అమ్మతోడు... నిజంగా బొమ్మలే!

30 Dec, 2013 00:06 IST|Sakshi
అమ్మతోడు... నిజంగా బొమ్మలే!

‘అచ్చు బొమ్మలా ఉంది!’
 ‘బొమ్మలా ఉంది కాదు బొమ్మే’
 ‘నిలువెత్తు మనిషిని పట్టుకొని బొమ్మ అంటావేమిటి?’
 ‘అది ఆయన మహిమ!’
 ‘ఎవరాయన?’
 ఆయన గురించి....

       
ఆయన పేరు...రాన్ మ్యూక్. లండన్‌లో ప్రసిద్ధ ఆర్టిస్ట్. 1996 నుంచి రకరకాల శిల్పాలను రూపొందిస్తున్నాడు. 30వ ఏట జీవిక కోసం రకరకాల బొమ్మలు తయారుచేస్తూ ఉండేవాడు. మీడియాలో పెద్దగా కనిపించని, వినిపించని రాన్ తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుపోతాడు.
 
 దైనందిన జీవితంలో మనకు కనిపించే దృశ్యాలను ఆయన శిల్పాలుగా రూపుదిద్దుతాడు. దీనిలో భాగంగా కొన్ని శిల్పాలైతే మామూలుకంటే ఎక్కువ సైజ్‌లో  ఉంటాయి. చిన్న సైజులో రూపొందించినా, పెద్ద సైజులో రూపొందించినా సైజుతో సంబంధం లేకుండా ప్రతి కోణంలో వాస్తవికత దర్శనమిస్తుంది.
 రాన్‌లోని ప్రతిభపాటవాలు, సాంకేతికపరిజ్ఞానం సినిమాలలో స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఉపయోగపడుతున్నాయి.
 ‘‘మీ సబ్జెక్ట్ ఏమిటి?’’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చే సమాధానం...
 ‘‘సాధారణ ప్రజలు’’
 సాధారణ ప్రజల జీవితంలోని అసాధారణ సౌందర్యాన్ని నిశ్శబ్దంగా రూపుదిద్దిస్తున్నాడు రాన్.
 
 శిల్పాలకు పెట్టే పేర్లు కూడా చాలా సాధారణంగా ఉంటాయి.
 1997లో రాయల్ అకాడమీలో తన తండ్రి బొమ్మను ప్రదర్శనకు పెట్టి సంచలనం సృష్టించాడు రాన్.
 
 ‘అప్పుడే పుట్టిన పాప’ బొమ్మ ‘మోస్ట్ షాకింగ్ క్రియేషన్’గా పేరు తెచ్చుకుంది.
 ‘‘అవి ఫైబర్‌గ్లాస్ కళారూపాలు కావు... నిజంగా మనుషులే అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అవార్డ్ ఏమిటి?’’ అంటున్నాడు.
 
 తన కళారూపాలను కేవలం బొమ్మలుగానే చూస్తే తాను విఫలమైనట్లేనని చెబుతున్న రాన్, అవి అనుభూతులు పంచే వేదికలు కావాలని  ఆశిస్తున్నాడు.
 
 బొమ్మలు తయారుకావాలంటే బంకమన్ను, ప్లాస్టర్, మిక్స్చర్ ఆఫ్ ఫైబర్‌గ్లాస్, సిలికాన్, రెజిన్... మొదలైనవి ఆయన చేతిలో ఉండాల్సిందే. అయితే వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తలలో బ్రహ్మాండమైన సృజన ఉంది. అది అద్భుతాలు సృష్టిస్తూనే ఉంటుంది.
 

మరిన్ని వార్తలు