బరువైన బాధ్యతలు

24 May, 2018 00:19 IST|Sakshi

చెట్టు నీడ 

పాదుషాగారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. రాజుగారు మరెన్నో రోజులు బతకరని వైద్యులు చెప్పారు. ఆయనకు వారసులు లేకపోవడంతో పాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలనే సమస్య వచ్చిపడింది. ‘‘ఎవరైతే నేను చనిపోయాక ఒక్కరోజుపాటు నా సమాధిలో నాతో పాటు నిద్రిస్తారో అలాంటి వారిని రాజుగా ఎన్నుకోవాలి’’ అని వీలునామా రాసి రాజ్యంలోని నలుమూలలా ప్రకటన చేయించాడు రాజుగారు. ఈ వింత ప్రకటనకు అంతా భయంతో కంపించిపోయారు. ఒక్క రాత్రి సమాధిలో ఉంటే చాలు.. రాజ్యమంతా తన హస్తగతమవుతుందనే దురాశతో ఒక దేశదిమ్మరి రాజుగారి షరతుకు అంగీకరించాడు. త్వరలోనే రాజుగారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ దేశదిమ్మరి రాజుగారి సమాధిలో రాజుగారితో బాటు ఒక్కరోజు గడిపేందుకు సిద్ధమయ్యాడు. రాజుగారితో పాటు ఆ దేశదిమ్మరిని కూడా ఖననం చేశారు. ఆ రోజు రాత్రి సమాధిలోకి భయంకరమైన ఆకృతితో దైవదూతలు వచ్చి ‘‘లే నీ లెక్క చూపు’’ అని గద్దించారు.  ‘‘నేను లెక్క చెప్పడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఒకే ఒక్క గాడిదతో జీవితాన్ని నెట్టుకొచ్చాను’’ అని బదులిచ్చాడు ఆ దేశదిమ్మరి. అంతలో దేవదూతలు అతని కర్మల చిట్టా విప్పి చూశారు.

‘‘ఫలానా రోజు నీ గాడిదను పస్తులుంచావు. ఫలానా రోజున గాడిదపై శక్తిని మించిన బరువు మోపి చితకబాదావు’’ అని చదివి వినిపించారు. నిజమేనని ఒప్పుకున్నాడు దేశదిమ్మరి. అతనికి రెండు వందల కొరడా దెబ్బల శిక్ష విధించారు. తెల్లారేవరకూ కొరడా దెబ్బలు పడుతూనే ఉన్నాయి.సూర్యోదయం కాగానే ప్రజలంతా తమ కొత్త పాదుషాను ఘనంగా ఆహ్వానించాలని సమాధిని తవ్వారు. బయటకు రాగానే బతుకుజీవుడా అనుకుంటూ కాలిసత్తువకొద్దీ పరుగు తీశాడు ఆ దేశదిమ్మరి. ‘పాదుషా గారు ఎటు వెళుతున్నారు!’ అని అందరూ కంగారుగా అడిగారు. ‘అయ్యా! కేవలం ఒక్క గాడిద విషయంలోనే లెక్క చెప్పుకోలేకపోయాను. ఇక రాజుగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాజ్యానికి సంబంధించిన లెక్కలు ఇవ్వడం నా వల్ల అయ్యే పనికాదు’’ అందుకే నేను ఈ బాధ్యత తీసుకోదలచుకోలేదు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి పరుగు తీశాడు దేశదిమ్మరి.              
–  ఉమైమా

మరిన్ని వార్తలు