినిమా గురించే మాట్లాడారు. చైల్డ్‌ ఎపిసోడ్‌ బాగుందన్నారు. ఆయన మెచ్చుకోవడం చాలా ఆనందం కలిగించింది. నెక్ట్స్‌ మూవీ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. రెండు నెలలు గ్యాప్‌ తీసుకుందామని అనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు