ఇండియన్‌ ఫుడ్‌కు భారీ డిమాండ్‌.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు

8 Oct, 2023 16:47 IST|Sakshi

భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి.  భారత్‌ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆ‍క్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది.

అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది.

ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్‌ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు.

బాస్మతి బియ్యానికి డిమాండ్
భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్‌ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది.  అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్‌,  యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. 

చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్‌మెంట్) కీర్తి మేఘనాని కూడా  ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు.

GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు.

భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్‌ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు