రాణి వెడలె

23 Dec, 2019 00:14 IST|Sakshi
శాండ్రింగ్‌ హోమ్‌ ఎస్టేట్‌

క్రిస్మస్‌కింకా రెండు రోజుల సమయం ఉంది. బ్రిటన్‌ ప్రజలు మాత్రం గత శుక్రవారమే అధికారికంగా క్రిస్మస్‌ మూడ్‌లోకి వచ్చేశారు. ఇది ఏటా ఉండేదే. క్వీన్‌ ఎలిజబెత్‌–2 లండన్‌లోని తన అధికార నివాసం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి అక్కడికి నూట పన్నెండు మైళ్ల దూరంలోని శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌కు రైల్లో బయల్దేరగానే బ్రిటన్‌ అంతటా క్రిస్మస్‌ సందడి మొదలౌతుంది.

తొంభై మూడేళ్ల బ్రిటన్‌ రాణిగారు ఎప్పటిలా ఈ ఏడాది కూడా సాధారణ ప్రయాణీకుల రైల్లోనే తనకోసం ప్రత్యేకంగా ఒక బోగీని రిజర్వు చేయించు కుని డిసెంబరు 20న కింగ్‌ లిన్స్‌ స్టేషన్‌లో దిగారు. శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌ అక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. ఆమె తండ్రి ఆరవ జార్జి, తాత ఐదవ జార్జి నివసించిన రాజప్రాసాదం అది.  

అతి ముఖ్యులు ఆఖర్న
ప్రతి క్రిస్మస్‌కీ కుటుంబంతో పాటు శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌లో గడిపి వెళ్తారు క్వీన్‌ ఎలిజబెత్‌. మొదట ఆమె, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ వెళ్తారు. వాళ్ల వెనుక మిగతావాళ్లు. ఆ మిగతావాళ్లు కూడా ఎవరు పడితే వాళ్లు రైలు ఎక్కేయడానికి లేదు. దానికో క్రమం ఉంటుంది. క్వీన్, ప్రిన్స్‌ వెళ్లాక.. ఇక ఆ వంశంలో వయసులో బాగా చిన్నవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు బయల్దేరి వెళ్లారు. అందరి కన్నా చివర్లో ‘అతి ముఖ్యులు’ ఎస్టేట్‌కు చేరుకుంటారు. ఆ అతి ముఖ్యులు ఎవరంటే.. వారసత్వ స్థానానికి ప్రాధాన్యతా క్రమంలో ఉన్న క్వీన్‌ కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్, ఆ కుమారుడి కుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్, విలియమ్స్‌ భార్య కేట్‌ మిడిల్‌టన్‌.. అలా ఉంటుంది సంప్రదాయం.

ఈసారి క్వీన్‌ ఎలిజబెత్‌తో పాటు ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా శాండ్రింగ్‌హామ్‌ ప్రయాణానికి సిద్ధం అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆయన్ని లండన్‌లోని కింగ్‌ ఎడ్విర్డ్‌ సెవెన్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించవలసి వచ్చింది. ‘‘98 ఏళ్ల వయసులో ఇవి అవసరమైన పరీక్షలే తప్ప అకస్మాత్తు పరీక్షలేమీ కావు’’ అని రాజ వైద్యుడు చెప్పడంతో క్వీన్‌ తన మనసును కుదుటపరచుకుని తనొక్కరే శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌కు వెళ్లవలసి వచ్చింది. ముందుగా నిర్ణయించిన సమయం కాబట్టి వెళ్లి తీరవలసి వచ్చింది.

రెండు విందు భోజనాలు
ఏటా రాజ కుటుంబం అంతా ఈ ఎస్టేట్‌లోనే క్రిస్మస్‌ ఈవ్, క్రిస్మస్‌ డే వేడుకలు జరుపుకుంటుంది. క్రిస్మస్‌ ఈవ్, క్రిస్మస్‌ ఒకటి కాదు. క్రిస్మస్‌ కోసం ఎదురు చూసే ముందురోజు సాయం సమయం అంతా క్రిస్మస్‌ ఈవ్‌ అయితే, ఆ మర్నాడు చేసుకునేది క్రిస్మస్‌. శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌లో క్రిస్మస్‌ ఈవ్‌కి రాజకుటుంబం ‘బ్లాక్‌ టై డిన్నర్‌’ చేస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంది. క్రిస్మస్‌ రోజు టర్కీ కోడి విందు భోజనం ఎలాగూ ఉంటుంది. ముఖ్యమైన బయటి వ్యక్తులతో కలిసి చేసే డిన్నర్‌ ‘బ్లాక్‌ టై డిన్నర్‌’ అయితే, కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి చేసేది టర్కీ కోడి విందు. దీనినే టర్కీ ఫీస్ట్‌ అంటారు. ఇలా అనడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం రైతులు పాల కోసం పశువుల్ని, గుడ్ల కోసం కోళ్లను తమ దగ్గర ఉంచుకుని, టర్కీ కోళ్ల ను మాత్రమే మాంసం కోసం అమ్మేవారట! పైగా అప్పట్లో పశువులు, కోళ్ల ధర ఎక్కువగా ఉండటం అందుకొక కారణం అంటారు. ఏదైనా టర్కీ ఫీస్ట్‌ అనేది బ్రిటన్‌లోనే కాదు, ఒక్క క్రిస్మస్‌ రోజే కాదు.. అన్ని పాశ్చాత్య దేశాలలో, అన్ని వేడుకలలో సంప్రదాయం అయింది.

లిగింతల కానుకలు
క్రిస్మస్‌ ఈవ్‌కి రాజమాత కుటుంబ సభ్యులు ఇచ్చిపుచ్చుకునే కానుకలు కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ప్రత్యేకమైనవే తప్ప ఖరీదైనవి కాదు. పైగా మనసును ఉల్లాసపరిచేలా ఉంటాయి. తేనీటి విందు సమయంలో అందరూ కూర్చొని ఆ కానుకలను తెరచి చూసుకుంటారు. ఓ క్రిస్మస్‌ ఈవ్‌కి ప్రిన్స్‌ హ్యారీ తన నానమ్మకి (క్వీన్‌ ఎలిజబెత్‌కి) షవర్‌ క్యాప్‌ని గిఫ్టుగా ఇచ్చారు! షవర్‌ క్యాప్‌ అంటే స్నానం చేసేటప్పుడు తలపై షవర్‌ నీళ్లు పడకుండా పెట్టుకునేది. ఆ క్యాప్‌పైన ‘ఎయింట్‌ లైఫ్‌ ఎ బిూూూూ’ అని రాసి ఉంది. దాన్ని చూసి క్వీన్‌ తన మనవడి తాత్వికతకు మురిపెంగా నవ్వుకున్నారు. కష్టాలు వెంటపడి తరుముతున్నప్పుడు. ‘జీవితం ఏం బాగాలేదు’ అని చెప్పడానికి మొరటుగా వాడే మాట ఇది.

హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ ఇచ్చిన సింగింగ్‌ హామ్‌స్టర్‌ (మైకు పట్టుకుని పాట పాడే ఎలుక బొమ్మ) కూడా క్వీన్‌ ఎలిజబెత్‌ను నవ్వించింది. ఎలిజబెత్‌ ఏకైక కుమార్తె ప్రిన్సెస్‌ యాన్‌ తన అన్న ప్రిన్స్‌ చార్లెస్‌కి లెదర్‌ టాయిలెట్‌ సీట్‌ను కానుకగా ఇచ్చారు. కేట్‌ మిడిల్టన్‌ తన మరిది ప్రిన్స్‌ హ్యారీకి ‘గ్రో–యువర్‌–ఓన్‌–గర్ల్‌ఫ్రెండ్‌’ కిట్‌ను ఇచ్చారు. ఎదిగే ఆడపిల్లలకు ఇచ్చే బొమ్మల కిట్‌ అది. ఈ నవ్వుల కానుకల సంప్రదాయం గురించి తెలియక ప్రిన్సెస్‌ డయానా రాజప్రాసాదంలో కొత్త కోడలిగా అడుగు పెట్టిన మొదటి ఏడాది క్రిస్మస్‌ ఈవ్‌కి ఇంట్లో వాళ్లందరికీ ఖరీదైన కాష్మియర్‌ స్వెట్టర్లు, (కశ్మీర్‌ స్వెట్టర్లు కాదు), మెహెయిర్‌ స్కార్ఫ్‌లు ఇస్తే అందరూ ఆమెను ఆటపట్టించారట. ఈ క్రిస్మస్‌కి ఎవరు ఎవరికి ఎలాంటి కానుకలు సిద్ధం చేసి ఉంచారో మరి.

కింగ్‌ లిన్స్‌ స్టేషన్‌లో రైలు నుంచి దిగుతున్న బ్రిటన్‌ రాణి

ఈసారి కొంచెం లేట్‌
వాస్తవానికి క్వీన్‌ ఎలిజబెత్‌ ఇంకాస్త ముందుగానే శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌కి వెళ్లవలసి ఉన్నప్పటికీ ఇటీవలి బ్రిటన్‌ ఎన్నికల కారణంగా ఆమె ప్రయాణం కొంచెం ముందుకు జరిగింది. ఇప్పుడిక క్రిస్మస్‌ అయ్యాక కూడా రాణిగారు ఆ ఎస్టేట్‌లోనే మరికొన్ని రోజులు గడిపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు, మనవలు, మునిమనవలు.. అంతా ఒకేసారి, ఒకే చోట ఆనందంగా కలుసుకునేందుకు ఏటా క్రిస్మస్‌ తనకు ఇచ్చే మహద్భాగ్యాన్ని రాణిగారు అంత తేలిగ్గా ఏమీ విడిచిపెట్టరు అని బ్రిటన్‌ రాజకుటుంబీకుల వర్తమానాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తుండే బయోగ్రఫర్‌లు అంటుంటారు.

మరిన్ని వార్తలు