తిరిగిరాని క్షణం... కాంతికన్నా వేగం!

31 Dec, 2014 23:57 IST|Sakshi
తిరిగిరాని క్షణం... కాంతికన్నా వేగం!

సృష్టిలో, మనకు తెలిసినంత వరకు అత్యంత వేగంతో ప్రయాణించేది ‘కాంతి’. సెకనుకు లక్షా ఎనభై ఆరు వేల మైళ్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. అయితే సూర్యునిలో తరచు సంభ విస్తుండే సునామీని మించిన అగ్ని తుపానులు, మహావిస్ఫోటాలు కలిగినప్పుడు ఉద్భవించే అతి సూక్ష్మ ధూళి కణాలైన ‘న్యూట్రినో’లు... వేగంలో కాంతితో పోటీపడి మరీ ఈ విశ్వంలోకి దూసుకెళ్తాయని ఇటీవల ‘నాసా’ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు!
 
అయితే వీటన్నిటినీ మించి వేగంగా ప్రయాణించినట్టనిపించేది మరొకటుందనిపిస్తుంది. అదే ‘గతించిపోయిన కాలం’.  సూర్యుడు ఆవిర్భవించి నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలైందని శాస్త్రజ్ఞుల అంచనా. అంటే ఇప్పటికి క్షణికంలో అన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయాయన్న మాట. నిమిషానికి అరవై సెకన్లు. సెకనును వంద కోట్ల భాగాలుగా విభజించినప్పుడు దానిని ‘నానో సెకను’ అంటారు.
 
మీరు ఈ వాక్యం చదివే లోపు కొన్ని లక్షల నానో సెకన్లు గతించి పోతాయి. వాటిలో ఒక్క సెకనును కూడా వెనక్కు లాగే శక్తి మనకు లేదు. కనుక మానవ జీవితం నూరు సంవత్సరాలైనా, అంతకు మించినా, అది కాలయానంలో అతి సూక్ష్మమైన, అణువు కన్నా సంక్షిప్తమైనదని చెప్పాలి. మనకు ముందు కొన్ని వేల, లక్షల తరాలు గతించి పోయాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి:

‘మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అది అప్పుడే పూసి, సమసిపోయే గడ్డిపువ్వు లాంటిది’ అని. జీవితకాలం ఇంత సంక్షిప్తమైనప్పుడు, స్వార్థపూరితంగా జీవించి ప్రయోజనం ఏమిటి? బైబిల్‌లో ఇలా ఉంటుంది: ‘అన్యాయంగా మీరు సంపాదించుకున్న వాటికి మీ పేర్లు, పిల్లల పేర్లు పెట్టుకుంటారు కానీ చివరకు అవి అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ నీతియుక్తంగా లభిస్తాయి. అంతకుమించిన నిత్యజీవానికి, పరలోక రాజ్యానికి మీరు వారసులవుతారు’ అని. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి.
 
- యస్.విజయ భాస్కర్

మరిన్ని వార్తలు