ఇంకొక్క చాన్స్ ఇవ్వండి

24 Nov, 2013 23:07 IST|Sakshi
ఇంకొక్క చాన్స్ ఇవ్వండి

వాణి ఓ అబ్బాయిని ప్రేమించింది. తండ్రి అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఆరు నెలలు తిరగకముందే ఆ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దానికి ఆమె కారణాలు ఆమెకున్నాయి. వాణి భర్త దిలీప్ ఆవేశపరుడు. ఎక్కడ చెడు జరిగినా మండిపడతాడు. తనకు సంబంధం లేకపోయినా అన్యాయం జరిగినవాళ్ల పట్ల వకాల్తా పుచ్చుకుని మాట్లాడతాడు. అలా చాలాసార్లు గొడవల్లో ఇరుక్కున్నాడు. చివరకు తన కొలీగ్‌కి అన్యాయం చేసిందని యాజమాన్యంతో గొడవ పెట్టుకుని ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

ప్రతిసారీ అతడు ఏదో ఒకటి చెబుతుంటే కన్విన్స్ అయ్యే వాణి ఈసారి కాలేకపోయింది. అతడితో కాపురం చేయలేనని పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి చెబుతున్నా వినకుండా వాణి తన భర్తకు దూరంగా వెళ్లిపోయింది. కానీ సంతోషంగా మాత్రం లేదు. కొన్నాళ్ల తర్వాత దిలీప్‌ని మొదట్నుంచీ గమనించిన వాణి స్నేహితురాలు అతడిని పెళ్లి చేసుకుంది. అతడి  అభిప్రాయాల్ని గౌరవించి, జీవితాన్ని ఆనందమయం చేసుకుంది. అప్పుడుగానీ తాను కోల్పోయిందేంటో తెలిసి రాలేదు వాణికి.
 
 ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఇద్దరు మనుషులు ఓ చోట ఉన్నప్పుడు అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అంతమాత్రాన ఆ బంధానికి ముగింపు చెప్పేయడం సరికాదు.  వాణినే తీసుకుంటే... తన భర్తని తప్పుబట్టింది. కానీ అదే వ్యక్తితో మరో స్త్రీ ఆనందంగా జీవితాన్ని సాగించగలిగింది..! తప్పెవరిది?
 
 చెప్పేదేమిటంటే...అందరూ ఒకలా ఉండరు. మనల్ని వేరేవారిలా ఉండమంటే ఉంటామా! అలాంటప్పుడు అవతలివాళ్లను మనలా ఉండమనడం కరెక్టేనా? ప్రేమిస్తే వారిలోని లోపాల్ని, వారి అభిప్రాయాల్ని, సిద్ధాంతాల్ని కూడా ప్రేమించాలి. అప్పుడు వారు చేసేది తప్పు అనిపించదు సరికదా, వారికి అండగా నిలిచేందుకు మన మనసు సిద్ధపడుతుంది. అలా అని భర్త నిజంగా తప్పు చేసినా భరించమని చెప్పడం లేదు. అవగాహనా లోపంతో వారు చేసే పనిని తప్పు పట్టవద్దని మాత్రమే చెప్పేది. అలా చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లెవరూ సంతోషంగా ఉండరు. మీరు మాత్రం అలా చేయకండి. విలువైన బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. మీ రిలేషన్‌షిప్‌కి ఇంకొక్క చాన్స్ ఇవ్వండి!
 
 - బాధితురాలి స్నేహితురాలు
 (దిలీప్ రెండో భార్య కాదు), హైదరాబాద్

 

మరిన్ని వార్తలు