ప్లేట్‌ ఖుష్‌

16 Jun, 2018 00:13 IST|Sakshi

పండగ అంటే షేర్‌వానీ తొడగడం... షేర్‌ చేసుకొని తినడం.  పొరుగువారిని పిలవడం... నలుగురికి పంచడంఇలా చేస్తే... హృదయం ఆనందంతో నిండిపోతుంది... పంచిన మనకు ప్లేట్‌ఖుష్‌  తిన్నవారి పేట్‌ఖుష్‌ అందరికీ దిల్‌ఖుష్‌.

పత్తర్‌  కా  ఘోష్‌
కావల్సినవి :బోన్‌లెస్‌ మటన్‌ – కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్‌; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్‌; జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌; లవంగాల పొడి – చిటికెడు; యాలకుల పొడి – పావు టీ స్పూన్‌; గరం మసాలా – పావు టీ స్పూన్‌; నెయ్యి – 100 గ్రాములు; ఆవనూనె – అర కప్పు; మిరియాల పొడి – చిటికెడు ; బొప్పాయి కాయ గుజ్జు – టేబుల్‌ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; అనాసపువ్వు పొడి  – చిటికెడు ; నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు; చిలికిన పెరుగు – కప్పు ; ఉప్పు – తగినంత ; వెల్లుల్లి రసం – 2 టేబుల్‌ స్పూన్లు

తయారి:మటన్‌ని శుభ్రం చేసి, నీళ్లన్నీ పోయేలా వార్చాలి ∙అందులో పై మసాలా, కారం... అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాలి ∙వెడల్పాటి రాయిని బొగ్గుల కుంపటి మీద పెట్టి వేడి చేయాలి ∙నెయ్యి వేసి, ఒక్కో ముక్కను అన్ని వైపులా బాగా కాల్చి తీయాలి ∙వేడి వేడిగా వడ్డించాలి.
నోట్‌: ఇలాగే చికెన్‌తోనూ తయారుచేసుకోవచ్చు. 

మటన్‌ బిర్యానీ 
కావల్సినవి:బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్‌ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగి వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్‌ స్పూన్‌; పసుపు – అర టీ స్పూన్‌; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్‌ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి); మసాలా (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్‌ మిరియాలు, అర టీ స్పూన్‌ సాజీర) ; రైస్‌ మసాలా: (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)

తయారి: బేసిన్‌లో మటన్‌ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి ∙కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, తగినంత ఉప్పు వేసి బియ్యం ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి ∙తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి ∙మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్‌ వేసి కలపాలి ∙పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి ∙సగం ఉండికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి ∙ మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి ∙డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి ∙సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి ∙తర్వాత వేడి వేడిగా వడ్డించాలి.

గోంగూర మటన్‌
కావాల్సినవి:గోంగూర ఆకులు (శుభపరిచినవి) – 250 గ్రాములు; బోటి (మేక మాంసం) – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత ; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – టీ స్పూన్‌; గసగసాలు – టీ స్పూన్‌ 

తయారి:మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లు వంపేసి, చల్లారిన తరువాత  ముక్కలు చేయాలి. పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి వేయించాలి.  ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించి, గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి. 

భేజా ఫ్రై

కావల్సినవి:మేక బ్రెయిన్‌ (భేజా)– 200 గ్రాములు; టొమాటో తరుగు – కప్పు; ఉల్లిపాయ తరుగు – కప్పు ; పచ్చిమిర్చి చీలికలు – 3 ; కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌; మిరియాలు (కచ్చాపచ్చాగ దంచాలి) – 10 ; కారం – అర టీ స్పూన్‌; ధనియాల పొడి – అర టీ స్పూన్‌; జీలకర్ర – అర టీ స్పూన్‌; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – తగినంత

తయారీ:మరుగుతున్న నీళ్లలో పసుపు, ఉప్పు వేసి భేజాను 2–3 నిమిషాలు ఉంచాలి ∙తరువాత నీళ్లను వడకట్టాలి ∙గట్టిపడిన భేజాను ముక్కలుగా కట్‌ చేయాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక జీలకర్రను చిటపటలాడించాలి ∙దీంట్లో ఉల్లిపాయ తరుగు వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙దీంట్లో టొమాటో తరుగు వేసి మరో 3–4 నిమిషాలు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి మరో అర నిమిషం కలపాలి ∙దీంట్లో ఇతర మసాలా పొడులు వేసి, గరిటెడు నీళ్లు కలిపి ఉడికించాలి ∙మిశ్రమం చిక్కగా అయ్యాక కట్‌ చేసిన భేజాను వేయాలి ∙ఎక్కువ కలపకుండా నూనె కూరనుంచి వేరయ్యేదాక ఉడికించాలి ∙చివరగా మంటతీసేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి దించాలి. 

పాయా షోర్బా
కావల్సినవి: మటన్‌ ముక్కలు(పాయా/కండ ఉన్న ఎముకలు) – 10–15; వెల్లుల్లి – 8 రెబ్బలు; ఉల్లిపాయలు – 4 ; పసుపు – అర టీ స్పూన్‌; లవంగాలు – 5; పచ్చ యాలక్కాయలు – 4 ; లవంగాలు – 6 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉప్పు – తగినంత ; నెయ్యి – అర కప్పు ; కారం – అర టీ స్పూన్‌; మిరియాల పొడి – అర టీ స్పూన్‌; కొత్తిమీర – చిన్న కట్ట; గరం మసాలా – టీ స్పూన్‌; నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌

తయారి:మటన్‌ని శుభ్రపరుచుకొని పక్కనుంచాలి ∙2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙మరో రెండింటిని వెల్లుల్లితో కలిపి ముద్దచేసి పక్క నుంచాలి ∙పెద్ద మందపాటి గిన్నె15–16 కప్పుల నీళ్లు, మటన్‌ ముక్కలు వేసి ఉడికించాలి ∙దీంట్లో ఉల్లిపాయ ముద్ద, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి ∙విడిగా ఒక పాన్‌ను స్టై మీద పెట్టి నెయ్యి వేసి, దాంట్లో ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి ∙ చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి ∙పాయ నుంచి ముక్క కొద్దిగా విడేదాకా ఉడికించాలి ∙తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి ∙నిమ్మరసం కలిపి వేడి వేడిగా రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి.

మటన్‌ ఫ్రై
కావల్సినవి:మటన్‌ ముక్కలు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్‌; అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్‌; మొక్కజొన్న పిండి – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; మైదా – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; కొత్తిమీర – టీ స్పూన్‌; నూనె – తగినంత
తయారి: ∙మటన్‌ను కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించాలి ∙నీళ్లన్నీ ఇంకిపోయాక నిమ్మ రసం కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి ∙తర్వాత మటన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా వేసి కలపాలి ∙కడాయిలో తగినంత నూనె వేసి మటన్‌ని బాగా వేయించాలి ∙చివరగా కొత్తిమీర చల్లి దించాలి. నిమ్మముక్కతో వడ్డించాలి.

మటన్‌ కర్రీ
కావల్సినవి: బోన్‌లెస్‌ మటన్‌ – అర కేజీ; జీలకర్ర – అర టేబుల్‌ స్పూన్‌; ఉల్లిపాయల తరుగు – కప్పుడు; గసగసాల పేస్ట్‌ – అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; ధనియాల పొడి – టేబుల్‌ స్పూన్‌; పసుపు – అర టీ స్పూన్‌ ; కారం – అర టీ స్పూన్‌; బిర్యానీ ఆకులు – 2 ; లవంగాలు – 8 ; ఆకుపచ్చ ఇలాచీలు – 8 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత 

తయారి: ∙కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి ∙గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి. దీంట్లో మటన్‌ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు ∙చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి.

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  

మరిన్ని వార్తలు